పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయడుకు డాలాస్ లో ఘనస్వాగతం

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయడుకు డాలాస్
లో ఘనస్వాగతం
డాలస్ టెక్సస్: రాజమహేంద్రవరంలో నెలకొనిఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు పదవీ భాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి డాలస్ నగరం విచ్చేసిన సందర్భంలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందనసభ విజయవంతంగా జరిగింది.

ఉపకులపతి డా. నాయుడు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో పురప్రముఖులతో ఎంతో ఆత్మీయంగా డా. ప్రసాద్ తోటకూర ఏర్పాటు చేసిన సమావేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆంధ్రుల అభిమాన నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు తమ మానసపుత్రికగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం అదే పేరుతో పునః ప్రారంభమైంది అన్నారు. 30 సంవత్సరాలకు పైగా విశ్వవిద్యాలయంతో అనుభందం ఉన్న కారణంగా విభజానానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను ఉపకులపతిగా నియమించిందన్నారు. ప్రభుత్వం, దాతల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పిలుపు మేరకు P-4 పద్ధతిలో పాత భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించవలసిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష, సాహిత్య, కీర్తి, ప్రతిభా పురస్కారాలు, స్మారకోపన్యాసాలు, ప్రతిభావంతులైన విద్యార్ధులకు బంగారు పతకాలు ప్రదానం చెయ్యడానికి ఒక ‘శాశ్వత పురస్కార నిధిని’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములై సహకారం అందించాలని ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు చేసిన విజ్ఞప్తి మేరకు ‘సాహితీ పురస్కారనిధికి’ - పూర్వ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి 4 లక్షలు, ‘ప్రతిభా పురస్కారనిధికి’ - ప్రముఖ ప్రవాసాంధ్ర నాయకులు మురళి వెన్నం 3.50 లక్షలు, ‘కీర్తి పురస్కారనిధికి’ – తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర 2.50 లక్షలు విరాళాలను ప్రకటించారు.

దాతలు ఒకసారి విరాళం ఇస్తే సరిపోతుందని, ఆ మొత్తాలను బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం వివిధ విభాగాలలో పురస్కారాలు అందజేస్తామని, ప్రకటించిన వెంటనే పురస్కార నిధికి 10 లక్షల రూపాయలను విరాళాలు అందించిన ముగ్గురికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా అనేక పురస్కారాలకు విరాళాలు అందించే అవకాశం దాతలకు ఉందన్నారు.

తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుకుంటున్న సాహిత్యకార్యక్రమాల సంఖ్య 92 కు చేరుకుని, ఆరు వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. కేవలం సాహిత్య సమావేశాలకే పరిమితం కాకుండా, సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సమగ్ర సాహిత్యాన్ని ముద్రించడం, సిరివెన్నెల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ సహకారంతో అనకాపల్లిలో ఏర్పాటు చేయడం, మనసు ఫౌండేషన్, కొసరాజు కుటుంబసభ్యుల సహకారంతో జానపద కవిబ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి గారి సర్వలభ్య సాహిత్యాన్ని ముద్రించి అంగరంగ వైభవంగా ఆవిష్కరించుకోగల్గడం తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రయాణంలో కొన్ని మైలురాళ్ళు అన్నారు. ఇప్పుడు పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా 125 ఏళ్ళ తెలుగు కధాప్రస్థానం నుండి 125 తెలుగు కథలను ఎంపికచేసి వాటిని ఆంగ్లంలోకి అనువదించే ప్రణాళికను చేపట్టామని డా. ప్రసాద్ తోటకూర, ఉపకులపతి ఆచార్య డా. మునిరత్నం నాయుడు ఒక సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు రాజమహేంద్రవరంలో నెలకొనిఉన్న పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని డా. ప్రసాద్ తోటకూర పిలుపునిచ్చారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి, డా. ప్రసాద్ తోటకూర ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వారందరు తెలుగులో సంతకాలు చేసిన నిలువెత్తు మహాకవి శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ గ్రంధాన్ని ఉపకులపతి ఆచార్య డా. డి. మునిరత్నం నాయుడు దంపతులకు బహుకరించి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు.
20260601fr6a1cd80e4e3e4.jpg ఈ కార్యక్రమంలో డా. ప్రసాద్ తోటకూర, ఆత్మచరణ్ రెడ్డి, మురళి వెన్నం. తాడిమేటి కళ్యాణి, రఘు, ఆనందమూర్తి, లలితామూర్తి కూచిభొట్ల, నాగరాజు, డా. బీరం సుందరరావు, సతీష్ బండారు, రమణ జువ్వాడి, అనంత్ మల్లవరపు, చినసత్యం వీర్నపు, చంద్ర కన్నెగంటి, NMS రెడ్డి, సుభ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, దయాకర్ మాడ, లక్షి పాలేటి, సమీర శ్రీపాద, ఆచార్య. పర్వతనేని సుబ్బారావు, పర్వతనేని చాంద్, రాయవరం భాస్కర్, రాజా రెడ్డి, నాట్యాచార్యులు కెవి సత్యనారాయణ, ఎంవిఎల్ ప్రసాద్, సురేష్ మండువ, రావు కల్వల, రాజశేఖర్ సూరిభొట్ల, శేషారావు బొడ్డు, రాజేష్ చెరుకుపల్లి, కమలాకర్ దేవరకొండ, తిరుమల రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన పుర ప్రముఖులకు, వేదిక కల్పించిన తిరుమల రెడ్డికి, రుచికరమైన విందు భోజనాన్ని సమకూర్చిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్, సౌత్ లేక్, యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
USA
NRI
Dallas
Prof Muniratnam Naidu
Prasad Thotakura
Atma Charan Reddy
Murali Vennam

Watch Today's Deals on Amazon

More Press News