: అమెరికా వైమానిక దాడుల్లో 'ఇసిస్' చీఫ్ కు గాయాలు!
ఇరాక్ లోని 'ఇసిస్' (ISIS) స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్- బాగ్ధాదీ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం రాత్రి అమెరికా యుద్ధ విమానాలు సిరియా సరిహద్దుల్లోని ఇరాకీ పట్టణం అల్- కాయిమ్ పై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో కొందరు 'ఇసిస్' తీవ్రవాదులు చనిపోవడంతో పాటు పెద్ద సంఖ్యలో గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గాయపడ్డ వారిలో బాగ్ధాది ఉన్నాడని, అతడికి తీవ్ర గాయాలయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అమెరికా సైన్యం మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. అలాగని ఈ సమాచారాన్ని ఖండించనూ లేదు. దీనిపై పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే, ప్రకటన చేయాలని ఆ దేశ సైన్యం భావిస్తున్నట్లు సమాచారం.