: రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటుతున్నాయి: బొత్స

రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విభజన అడ్డుకునేందుకు తమ దగ్గర అస్త్రాలు ఉన్నాయని కొందరు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. హై కమాండ్ విభజన నిర్ణయం చేసింది కనుక, ఇక నుంచి రాష్ట్రాన్ని అందరం కలిసి బాగు చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. పదవులు తమకు ముఖ్యం కాదని అన్నారు. రాజకీయ సంక్షోభం సృష్టిస్తే విభజనను ఆపవచ్చని తాను గతంలోనే సూచించానని, అప్పుడు ఎవరూ తనకు మద్దతు పలకలేదని ఆరోపించారు.

తాను వెనుకబడిన ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చానని, అందుకే తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన విమర్శించారు. సామాన్య ప్రజానీకం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కడుపు చేతబట్టుకుని హైదరాబాద్ వస్తారని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పదవుల్ని త్యాగం చేద్దామని ప్రజాప్రతినిధులకు సూచించారు. డబ్బు మదంతో కొంతమంది తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు అని కొంతమంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని బొత్స స్వంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. అలజడులు తగ్గించండని ప్రజలకు సూచించారు. అండగా నిలబడతామని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర సమైక్యత కోసం అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడుతున్నాయన్న బొత్స, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి రాష్ట్రాన్ని రాచరికపు రోజులకు తీసుకెళ్లే కుట్ర జరుగుతోందని అన్నారు.

గతంలో అన్ని పార్టీల నేతలు విభజనకు అనుకూలమన్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాన్ని విభజించకపోతే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి సాధిస్తామని బీజేపీ చెప్పిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోతున్నందున ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె ఆపేసేందుకు పిలుపునివ్వాలని సూచించారు.

ఏ రకంగా ముందుకెళ్లాలో కార్యాచరణ రూపొందించుకుని వెళ్లాలని వారిని కోరారు. గతంలో చిన్న చిన్న ఉద్యమాలు జరిగాయని, ఇప్పుడు భారీ ఉద్యమం జరుగుతోందని ఆయన ఉద్యమతీవ్రతను వివరించారు. తమ ఆస్తులు పోతే సంపాదించుకోగలమని, ప్రజల ప్రాణాలు పోతే సంపాదించలేమని బొత్స హెచ్చరించారు.

More Telugu News