ఆధ్యాత్మిక పరిమళం ‘శ్రీమాలిక’: నూజివీడు సీడ్స్ ప్రభాకర్ ఉదారత!

ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక వేత్త పురాణపండ శ్రీనివాస్ సంకలనం చేసిన ‘శ్రీమాలిక’ గ్రంథం తెలుగు రాష్ట్రాల్లో భక్తి ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. 400 పేజీల ఈ అపురూప గ్రంథం, ఆగమ శాస్త్ర విశేషాలు, మహిమాన్విత స్తోత్రాలతో ఉపాసకులకు ఒక దివ్య వరంగా మారింది. గత ఏడాది కంచి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ పుస్తకం, ఇప్పటికే 25 పునర్ముద్రణలు జరుపుకోవడం విశేషం.

    
నూజివీడు సీడ్స్ వ్యవస్థాపకులు మండవ వెంకట్రామయ్య స్మృత్యర్థం, ఆయన కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ ప్రభాకర రావు ఈ గ్రంథ ప్రచారానికి నడుం బిగించారు. నూజివీడుతో పాటు జంట నగరాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులకు, ఫ్యాప్సీ (FAPCCI) సభ్యులకు వేలాది ప్రతులను ఆయన పంపిణీ చేశారు. అపమృత్యు భయాలను తొలగించే నృసింహ అవతార ఘట్టాన్ని ఈ గ్రంథంలో పురాణపండ వారు అద్భుతంగా ఆవిష్కరించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించడం ఈ పుస్తక విశిష్టతను చాటుతోంది.

  
రాజకీయ, సామాజిక రంగాల్లోనూ ఈ గ్రంథ పంపిణీ చర్చనీయాంశమైంది. గతంలో కిమ్స్ ఫౌండర్ బొల్లినేని కృష్ణయ్య సహకారంతో తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో వేల ప్రతులను భక్తులకు అందించగా, కుప్పం ప్రాంతంలో నారా భువనేశ్వరి స్వయంగా ముత్తయిదువులకు ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. మానవ జన్మలో సంపాదించే సంపద కంటే, ఇలాంటి పుణ్యకార్యాలే శాశ్వతంగా నిలుస్తాయని నూజివీడు సీడ్స్ యాజమాన్యం మరియు ఉద్యోగ బృందం ఆనందం వ్యక్తం చేశాయి. ఆధ్యాత్మికతను సామాన్యులకు చేరువ చేస్తున్న ఈ 'శ్రీమాలిక' పవిత్ర యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది.

     

More Press Releases