'విద్యాపతి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • కన్నడంలో రూపొందిన 'విద్యాపతి'
  • ఏప్రిల్ 11న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • యాక్షన్ కామెడీ జోనర్లో సాగే కథ 
  • సరదా కథకుతోడైన సందేశం

కన్నడంలో రూపొందిన యాక్షన్ కామెడీ సినిమానే 'విద్యాపతి'. ఈషమ్ - హసీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. నాగభూషణ - మలైకా వాసుపాల్ జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో కన్నడంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. నెల లోగానే ఓటీటీకి వచ్చిన ఈ సినిమా కథేమిటనేది ఒకసారి చూద్దాం. 

కథ: సిద్ధూ (నాగభూషణ) ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు. ఆయన కుటుంబం తోపుడు బండిపై దోశలు వేస్తూ రోజులు నెట్టుకొస్తూ ఉంటుంది. తల్లి చనిపోవడంతో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడనే ఒక కోపం సిద్ధూకు ఉంటుంది. అందువలన అతను చెల్లెలు 'రష్మీ' భవిష్యత్తును గురించి కూడా ఆలోచన చేయకుండా ఇల్లొదిలి వెళ్లిపోతాడు. సిద్ధూకి ఎంతమాత్రం ఇష్టం లేని పని కష్టపడటం. ఇక అతనికి ఏదంటే మహా చిరాకు అంటే, పేదరికమే అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.  

సిద్ధూకి విలాసవంతమైన జీవితమంటే ఇష్టం .. డబ్బు అంటే ప్రాణం. మొదటి నుంచి కూడా అతను బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. తాను అనుకున్నట్టుగా బ్రతకడం కోసం అతను విద్య (మలైకా వాసుపాల్) కి దగ్గరవుతాడు. అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న విద్యకు మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటాడు. అనాథ అయిన ఆమె తనకంటూ ఒక తోడుకావాలనే ఉద్దేశంతో అతనిని నమ్ముతుంది. విద్యపై ఆధారపడటం వలన, అతనిని అందరూ 'విద్యాపతి' అని పిలుస్తూ ఉంటారు.  

విద్యకు భర్తగా .. ఆమె మేనేజర్ గా అతను రెండు పాత్రలను పోషిస్తూ ఉంటాడు. ఆమెకి తెలియకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే లోకల్ రౌడీ జగ్గూ ( గరుడ రామ్)తో విద్యకి గొడవ జరుగుతుంది. తనని అవమానించిన జగ్గూని తీసుకొచ్చి అతనితో సారీ చెప్పిస్తేనే, తాము కలిసి ఉండటం జరుగుతుందని సిద్ధూతో విద్య తేల్చి చెబుతుంది. అప్పుడు సిద్ధూ ఏం చేస్తాడు? విద్య కోరికను అతను నెరవేర్చగలుగుతాడా? అనేది కథ.       

విశ్లేషణ: కొంతమంది తమ గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. తమ సుఖాలకు .. సంతోషాలకు ఎవరు అడ్డొస్తే వారిని అక్కడే వదిలేస్తారు. ఆ విషయంలో తల్లిదండ్రులకు కూడా మినహాయింపు లేదు. వాళ్ల వలన మోసపోయే వ్యక్తులు మారుతుంటారు .. కానీ వాళ్లు మారరు. అలా  బాధ్యతలకు భయపడుతూ .. సుఖాల వెంట పరుగులు తీసే ఒక యువకుడి కథ ఇది.

పరిమితమైన పాత్రల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్న తీరు బాగుంది. చాలా తక్కువ బడ్జెట్ లో ఆయన ఈ కంటెంట్ ను రెడీ చేసుకున్న విధానం మెప్పిస్తుంది. హీరోయిన్ అప్పుడప్పుడు మాత్రమే తెరపై మెరుస్తూ వెళుతున్నప్పటికీ, ఆమె లేని లోటు తెలియకుండా తెరపై కథ నడుస్తూ ఉంటుంది. హీరో పాత్రకి ఇచ్చిన కామెడీ టచ్ బాగానే వర్కవుట్ అయిందని చెప్పచ్చు. 

బాధ్యతల నుంచి భయపడి పారిపోతున్నంతసేపు అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. భయపడుతున్నంత కాలం ఈ సమాజం నిన్ను భయపెడుతూనే ఉంటుంది. కష్టపడకుండా ఫలితాన్ని పొందినవారు .. సాధన చేయకుండా విజయాన్ని సాధించినవారు లేరు అనే ఒక సందేశంతో కూడిన కథ ఇది. సహజత్వానికి దగ్గరగా నడిచే ఈ కథ ఫరవాలేదనిపిస్తుంది. 

పనితీరు: హీరో .. హీరోయిన్ .. విలన్ .. ఈ మూడు పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ మూడు పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగానే ఉంది. అయితే హీరో - హీరోయిన్ వైపు నుంచి లవ్ .. రొమాన్స్ పాళ్లు తగ్గాయి. అలాగే హీరో ఫ్యామిలీ వైపు నుంచి ఎమోషన్స్ మనసును పట్టుకునేలా ఉండవు. యాక్షన్ కామెడీనే పట్టుకుని కథ పరిగెడుతుంది. 

నాగభూషణ .. మలైకా వాసుపాల్ .. గరుడ రామ్ నటన, పాత్ర పరిధిలో ఆకట్టుకుంటుంది. కామెడీ కంటెంట్ ఉన్న కథలు ఇక నాగభూషణ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు: వినోదానికి సందేశాన్ని జోడిస్తూ తక్కువ బడ్జెట్ లో రూపొందించిన సింపుల్ కంటెంట్ ఇది. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేని ఈ సినిమాను సరదాగా ఓసారి ట్రై చేయొచ్చు. 

Movie Details

Movie Name: Vidyapati

Release Date: 2025-05-05

Cast: Nagabhushana, Malaika Vasupal, GarudaRam, Dhanunjaya

Director: Esham- Haseen

Producer: Daali Dhanunjaya

Music: Dossmode

Banner: Daali Pictures

Review By: Peddinti

Vidyapati Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews