యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిన సినిమాలలో 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' ఒకటి. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మంజునాథ్ దర్శకత్వం వహించాడు. 2015 జనవరిలో థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అడివి శేష్ .. కమల్ కామరాజు .. మహత్ రాఘవేంద్ర .. చైతన్య కృష్ణ నికిత నారాయణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: ఆనంద్ (కమల్ రామరాజు) ఓ బిజినెస్ మెన్. అతను ఎప్పుడూ ఆఫీస్ పనులతో బిజీగా ఉంటూ తనని నిర్లక్ష్యం చేయడాన్ని భార్య ప్రియ (నికిత) తట్టుకోలేకపోతుంది. తనని పెద్దగా పట్టించుకోని భర్త పట్ల ఆమెకి అనుమానం కూడా ఉంటుంది. ఇక విజయ్ (మహత్ రాఘవేంద్ర) ఒక కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతను, అందుకోసం అప్పులు చేస్తూ ఉంటాడు.
కృష్ణమూర్తి (చైతన్య కృష్ణ) విషయానికి వస్తే, అతను కాస్త పద్ధతిగా పెరిగిన కుర్రాడు. అయితే గాళ్ ఫ్రెండ్ లేని కారణంగా అందరూ ఆటపట్టిస్తూ ఉండటంతో, ఎలాగైనా సరే ఒక అమ్మాయిని ముగ్గులోకి దింపాలనే ఉద్దేశంతో ఫేస్ బుక్ ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మొత్తానికి అతని ప్రయత్నం ఫలించి, 'దీప' అనే అమ్మాయి అతని ట్రాక్ లో పడుతుంది. ప్రియ గతంలో తనతో పాటు చదువుకున్న రాహుల్ (అడివి శ్రీనివాస్) పట్ల ఆకర్షితురాలవుతుంది. విలాసాలకు అవసరమైన డబ్బు కోసం విజయ్ పక్కదారి పడతాడు. పర్యవసానంగా వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి? అనేది కథ.
విశ్లేషణ: చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి మనిషి జీవితంలో మార్పు మొదలైంది. సోషల్ మీడియా వలన ప్రేమలు .. పెళ్లిళ్లు .. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో నేరాలు కూడా అంతే స్మార్ట్ గా జరిగిపోతున్నాయి. అందువలన యువత ఇప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన సినిమా ఇది.
ఆకర్షణ .. ప్రేమ .. పెళ్లి అనే మూడు అంశాలను ప్రధానంగా చేసుకుని, ముగ్గురు యువకుల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ ముగ్గురు జీవితాలను సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేసిందనేది దర్శకుడు చూపించిన విధానం బాగానే ఉంది. అయితే ప్రధానమైన కథాంశానికి ఎంటర్ టైన్ మెంట్ ను జోడించడానికి పెద్దగా ప్రయత్నించినట్టు అనిపించదు. అలాగే కథను ఏ మూల నుంచి పరిశీలించినా ఎక్కడా ఎమోషన్ కనిపించదు.
ఆనంద్ - విజయ్ - కృష్ణమూర్తి ట్రాకులను మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. బలమైన ఎమోషన్స్ లేకపోవడం వలన, సన్నివేశాలలో గాఢత కనిపించదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక సస్పెన్స్ లేకపోవడం వలన, ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ఉండదు. సాదాసీదా సన్నివేశాలు అలా సాగిపోతూ ఉంటాయంతే.
పనితీరు: 2015 నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు అనుకున్న లైన్ బాగానే ఉంది గానీ, అది అంత బలంగా .. ఎఫెక్టివ్ గా .. వినోదభరితంగా స్క్రీన్ పైకి రాలేదు. ఆర్టిస్టులంతా కూడా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు. జగన్ చావలి ఫొటోగ్రఫీ ..రఘు కుంచె నేపథ్య సంగీతం .. నవీన్ నూలి ఎడిటింగ్ ఫరవాలేదు.
ముగింపు: జీవితమంటే అర్థం చేసుకోవడం .. జీవితమంటే సర్దుకుపోవడం. ఎంత సుఖంగా బ్రతుకుతున్నామనే దాని కంటే ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామనేదే ముఖ్యం. ఆలోచనలు పక్కదారి పడితే అగమ్యగోచరమే అనే సందేశం ఈ కథలో ఉంది. కాకపోతే అది వినోదాన్ని తోడు చేసుకుని ప్రేక్షకులను అలరించేలా సాగలేదు అనిపిస్తుంది అంతే.
'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Ladies And Gentlemen Review
- చాలా గ్యాప్ తరువాత ఓటీటీకి వచ్చిన సినిమా
- యూత్ ప్రధానంగా సాగే కంటెంట్
- సోషల్ మీడియా ప్రభావమే ప్రధానమైన కథాంశం
- నిదానంగా సాగే కథాకథనాలు
- వినోదం పాళ్లు తగ్గిన సినిమా
Movie Details
Movie Name: Ladies And Gentlemen
Release Date: 2025-09-04
Cast: Adivi Sesh, Nikitha Narayan, Chaithanya Krshna, Kamal kamaraju, Mahat Raghavendra, Swathi Deekshith
Director: Manjunath
Music: Raghu Kunche
Banner: PL Creations
Review By: Peddinti
Trailer