Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ జడ్జీ విచారణతో న్యాయం జరగదు...మత్తయ్య పిటీషన్ విచారణపై హైకోర్టుకు స్టీఫెన్ ఫిర్యాదు

ఓటుకు నోటు కేసులో కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ నిన్న హైకోర్టులో ఓ అనుబంధ పిటీషన్ దాఖలు చేసి సంచలనం రేపారు. తనపై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన కేసు చెల్లదంటూ ఈ కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య దాఖలు చేసిన పిటీషన్ పై గతవారం జరిగిన విచారణపై స్టీఫెన్ సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాక సదరు విచారణను చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు బెంచ్ నుంచి సదరు పిటీషన్ ను వేరే బెంచ్ కు మార్చాలని ఆయన కోర్టును కోరారు. జస్టిస్ శివశంకరరావు విచారణతో న్యాయం జరగదని కూడా స్టీఫెన్ సన్ పేర్కొన్నారు. ఈ మేరకు స్టీఫెన్ సన్ నిన్న హైకోర్టులో అనుబంధ పిటీషన్ ను దాఖలు చేశారు. కోర్టుపై తనకు ఎలాంటి దురభిప్రాయం లేదని పేర్కొన్న స్టీఫెన్ సన్, తాను కేవలం న్యాయం కోసమే ఈ అభ్యర్థన చేస్తున్నానని కోర్టుకు తెలిపారు. ఈ పిటీషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

More Telugu News