: 42 శాతం మంది భారత బాలికలు 13 ఏళ్లకే అకృత్యాలకు గురవుతున్నారు: యూనిసెఫ్

స్త్రీని దైవంగా పూజించే భారత్ లో మహిళలపై జరుగుతున్న దారుణాలు అనేకం. అంతేకాక, చిన్నారులు అని కూడా చూడకుండా కొందరు భారత మగాళ్లు అకృత్యాలకు తెరతీస్తున్న వైనాన్ని తాజాగా యూనిసెఫ్ నివేదిక బహిర్గతం చేసింది. భారత్ లోని 42 శాతం మంది మహిళలు 13 ఏళ్ల వయసులోపే అత్యాచారాలకు గురవుతున్నారని ఆ నివేదిక కఠిన వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా లింగసూగూర్ తాలూకాలో ఇటీవల 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల వృద్ధుడు, ఆ బాలికపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ కు చెందిన కొంతమంది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బాలికను రక్షించడంతో పాటు నిందితులను పోలీసులకు పట్టించారు. ఈ కేసులో బాలికను వృద్ధుడికిచ్చి పెళ్లి చేసిన ఆమె తండ్రి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై యూనిసెఫ్ ‘హిడెన్ ఇన్ ప్లెయిన్ సైట్’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు ఆశ్చర్యకర అంశాలున్నాయి. భారత్ లోని ప్రతి 50 మంది మహిళల్లో ఒకరు పదేళ్ల లోపే లైంగిక దాడులకు గురవుతున్నారట. 2005-13ల మధ్య భారత్ లో జరిగిన జనాభా, ఆరోగ్య సర్వేల నివేదికల ఆధారంగా యూనిసెఫ్ ఈ నివేదికను రూపొందించింది. 10-14 వయసు మధ్య 10 శాతం మంది బాలికలు లైంగిక దాడులకు గురవుతుండగా, 15-19 ఏళ్ల మధ్య వయసులోనే 30 శాతం మంది మహిళలు ఈ తరహా వేధింపులు ఎదుర్కొంటున్నారట. భారత్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అరుదుగా మాత్రమే వెలుగు చూస్తున్నాయని యూనిసెఫ్ మాజీ కౌన్సిలర్ సుచిత్రా రావు వెల్లడించారు.

More Telugu News