: ఆ డ్రెస్ మిస్టరీని ఛేదించిన ఎంఐటీ సైంటిస్టులు
కొందరికి తెలుపు, బంగారు వర్ణంలో; మరికొందరికి నీలం, నలుపు రంగుల్లో కనిపిస్తూ, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన డ్రెస్ మిస్టరీని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) సైంటిస్టులు ఛేదించారు. సుమారు 1400 మందిని పైగా ప్రశ్నించి డ్రెస్ మిస్టరీని చెబుతూ ఎంఐటీ సైంటిస్టులు చేసిన అధ్యయనం 'కరెంట్ బయాలజీ' జర్నల్ లో ప్రచురితమైంది. దాదాపు నాలుగు నెలల క్రితం క్యాట్లిన్ మెక్ నీల్ (21) అనే సింగర్ తాను ధరించిన బ్లూ అండ్ బ్లాక్ డ్రెస్ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ డ్రెస్ పలువురికి వైట్ అండ్ గోల్డ్ కలర్ లో కనిపిస్తుండడంతో ఆ చిత్రానికి ఎంతో ప్రచారం లభించింది. ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ సైతం ఈ 'కలర్' చర్చలో పాల్గొంది. దీంతో రంగంలోకి దిగిన ఎంఐటీ, సహజ సూర్య వాతావరణంలో ఎక్కువ సేపు గడిపేవారికి ఆ డ్రెస్ తెలుపు, బంగారు వర్ణంలో కనిపిస్తోందని, కృత్రిమ లైటింగులో గడిపేవారికి బ్లూ అండ్ బ్లాక్ లో కనిపిస్తోందని తేల్చారు.