'జిద్దీ గర్ల్స్' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • హిందీలో రూపొందిన 'జిద్దీ గర్ల్స్' 
  • 8 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్
  • కాలేజ్ లైఫ్ చుట్టూ తిరిగే కథ 
  • అల్లరి .. హడావిడికి ప్రాధాన్యత ఎక్కువ 
  • కనెక్ట్ కాని భావోద్వేగాలు

'జిద్దీ గర్ల్స్' .. హిందీలో రూపొందిన వెబ్ సిరీస్. నేహా వీణశర్మ కథ - దర్శకత్వం అందించిన ఈ సిరీస్ కి ప్రీతిశ్ నంది నిర్మాతగా వ్యవహరించారు. 8 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్, ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దియా దామిని .. అనుప్రియ కరోలి .. ఉమంగ్  భద్నా .. జైనా అలీ .. అతియా తారా నాయక్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ లో, సిమ్రాన్ .. రేవతి .. నందితా దాస్ కీలకమైన పాత్రలలో నటించారు. 

కథ: అది ఢిల్లీలోని ఒక రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజ్. వాలిక .. దేవిక .. వందన .. త్రిష .. పరూ తబస్సుమ్ ఆ కాలేజ్ లో చదువుతూ ఉంటారు. 'వాలిక' విషయానికి వస్తే వీల్ చైర్ కి పరిమితమైన లైఫ్ ఆమెది. జనంలో కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. కవితలు బాగా రాస్తూ ఉంటుంది. ఎక్కువగా తండ్రి గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక 'దేవిక' ఆమె రూమ్ మేట్. బాగా చదువుతుంది .. కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఆమెను సతమతం చేస్తూ ఉంటాయి. 

'వందన' విషయానికి వస్తే ఆమె బాగోగులు తండ్రినే చూసుకుంటూ ఉంటాడు. తండ్రి ఇచ్చిన స్వేచ్ఛను ఎంతవరకూ వాడుకోవాలో తెలియని స్థితిలో ఆమె ఉంటుంది. 'త్రిష' మంచి హాకీ ప్లేయర్. దేనినీ సీరియస్ గా తీసుకోకుండా పరిగెత్తే అమ్మాయి. ఆ పరుగులో ఆమెకి తెలియకుండానే దెబ్బలు తగులుతూ ఉంటాయి. 'పరూ'లో ధైర్యం పాళ్లు ఎక్కువ. తన హక్కుల కోసం పోరాడటంలో ఆమె ముందు ఉంటుంది. 'తబస్సుమ్' కి సోషల్ మీడియాలో పాప్యులర్ కావాలనే తపన ఉంటుంది.

ఈ కాలేజ్ కి మాళవిక దత్తా (రేవతి) ప్రిన్సిపల్ గా ఉంటుంది. ఆ కాలేజ్ స్టూడెంట్స్ చేసిన ఒక పని వలన ఆమె పేరు మీడియాకి ఎక్కుతుంది. ఫలితంగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవలసి వస్తుంది. ఆ ప్లేస్ లో లతా బక్షి (సిమ్రాన్) వస్తుంది. ఆమె చాలా స్ట్రిక్ట్ అని స్టూడెంట్స్ వింటారు. కాలేజ్ లో జరుగుతున్న కొన్ని ఆకతాయి పనులకు అడ్డుకట్ట వేయడానికి లతా బక్షి కొన్ని నిబంధనలు ఆచరణలోకి తెస్తుంది. అప్పుడు స్టూడెంట్స్ ఎలా స్పందిస్తారు? ఫలితంగా వాళ్ల కెరియర్ ఎలా ప్రభావితమవుతుంది? అనేది కథ.

విశ్లేషణ: కాలేజ్ లైఫ్ అనేది చాలా అందంగా ఉండాలని అంతా భావిస్తూ ఉంటారు. విద్య .. విజ్ఞానం .. బయట ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన నైపుణ్యాన్ని కాలేజ్ ఇస్తుంది. అలాగే కొన్ని అందమైన జ్ఞాపకాలను కూడా కాలేజ్ అందిస్తుంది. తీపి జ్ఞాపకాలు జీవితాంతం ఉత్సాహాన్ని పంచుతూనే ఉంటాయి. అలాగే చేదు అనుభవాలు కూడా గుండె తలుపు తడుతూనే ఉంటాయి. అలా కాలేజ్ నేపథ్యంలో తీపి - చేదు సంఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

అమ్మాయిలకు ఇంటి దగ్గర కొన్ని పరిమితులు .. ఆంక్షలు ఉంటాయి. అలా ఉండకూడదు .. ఇలా చేయకూడదు అనే సూచనలు రోజు మొత్తం వాళ్లను ప్రభావితం చేస్తూనే ఉంటాయి.స్వేచ్ఛ కోసం ఎదురు చూసే అలాంటి అమ్మాయిలు కాలేజ్ హాస్టల్ లో ఉండవలసి వస్తే హ్యాపీగానే ఫీలవుతారు. ఇంటి దగ్గర స్వేచ్ఛగానే ఉండే అమ్మాయిలు ఇక్కడ అంతగా ఇమడలేకపోతారు. భిన్న స్వభావాల వారు కలిసి ఉండటం ఎలా ఉంటుందనేది చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

ఇక వయసులోకి వచ్చిన పిల్లలను చదివించడం పేరెంట్స్ కి ఎంత కష్టమో, ఆ పిల్లలను నియంత్రించడం కాలేజ్ యాజమాన్యానికి అంతే కష్టం. అటు పబ్లిక్ నుంచి .. ఇటు పేరెంట్స్ నుంచి మాట రాకుండా చూసుకోవడం కోసం వాళ్లు నానా తంటాలు పడుతూ ఉంటారు. ఆ కోణాన్ని కూడా దర్శకుడు టచ్ చేశాడు. లవ్ .. ఫ్రెండ్షిప్ .. సెక్స్ .. ఎమోషన్స్ ను కవర్ చేశాడు. అయితే ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడంతో, లవ్ .. రొమాన్స్ మాత్రమే మనకి ఎక్కువగా గుర్తుండిపోతుంది. 

పనితీరు: కాలేజ్ లో అనేక రకాల కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన వారుంటారు. ఆ ప్రభావం కనిపించేలా పాత్రలను డిజైన్ చేసినట్టుగా మనకి కనిపించదు. అల్లర్లు .. అలకలు .. గొడవలు ఉన్నాయి. కానీ వాటిని అర్థమయ్యేలా .. ఆసక్తికరంగా దర్శకుడు డిజైన్ చేయలేకపోయారు. ఇక యాజమాన్యం వైవు నుంచి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంతగా భయపడిపోయే వాతావరణం మనకి కనిపించదు.

కాలేజ్ లో పిల్లలు ఎలా ఉన్నారు .. ఏం చేస్తున్నారు అనుకునే పేరెంట్స్ వైపు నుంచి ఎలాంటి ఎమోషన్స్ లేకపోవడం మరో లోపం. ఢిల్లీ నేపథ్యం కావడం వలన, రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు ఎలా మసలుకుంటారనే విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది అంతే. రొమాన్స్ పాళ్లు చూస్తుంటే, మనం చూసేది స్టూడెంట్స్ కి సంబంధించిన సిరీసేనా అనే డౌట్ వస్తుంది. 

మాతృకలో ఉన్న కవితలను ఇతర భాషలలోకి అనువదించేటప్పుడు భావం చెడిపోకుండా చూసుకోవాలి. లేదంటే అర్థం లేని రాతల మాదిరిగా అనిపించి అసహనాన్ని కలిగిస్తాయి. అలాంటి పరిస్థితి ఈ సిరీస్ లో అక్కడక్కడా ఎదురవుతుంది. డిమాండ్ చేయని సన్నివేశాలు .. సందర్భాలు  కూడా పలకరిస్తాయి. ఎవరి పాత్రలలో వాళ్లు బాగానే చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు: జిద్దీ గర్ల్స్ అంటే 'మొండి అమ్మాయిలు' అని అర్థం. అయితే అంత మొండితనం చూపించిన సన్నివేశాలు కనిపించవు. అనవసరమైన గోల .. హడావిడి .. శృతిమించిన శృంగారం తప్ప కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ లేవు. ఈ సిరీస్ చూసే కొంతమంది స్టూడెంట్స్ 'అయ్యో మనం చాలా వెనకబడిపోయామే' అనుకునే అవకాశం ఉంది. ఇక పొరపాటున 80sలోని వాళ్లు చూస్తే, ఇలా ఉండాలని తెలియక అప్పట్లో బుద్ధిగా చదువుకున్నాం' అనుకోకుండా ఉండలేరు.

Movie Details

Movie Name: Ziddi Girls

Release Date: 2025-02-27

Cast: Deeya Damini, Umang Bhadana, Zjaina Ali, Atiya Tara Nayak, Simran, Revathi, Nandita Das

Director: Neha Veena Sharma

Producer: Pritish Nandy

Music: -

Banner: A Prithish Nandy Communicatoins

Review By: Peddinti

Ziddi Girls Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews