కడపలో ‘ఎర్ర’ గ్యాంగ్ అరెస్ట్...ముఠాలో నలుగురు కర్నూలు, ఇద్దరు ‘అనంత’ జిల్లా వాసులు
ఏపీలో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. పెద్ద సంఖ్యలో నేరస్తులు అరెస్టవుతున్నా, మళ్లీ కొత్తగా నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కడప జిల్లా చాపాడు వద్ద పోలీసుల తనిఖీలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా పట్టుబడింది. నిందితుల నుంచి రూ.25 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిది అనంతపురం జిల్లా కాగా, మిగిలిన నలుగురిది కర్నూలు జిల్లాగా తేలింది. రెండు వేర్వేరు జిల్లాలకు చెందిన స్మగ్లర్లు ముఠాగా ఏర్పడి తమది కాని మరో జిల్లాలోకి చొరబడి పట్టుబడటం గమనార్హం.