'టచ్ మీ నాట్' ( జియో హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • క్రైమ్ థిల్లర్ జోనర్లో 'టచ్ మీ నాట్' 
  • ప్రధాన పాత్రల్లో నవదీప్ - దీక్షిత్ శెట్టి 
  • కొత్త కాన్సెప్ట్ ను టచ్ చేసిన దర్శకుడు 
  • నిదానంగా .. నీరసంగా సాగిన స్క్రీన్ ప్లే
  • ఆశించినస్థాయిలో ఆకట్టుకోని కంటెంట్        
జియో హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఆ సిరీస్ పేరే 'టచ్ మీ నాట్'. గతంలో ఒకటి రెండు సినిమాలను తెరకెక్కించిన రమణతేజ, ఈ సిరీస్ కి దర్శకుడు. నవదీప్ - కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ గా 7 భాషల్లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది. 'హీ ఈజ్ సైకో మెట్రిక్' అనే కొరియన్ సిరీస్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: హైదరాబాదులో 2009లో ఈ కథ మొదలవుతుంది. దీపావళి పండుగ కావడంతో 'మారుతి అపార్టుమెంటు'లో వాతావరణం చాలా సందడిగా ఉంటుంది. ఆ హడావిడిలోనే నలుగురు మహిళలను ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేస్తాడు. ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి, అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ ప్రమాదంలో రాఘవ్ (నవదీప్) తన తల్లిని కోల్పోతాడు. రిషి (దీక్షిత్ శెట్టి) తన తల్లిదండ్రులను కోల్పోతాడు. 

కాలచక్రంలో పదేళ్లు గడిచిపోతాయి. గతంలో జరిగిన ఆ ప్రమాదం నుంచి రిషిని కాపాడిన రాఘవ, పోలీస్ ఆఫీసర్ అవుతాడు. రిషిని కాలేజ్ లో చదివిస్తూ ఉంటాడు. అయితే గతంలో రిషి తలకి బలమైన గాయం కావడం వలన, అతనికి 'సైకో మెట్రి' అనే ఒక పవర్ వస్తుంది.  అంటే మనుషులను గానీ .. ఏమైనా వస్తువులను గాని టచ్ చేసి, వాటికి సంబంధించిన వివరాలను చెప్పగలిగే శక్తి అతనికి వస్తుంది. ఆ స్కిల్ ను డెవలప్ చేసుకోమని అతణ్ణి రాఘవ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. 

కాలేజ్ లో రిషికి మేఘ ( కోమలి ప్రసాద్) పరిచయమవుతుంది. ఆమె కూడా మారుతి అపార్టుమెంటు బాధితురాలే. ఆ అపార్టుమెంటుకి సెక్యూరిటీగా ఉన్న హరిశ్చంద్ర (దేవి ప్రసాద్) ఆమె తండ్రినే. ఆ సంఘటనకి కారకుడిగా అతను జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. అయితే అప్పటికి చిన్నపిల్లలుగా ఉండటం వలన, మేఘ ఎవరనేది రిషికి తెలియదు. ఇక రాఘవ్ తో పాటు కలిసి పనిచేసే దేవిక (సంచిత పూనాచ) ఆయనను ఇష్టపడుతూ ఉంటుంది.

పదేళ్ల క్రితం మారుతి అపార్టుమెంటులో జరిగిన మాదిరిగానే, ఓ హాస్పిటల్లో అగ్నిప్రమాదం జరుగుతుంది. 20 మంది పేషంట్లు చనిపోతారు. దాంతో మారుతి అపార్టుమెంటు కేసుపైకి మరోసారి తెరపైకి వస్తుంది. అప్పటి సంఘటనకు కారణమైనవారే, ఇప్పటి సంఘటనకు పాల్పడి ఉంటారనే సందేహం తలెత్తుతుంది. ఆ విషయం తెలుసుకోవడానికిగాను, రిషిని ఉపయోగించుకోవాలని రాఘవ అనుకుంటాడు. తన సైకో మెట్రి శక్తితో రిషి ఏం చెబుతాడు? ఎలాంటి నిజాలు బయటికి వస్తాయి? అనేది కథ. 

విశ్లేషణ: ఇతర భాషలలో ఇంతకు ముందే ఈ తరహా కాన్సెప్ట్ ను టచ్ చేసినా, తెలుగులో మాత్రం ఈ కాన్సెప్ట్ ను టచ్ చేయడం ఇదే ఫస్టు టైమ్ అనుకోవాలి. ఈ కథకు ఇద్దరు హీరోలు అనుకోవవలసి ఉంటుంది. ఒకరు పోలీస్ ఆఫీసర్ అయితే, మరొకరు నేరస్థులు ఎవరనేది తెలుసుకోవడానికి అవసరమైన 'సైకో మెట్రి' పవర్స్ ఉన్న వ్యక్తి. దాంతో ఈ సిరీస్ ఒక రేంజ్ లో ఉండటం ఖాయమని అనుకోవడం సహజం. 

ఈ కథలో కొత్త పాయింట్ 'సైకో మెట్రి'. ఈ అంశం చుట్టూ ఈ కథ అంతా కూడా చాలా ఆసక్తికరంగా తిరుగుతుందని అనుకుంటారు. కానీ ఆ స్థాయిలో ఈ అంశం చుట్టూ ఇంట్రెస్టింగ్ డ్రామాను నడిపించలేదు. తనకి గల పవర్స్ ను హీరో లైట్ తీసుకుంటాడు .. అతనే అంత లైట్ తీసుకుంటే మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవడమని ఆడియన్స్ కి అనిపిస్తుంది. ఇక పోలీస్ ఆఫీసర్ అంటే నవ్వకూడదు అన్నట్టుగా నవదీప్ పాత్రను డిజైన్ చేశారు. 

కథ మొదట్లోనే ఒక దారుణమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఎందుకు జరిగింది? కారకులు ఎవరు? వాళ్ల ఉద్దేశం ఏమిటి? అనే విషయాల దిశగా కదలవలసిన కథ, నత్తనడక నడుస్తూ ఉంటుంది. సాధారణంగా పోలీసులు .. ఇన్వెస్టిగేషన్ అంటే తెరపై ఒక రకమైన హడావిడి కనిపిస్తుంది. ఆ హడావిడి కూడా ఈ సిరీస్ లో కనిపించలేదు. అసలైన పాత్రలు అసలు విషయం పక్కన పెట్టి అనవసరమైన కబుర్లతో చేసే కాలక్షేపంలా అనిపిస్తుంది. 

పనితీరు: ఈ కథకి కేంద్ర స్థానమైన 'సైకో మెట్రి' అనే అంశం చుట్టూ ఆసక్తికరమైన సన్నివేశాలను అల్లుకోలేకపోయారు. అసలైన కథను సీజన్ 2లో చెప్పాలనుకున్నారేమో, తేలికైన సన్నివేశాలను .. తేలిపోయే సన్నివేశాలకు మాత్రమే ఈ సీజన్లో చోటిచ్చారు. స్క్రీన్ ప్లే కూడా చాలా సాదాసీదాగా కొనసాగుతూ వెళ్లింది. పాత్రలు పెద్దగా బరువైనవి కాకపోయినా, ఎవరి పరిథిలో వారు నటించారు. గోకుల భారతి ఫొటోగ్రఫీ బాగుంది. మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు: ఒక బలమైన సంఘటనతో కథను మొదలుపెట్టినప్పుడు, ఆ స్థాయికి తగ్గని కథనంతో ముందుకు వెళ్లవలసి ఉంటుంది. కానీ ఆ వెంటనే చల్లబడిపోయి .. నిదానంగా .. నింపాదిగా సన్నివేశాలు సాగితే ఆడియన్స్ డీలాపడిపోతారు. ఈ సిరీస్ విషయంలో జరిగింది ఇదే.

Movie Details

Movie Name: Touch Me Not

Release Date: 2025-04-04

Cast: Navadeep, Deekshith Shety, Komali Prasad, Sanchitha Poonacha, Babloo Prithveeraj

Director: Ramana Teja

Producer: Sunitha Tati - Yuvaraj karthikeyan

Music: Mahathi Swara Sagar

Banner: Guru Films

Review By: Peddinti

Touch Me Not Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews