: మమతకు మధ్యాహ్నం వరకు గడువు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్నికల సంఘం (ఈసీ) హెచ్చరించింది. తమ ఆదేశాల ప్రకారం తక్షణం అధికారులను బదిలీ చేయాలని అల్టిమేటం జారీ చేసింది. లేకుంటే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలను రద్దు చేసే అధికారం తమకు ఉందని ఘాటుగా హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఇతర వ్యవహారాల్లో అధికారులు తృణమూల్ కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో ఐదుగురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయాలని ఈసీ మమతా సర్కారును ఆదేశించింది. ఇందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. అవసరమైతే ఈ విషయంలో జైలుకైనా వెళతానని ఆమె ఈసీకి సవాల్ విసిరారు. దీంతో ఈసీ మమత సర్కారుకు తాజా హెచ్చరికలు జారీ చేసింది. నేటి మధ్యాహ్నం 2.30గంటల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.