'మార్కో' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

  • 'మార్కో'గా ఉన్నిముకుందన్ 
  • క్రితం ఏడాది చివర్లో విడుదలైన సినిమా 
  • స్టైలీష్ మేకింగ్ తో మెప్పించిన దర్శకుడు
  • సున్నితమైన ఆడియన్స్ ను కంగారు పెట్టేసే కంటెంట్  
  • రవి బస్రూర్ నేపథ్య సంగీతం హైలైట్       

మలయాళంలో క్రితం ఏడాదిలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలలో ఒకటిగా 'మార్కో' కనిపిస్తుంది. ఉన్ని ముకుందన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించగా, హనీ అదేని దర్శకత్వం వహించాడు. మలయాళంలో డిసెంబర్ 20వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: జార్జ్ (సిద్ధిఖీ) అక్కడి నేరసామ్రాజ్యాన్ని శాసిస్తూ ఉంటాడు. ఆయన కనుసన్నలలోనే అంతా నడుస్తూ ఉంటుంది. ఆయనకి ఒక తమ్ముడు .. ఒక చెల్లి ఉంటారు. తమ్ముడు విక్టర్ పుట్టుకతోనే అంధుడు. అందువలన అతను ఇతరులపై ఆధారపడుతూ ఉంటాడు. అయితే అందరిలో కంటే ఎక్కువగా విక్టర్ మాటకు జార్జ్ విలువ ఇస్తూ ఉంటాడు. తన తమ్ముడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటాడు.

విక్టర్ కి చూపు లేకపోయినా ఒక యువతి అతనిని మూడేళ్లుగా లవ్ చేస్తూ ఉంటుంది. అలాంటి విక్టర్ తన స్నేహితుడైన వసీమ్ ను ఎవరు చంపేసి ఉంటారనే విషయానికి సాక్షిగా ఉంటాడు. దాంతో అవతల శత్రువులు విక్టర్ ను టార్గెట్ చేసి చంపేస్తారు. యాసిడ్ లో ముంచేసి మరీ అతనిని అంతం చేస్తారు. అంతటి దారుణంగా విక్టర్ ను ఎవరు హత్య చేసి ఉంటారనేది జార్జ్ కి అర్థం కాదు. దాంతో అతను ఆలోచనలో పడతాడు. 

విక్టర్ అత్యంత సన్నిహితంగా ఉండేది 'మార్కో'తోనే. అందువలన విక్టర్ ను హత్య చేసినవాళ్లను అంతం చేయడం కోసం మార్కో రంగంలోకి దిగుతాడు. మార్కో ఎవరు? అతనికి విక్టర్ తో ఉన్న అనుబంధం ఏమిటి? విక్టర్ హత్యకి కారకులు ఎవరు? వాళ్లను కనుక్కోవడానికి మార్కో ఎంచుకున్న మార్గం ఏమిటి? అనేది కథ. 

విశ్లేషణ: ఒక నేరసామ్రాజ్యాన్ని స్థాపించడం .. దానిని సమర్థవంతంగా నిర్వహించడం కత్తిమీద సామువంటిదే. ఎవరిని ఎంతవరకూ నమ్మాలి అనే విషయమే నాయకుడి మొదటి లక్షణంగా చెప్పుకోవచ్చు. సహచరుడిగా నటిస్తూ ప్రమాదకారిగా మారుతున్నదెవరు? అనే విషయాన్ని అంచనా వేయగలిగినప్పుడే ప్రమాదం నుంచి తన వాళ్లను రక్షించుకోగలుగుతాడు. అలా తనవాళ్లను కాపాడుకోవడానికి .. ద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రంగంలోకి దిగిన ఒక డెవిల్ కథ ఇది. 

ఒక పరిధి దాటి చేసే డీల్స్ ఏవైనా నేరాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి .. శత్రువుల సంఖ్యను పెంచుతూ ఉంటాయి. అక్రమమార్గంలో అడుగుపెట్టినవారు తమ కుటుంబాన్ని పణంగా పెట్టవలసి వస్తుంది. లేదంటే తమ కుటుంబానికి ఒక రక్షకుడిని తయారు చేసుకోవలసి వస్తుంది. ఈ పాయింట్ పైనే ఈ కథ నడుస్తుంది. ఆ రక్షకుడిగా కథానాయకుడిని నిలబెట్టిన దర్శకుడు, ఈ కథను యాక్షన్ వైవు నుంచి నడిపించాడు. 

గ్యాంగ్స్ మధ్య వార్ జరగడం .. ప్రతీకారదాడులు జరగడం చాలా సినిమాలలో చూశాము. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి హింస ఒక రేంజ్ లో చూపించారు. తెరపై రక్తం ధారాలై ప్రవహిస్తూ ఉంటుంది. సాధారణంగా హీరోలు ఆవేశంతో విరుచుకుపడటం చూస్తుంటాము. కానీ ఈ సినిమాలో హీరో ఉన్మాదిలా ప్రవర్తిస్తాడు. సైకో సినిమాలను కూల్ గా చూసే ఆడియన్స్ కి కూడా చెమటలు పట్టిస్తాడు. పేరుకే లవ్ .. ఎమోషన్స్ అనే మాటలు వినిపిస్తాయి. కానీ నిజానికి ఈ సినిమా అంతటా కనిపించేది శత్రువులను మృగం కంటే దారుణంగా వేటాడటమే.   
                     `                       
పనితీరు: దర్శకుడి మేకింగ్ స్టైల్ ఆకట్టుకుంటుంది. కథలో లవ్ .. ఎమోషన్స్ పరిధిని కొంతవరకూ పెంచుకోవచ్చు. కానీ ఆయన ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. పూర్తి ఫోకస్ అంతా యాక్షన్ ఎపిసోడ్స్ పైనే పెట్టాడు. ఉన్ని ముకుందన్ తో పాటు, మిగతా వాళ్లంతా బాగానే చేశారు.

చంద్రు సెల్వరాజ్ కెమెరా పనితనం బాగుంది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి మార్కులు కొట్టేస్తుంది. థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అవుతుంది. దర్శకుడి టేకింగ్ చాలా స్టైలీష్ గా అనిపిస్తుంది. కాకపోతే విపరీతమైన హింస - రక్తపాతం, ప్రేక్షకులను వినోదానికి దూరంగా పట్టుకుపోతాయి. ఇంతటి రక్తపాతం కలిగిన ఈ సినిమా, మలయాళంలో భారీ వసూళ్లను రాబట్టడం విశేషమే మరి. 

Movie Details

Movie Name: Marco

Release Date: 2025-02-15

Cast: Unni Mukundan,Siddique, Jagadeesh, Kabir duhan Singh

Director: Haneef Adeni

Producer: Shareef Muhammed

Music: Ravi Basrur

Banner: Cubes Entertainments

Review By: Peddinti

Marco Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews