'ఓహో ఎంథన్ బేబీ' తమిళంలో రూపొందిన ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. కృష్ణకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. రుద్ర - మిథిలా పాల్కర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలో అందుబాటులో ఉంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అశ్విన్ (రుద్ర) ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తల్లిదండ్రులు ఇద్దరూ జాబ్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. తనతో ఎలాంటి పరిస్థితులలోను గొడవ పడని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అశ్విన్ నిర్ణయించుకుంటాడు. తల్లిదండ్రులకు దూరంగా, బ్యాచిలర్ బాబాయ్ దగ్గర ఉండటమే బెటర్ అనే ఉద్దేశంతో అతని దగ్గరే చేరతాడు. అతని బాబాయ్ మురళి (కరుణాకరన్), ఓ సినిమా థియేటర్లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. అందువలన అశ్విన్ ప్రతిరోజూ సినిమాలు చూడటం మొదలుపెడతాడు. 
  
ఇక మీరా (మిథిలా పాల్కర్) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతుంది. తల్లితో పాటు మేనమామ పర్యవేక్షణలో పెరుగుతుంది. మేనమామ చాలా కోపిష్టి అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో అతని దగ్గరే ఉండవలసి వస్తుంది. ఏ మాత్రం కోపం తెలియని వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఆమె భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి అశ్విన్ తారసపడతాడు. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. సినిమా దర్శకుడు కావాలనుకున్న అశ్విన్ ను ఆమె ఎంకరేజ్ చేస్తుంది.

అశ్విన్ తో కొంతదూరం ప్రయాణం చేసిన మీరాకి, అతనికి కోపం ఎక్కువనే విషయాన్ని గ్రహిస్తుంది. అతనిని పెళ్లి చేసుకుంటే తన మేనమామకు భయపడుతూ వచ్చినట్టే, మిగతా జీవితమంతా భయపడుతూ బ్రతకవలసి వస్తుందని భావిస్తుంది. మీరా కూడా అవసరమైతే గొడవకి దిగుతుందనే విషయం అశ్విన్ కి స్పష్టమవుతుంది. అప్పుడు వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎటువంటి పరిణామాలను ఎదుర్కుంటారు? అనే మలుపులతో మిగతా కథ నడుస్తుంది. 

విశ్లేషణ:  టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత చాలామంది అబ్బాయిలు .. అమ్మాయిలు ప్రేమలో పడుతూనే ఉంటారు. ప్రేమలో ఎవరు ఎప్పుడు ఎందుకు పడతారనేది ఎవరికీ తెలియదు. దానికి కొన్ని లెక్కలు .. ప్రణాళికలు గట్రా ఏమీ ఉండవు. అలాగే అబ్బాయిలైనా .. అమ్మాయిలైనా అప్పటి వరకూ తాము చూస్తూ పెరిగిన సంఘటనల కారణంగా, తమ జీవితంలోకి అడుగుపెట్టబోయే భాగస్వామి విషయంలో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలాంటి ఒక అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. 

జీవితంలో చాలా మంది తాము చెప్పింది కరెక్ట్ .. తాము చేసింది కరెక్ట్ అనే భావనలో ఉంటారు. అలా కాకుండా సమస్యను ఎదుటివారి వైపు నుంచి చూసినప్పుడు, వాళ్లకి కావలసినదేవిటి? మనం ఇవ్వవలసిన దేవిటి? అనే విషయం అర్థమవుతుంది. మనిషి దూరమైనప్పుడు .. వస్తువు చేజారినప్పుడే విలువ తెలుస్తుంది అనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. ఎమోషన్స్ ను దర్శకుడు మిక్స్ చేస్తూ వెళ్లాడు. కథకి తగిన లొకేషన్స్ .. పాత్రలకి తగిన నటీనటులు ఈ కంటెంట్ ను ఆడియన్స్ కి మరింత చేరువుగా తీసుకుని వెళ్లారు. అక్కడక్కడా అంతగా అవసరం లేని కొన్ని సన్నివేశాలు ఉన్నప్పటికీ, క్లైమాక్స్ సమయానికి అన్నీ సర్దుకుని ఆడియన్స్ ను సంతృప్తి పరుస్తాయి. 

పనితీరు
: ఇది ఈ జనరేషన్ కి సంబంధించిన లవ్ స్టోరీ. కాబట్టి తేలికపాటి ఎమోషన్స్ తో పరిగెడుతూ ఉంటుంది. కంటెంట్ పరంగా చూస్తే, ఇంతకుముందు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఏమీ కనిపించదు. బోర్ అనిపించకుండా అప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అంతే. 

రుద్ర .. మిథిలా పాల్కర్ .. అతిథి పాత్రను పోషించిన విష్ణు విశాల్ .. కరుణాకరన్ అంతా కూడా పాత్రల పరిథిలో మెప్పించారు. మిథిలా పాల్కర్ కి ఇదే ఫస్టు మూవీ అయినప్పటికీ బాగానే చేసింది. హరీశ్ కన్నన్ ఫొటోగ్రఫీ .. జెన్ మార్టిన్ - వేద్ శంకర్ సంగీతం .. ప్రణవ్ ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు: కథాకథనాలలో కొత్తదనమేమీ కనిపించదు. రొటీన్ గానే సాగినా, పెద్దగా బోర్ అనిపించదు. ప్రేమకథలకు ప్రాణం పోసేది పాటలే. ఆ వైపు నుంచి ఈ సినిమాకి లభించిన సపోర్టు అంతంత మాత్రమేనని చెప్పాలి.