: అవసరమైతే... టెలికాం అధికారులను అరెస్ట్ చేయండి: చంద్రబాబు
హుదూద్ తుపాను బీభత్సం నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టెలికాం అధికారులను అరెస్ట్ చేయండని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపింది. తుపాను కారణంగా విశాఖలో మునుపెన్నడూ లేని విధంగా బీభత్సం జరిగింది. దీనిపై మూడు రోజులుగా సమీక్షిస్తున్న చంద్రబాబు, మంగళవారం నాటికి కూడా టెలిఫోన్ సేవలు పునరుద్ధరణ కాకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు.
‘‘ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రజలను ఆదుకునేందుకు టెలికాం కంపెనీలు ముందుకు రావాల్సి ఉంది. ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు లాభాలు జేబులో వేసుకునేందుకే టెలికాం కంపెనీలు పరిమితం కారాదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేయూతనందించాల్సిందే. ఈ మేరకు వారు స్పందించిన దాఖలా లేదు. అందుకే అవసరమైతే టెలికాం సంస్థలకు చెందిన అధికారులను అరెస్ట్ చేయాలని పోలీసులను అదేశించాను’’అని చంద్రబాబు చెప్పారు.