: తిరుగుబాటలో భారతీయులు... భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమే కారణమట!
ఉద్యోగాల పేరిట విదేశాలకు తరలివెళ్లిన భారతీయులు తిరుగుబాట పట్టారు. స్వదేశీ ఉద్యోగాలే బెటరంటూ భారత్ కు తిరిగి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఇది మరింత వేగం పుంజుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, స్థిరమైన వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో స్వదేశీ కొలువులే బెటరంటూ ఇంటిబాట పడుతున్న ఉద్యోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జీవన ప్రమాణాలు, అందుబాటులో పిల్లల విద్యతో పాటు కుటుంబ కారణాలతోనూ ఉద్యోగులు స్వదేశీ బాట పడుతున్నారు.
ఒక్క ఐటీ రంగంలోనే కాక బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా, ఆటో, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 2008 నాటి విపత్కర పరిస్థితుల కారణంగా స్వదేశీ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని భావిస్తున్న బ్యాంకుల యోచన కూడా ఇందుకు దోహదం చేస్తోంది. స్వదేశీ బాట పడుతున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న దరిమిలా, కంపెనీలకు కూడా కాస్తంత వెసులుబాటు లభిస్తోంది. గతంలో రూ.50 లక్షల వేతనానికి లభించే ఉద్యోగి, ప్రస్తుతం రూ.30 లక్షలకే దొరుకుతున్నారని ఆయా కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి.