: ‘లీడర్’ సీఎంగా కేసీఆర్... వ్యక్తిగత సిబ్బంది యోగ క్షేమాలపై ఆరా!

వెరైటీ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లీడర్’ చిత్రం గుర్తుందిగా? టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా తెరంగేట్రం చేసిన ఆ సినిమాలో సీఎం పీఠమెక్కిన హీరో తన వ్యక్తిగత సిబ్బందికి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పడమే కాక, భద్రతా సిబ్బందితో కలిసి భోజనం కూడా చేస్తాడు. అచ్చం అలాంటి సీనే నిన్న రియల్ గా జరిగింది. అది కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ‘లీడర్’ సీఎంగా కొత్త అవతారమెత్తారు. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని కాస్త ఉల్లాసంగా గడిపిన కేసీఆర్, అధికారిక కార్యక్రమాల తర్వాత తన క్యాంపు కార్యాలయంలో వ్యక్తిగత సిబ్బందితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన ముఖ్య భద్రతాధికారి నరేందర్ సింగ్, సిబ్బందిని కేసీఆర్ కు పరిచయం చేశారు. కేసీఆర్ కూడా సిబ్బందిని పేరు పేరునా పిలిచి, ఆప్యాయంగా పలకరించారు. బాగున్నారా? ఇబ్బందేమైనా ఉందా? అంటూ ఆయన వారి యోగక్షేమాలపై ఆరా తీశారు. భద్రతా సిబ్బందితో పాటు కార్యాలయంలో చిన్న స్థాయిలో పనిచేసే ఉద్యోగులను కూడా పిలిపించుకుని మాట్లాడారు. అంతేకాక సిబ్బందితో విడివిడిగా ఫొటోలు దిగారు. కేసీఆర్ తమతో ఆప్యాయంగా మెలగడంతో సిబ్బంది కూడా ఆనందంలో మునిగితేలారు.

More Telugu News