తెలంగాణలో అటవీ సాంద్రతను పెంచేందుకు యాదాద్రి విధానంపై (మియావాకి) ప్రభుత్వ దృష్టి

Related image

  • యాదాద్రితో పాటు మరిన్ని ప్రాంతాల్లో మంచి ఫలితాలు, రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిద్దం
  • పరిమిత వ్యయం, తక్కువ ప్రాంతంలో ఎక్కువ చిక్కనైన పచ్చదనం విస్తరణకు మార్గం
  • జీవ వైవిధ్యాన్ని పెంచేందుకు, భూమిలో వర్షపు నీరు ఇంకేందుకు మంచి సౌలభ్యం
  • ఆరవ విడత హరితహారంలో యాదాద్రి మోడల్ అటవీ విధానాన్ని అమలు చేయాలని సీ.ఎం కేసీయార్ ఆదేశం
తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు నాటడం, కొద్ది ఖర్చుతో దట్టమైన పచ్చదనాన్నిపెంచేందుకు తెలంగాణ అటవీశాఖ ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన యాదాద్రి మోడల్ మియావాకి ఫారెస్ట్ పెంపకం మంచి ఫలితాలు ఇస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని చోట్ల ఇదే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. దట్టమైన అటవీ సంపదను, అది కూడా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన చెట్లను పెంచటం ఈ మోడల్ ప్రత్యేకత. ప్రస్తుతం అటవీ శాఖ పెద్ద ఎత్తున చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలకు తోడు, క్షీణించిన అటవీ ప్రాంతాల్లో ఒక్కో ఎకరాను మియావాకి విధానంలో చిట్టడవులుగా మారుస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టుల వల్ల అటవీ భూములు క్షీణించటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామం. దీంతో తక్కువ ప్రాంతంలోనే ఎక్కువ పచ్చదనాన్ని పెంచటం, వాటిని అర్బన్ లంగ్ స్పేస్ లుగా మార్చేందుకు జపాన్ శాస్త్రవేత్త అకీరా మియావాకి ఈ విధానాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఆయన పేరుమీదుగానే మియావాకి మోడల్ గా ప్రసిద్ధి పొందింది.

క్షీణించిన అటవీ ప్రాంతంలో పూర్తి శాస్త్రీయ పద్దతుల్లో మట్టిని ట్రీట్ మెంట్ చేయటం, వర్మీ కంపోస్టును వాడుతూ, ఆ మట్టి స్వభావానికి అనుగుణమైన మొక్కలను గుర్తించి నాటడం, దాదాపు అడుగుకో మొక్క చొప్పిన ఎకరం భూమిలోనే సుమారు నాలుగు వేల వివిధ రకాల మొక్కలను నాటుతారు. పెరిగిన తర్వాత ఒక దానికి మరొకటి అడ్డురాకుండా ఉండేందుకు వృక్ష జాతులు, వాటి ఎత్తు, విస్తరణ ఆధారంగా మొక్కలు నాటుతారు.  ఆ మొక్కల ఎదుగుదలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులను కొనసాగించటం కూడా ఈ మోడల్ ప్రత్యేకత. దాదాపు మూడు లక్షల రూపాయల ఖర్చుతో నలభై ఐదు రోజుల్లో ఒక ఎకరా భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ది చేయవచ్చు.

తెలంగాణలో దీనిని యాదాద్రి మోడల్ గా అమలు  చేస్తున్నారు, కంపా (CAMPA) నిధులను ఈ కొత్త తరహా అటవీ పెంపకం అటవీ శాఖ చేపడుతోంది. ఆవు పేడ, మూత్రంతో తయారు చేసే జీవామృతం లాంటి స్థానిక విధానాలను కూడా దీనికి జోడిస్తున్నారు.  చౌటుప్పల్ దగ్గర తంగేడువనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో ఒక ఎకరా భూమిలో పెంచిన మియావాకి అడవి కేవలం ఏడాదిలోనే మంచి ఫలితాలను ఇస్తోంది. అక్కడ నాటిన మారేడు, నేరేడు, రేల, ఇప్ప, మోదుగు, రోజ్ వుడ్, మద్ది,  వేప, శ్రీ గంధం, తాని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫలం, వెదురు, గోరింటాకు మొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పచ్చదనం అలుముకుంది. ఈ ప్రయోగం ఇచ్చిన ఉత్సాహంతో రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోని క్షీణించిన అడవుల్లో ఈ విధానం అమలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది.

గత యేడాది రాచకొండ, లక్కారం, బీబీనగర్, కొండమడుగు, వీరారెడ్డి పల్లి,  మేడ్చల్ - కండ్లకోయ, కరీంనగర్- పోలీస్ గ్రౌండ్స్, రామగుండం –ఎన్టీపీసీ ప్రాంతాల్లో మియావాకి విధానాన్ని అమలు చేశారు. ఒక్క యేడాదిలోనే మంచి ఫలితాలు సాధించారు. దీంతో ఈ విధానానికి యాదాద్రి మోడల్ గా పేరు పెట్టి పెద్ద ఎత్తున అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కండ్లకోయ ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ పర్యటనలో అక్కడ పెంచిన మియావాకీ ఫారెస్ట్ ను చూసిన చీప్ సెక్రటరీ, రాష్ట్ర మంతటా ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు.  తక్కువ ఏరియాలో ఎక్కువ సాంద్రతతో సహజ సిద్దమైన అడవిని సృష్టించటం, పచ్చదనం పెంపు, స్వచ్చమైన ఆక్సీజన్ పరిసర ప్రాంతాలకు అందించేలా ఈ కొత్త తరహా అడవుల పెంపకం వల్ల తక్షణం కలిగే లాభాలు. అలాగే పట్టణ ప్రాంతాలకు సమీపంలో లభ్యమయ్యే  తక్కువ విస్తీర్ణం భూముల్లో పెంచేందుకు అనువుగా ఉంటుంది.

ఈ విధానంలో ఖర్చు, నిర్వహణ వ్యయం తక్కువ, అలాగే నీరు భూమిలోకి ఇంకే గుణాన్ని పెంచటంతో వర్షపు నీటికి ఆయా ప్రాంతాల్లో ఒడిసి పట్టేవీలవుతుంది. అన్ని రకాల పక్షులు, జంతువులకు ఇవి ఆవాసంగా మారటంతో పాటు, జీవ వైవిధ్య కేంద్రాలుగా కూడా ఉపయోగపడతాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రస్తుతం అభివృద్ది చేస్తున్నఅన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో మియావాకి విధానంలో కొద్ది ప్రదేశంలో మొక్కలు అటవీశాఖ నాటుతోంది. అర్బన్ పార్కులకు వచ్చే సందర్శకులు, విద్యార్థులకు కూడా ఈ విధానంపై అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్ర మంతటా ఈ విధానం అమలు చేయాలని ప్రతీ గ్రామం, పట్టణ ప్రాంతాల్లో కనీసం ఒక్కటైనా యాదాద్రి మోడల్ లో చిక్కని చిట్టడవులను పెంచాలని నిర్ణయించారు. దీంతో అటవీ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖల సమన్వయంతో ఆరవ విడత హరితహారంలో యాదాద్రి మోడల్ ను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

More Press Releases