'పడక్కలం' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • మలయాళంలో రూపొందిన సినిమా 
  • మే నెలలో జరిగిన రిలీజ్
  • ఫాంటసీని కలుపుకుని సాగే కథాకథనాలు
  • కామెడీ టచ్ తో సరదాగా సాగిపోయే కంటెంట్      
మలయాళంలో రూపొందిన సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ సినిమానే 'పడక్కలం'. మే 8వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర 17 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు నుంచే ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషలలో జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది.

కథ: జితిన్ (సందీప్ ప్రదీప్) ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. అతను జీవిక (నిరంజన)ను ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ల ప్రేమ ఫలించడం కోసం జితిన్ స్నేహితులు ముగ్గురూ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ కాలేజ్ లో షాజీ (సూరజ్ వెంజరమూడు) రంజిత్ (షర్ఫుద్దీన్) ప్రొఫెసర్లుగా ఉంటారు. ప్రమోషన్ కోసం ఇద్దరి మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే షాజీ చిత్రంగా ప్రవర్తించి ఆ ప్రమోషన్ కి దూరమవుతాడు. 

షాజీ అలా ప్రవర్తించడానికి కారణం రంజిత్ సార్ అనీ, అతను తన దగ్గరున్న ఒక బోర్డు ఓపెన్ చేసి ఏవో మంత్రాలు చదవడం తాను చూశానని ఫ్రెండ్స్ తో జితిన్ అంటాడు. ఆ బోర్డు ద్వారా తాము టార్గెట్ చేసిన వ్యక్తిని తమకి తోచినట్టుగా నడిపించవచ్చనే విషయం తనకి అర్థమైందని చెబుతాడు. ఆ బోర్డులో ఏవో శక్తలు ఉన్నాయనీ, అందువల్లనే రంజిత్ సార్ ఆ బ్యాగ్ ని వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉంటాడని అంటాడు. అతని మాటలను మిగతా మిత్రులంతా నమ్ముతారు.    

జితిన్ చెప్పినట్టుగా మిగతా మిత్రులంతా కలిసి రంజిత్ సార్ ను ఫాలో అవుతూ ఉంటారు. అవకాశం చిక్కగానే ఆయన నుంచి ఆ బోర్డును కొట్టేస్తారు. అయితే దానిని ఓపెన్ చేయాలంటే అందుకు అవసరమైన 'కీ' రంజిత్ మెడలో ఉందని గమనిస్తారు. ఆ 'కీ' కొట్టేయడానికి వాళ్లు ఎలాంటి ప్లాన్ వేస్తారు? ఆ ప్రయత్నాల్లో వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అసలు ఆ బోర్డు రంజిత్ కి ఎక్కడిది? దానికి ఆ శక్తులు ఎలా వచ్చాయి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలు .. ఫాంటసీ కథలను చూడటానికి చాలామంది ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాస్తవ జీవితంలో జరగని ఎన్నో విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రేక్షకులను ఊహాలోకంలోకి తీసుకుని వెళుతుంటాయి. కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపిస్తే, మరికొన్ని సంఘటనలు తమాషాగా కనిపిస్తాయి. అలాంటి జోనర్లో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించిందా అంటే .. చాలా వరకూ అందించిందనే చెప్పాలి.

గతంలో ఫాంటసీ టచ్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇలా ఒక కాలేజ్ నేపథ్యంలో .. కొంతమంది స్టూడెంట్స్ కీ .. ప్రొఫెసర్లకు మధ్య ఈ కంటెంట్ ను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. బయట నుంచి విలనిజం లేకుండా, ఉన్న పాత్రల నుంచే అన్ని అంశాలను రాబట్టిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో ప్రధాన పాత్రల మధ్య పరుగులాట కాస్త సరదాగా అనిపిస్తుంది. పెద్దగా గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ను టచ్ చేయడం అభినందించవలసిన విషయమే.

ఈ సినిమాకి స్క్రీన్ ప్లే వేయడం కాస్త కష్టమైనా విషయమే. ఎందుకంటే ఎక్కడ క్లారిటీ లోపించినా ఆడియన్స్ ఆయోమయంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఈ కథను రాజుల కాలంతో మొదలు పెట్టడం ప్లస్ అయింది. ఆ మాయా బోర్డు రాజుల కాలం నుంచి ఎలా చేతులు మారుతూ ప్రొఫెసర్ల వరకూ వచ్చిందనేది రివీల్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది. 

పనితీరు: కథలోను .. కథనంలోను కొత్తదనం కనిపిస్తుంది. సరదాను .. సస్పెన్స్ ను కలిపి నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సాధారణంగా కాలేజ్ లో జరిగే అల్లర్లు .. గొడవలను కలుపంటూనే ఇలాంటి ఒక కాన్సెప్ట్ ను డిజైన్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా చాలా బాగా చేశారు. సందర్భాను సారంగా ఒకరి మాదిరిగా మరొకరు నటించిన విధానం కూడా మంచి మార్కులు పడేలా చేస్తుంది. అనూ ఫొటోగ్రఫీ .. రాజేశ్ మురుగేశన్ సంగీతం .. నితిన్ రాజ్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తాయి. 

ముగింపు: కాలేజ్ క్యాంపస్ కి ఫాంటసీ టచ్ ఇచ్చిన కథ ఇది. కామెడీని .. సస్పెన్స్ ను కలిపి నడిపించిన విధానమే ఈ సినిమాకి ప్రధానమైన బలం. సెకండాఫ్ కాస్త గందరగోళంగా అనిపించినా, కాస్త దృష్టి పెడితే అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ సినిమా చూడొచ్చు. 

Movie Details

Movie Name: Padakkalam

Release Date: 2025-06-10

Cast: Sandeep Pradeep, Suravenjaramoodu, Niranjana Anoop

Director: Manu Swaraj

Producer: Vijay Babu

Music: Rajesh Murugesan

Banner: Friday Film House

Review By: Peddinti

Padakkalam Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews