'బ్రహ్మా ఆనందం' -మూవీ రివ్యూ!

  • థియేటర్లకు వచ్చిన 'బ్రహ్మా ఆనందం'
  • తనయుడితో నటించిన బ్రహ్మానందం 
  • నిదానంగా సాగే స్క్రీన్ ప్లే 
  • క్లారిటీ లోపించిన కంటెంట్

గతంలో రాహుల్‌ యాదవ్ నక్కా నిర్మించిన 'మళ్లీరావా .. ఎజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ.. మసూద చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఆయన నిర్మించిన 'బ్రహ్మా ఆనందం' చిత్రంపై ప్రేక్షకులతో పాటు, సినీ పరిశ్రమలో కూడా ఓ పాజిటివ్‌ వైబ్‌ ఉంది. చాలా విరామం తరువాత హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు రాజా గౌతమ్‌ కీలక పాత్రలో నటించాడు. నిఖిల్ దర్శకత్వంలో నిర్మించిన 'బ్రహ్మా ఆనందం', ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం.

కథ: చిన్నతనంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన బ్రహ్మనందం (రాజా గౌతమ్‌)కి స్కూల్‌ డేస్‌ నుంచే నటన అంటే చాలా ఇష్టం. బంధువులకు దూరంగా నాకు నేనే.. నా కోసం నేనే అనే విధంగా ఆలోచిస్తూ స్నేహితుడు గిరి (వెన్నెల కిషోర్‌)తో కలిసి ఉంటాడు. స్కూల్‌ డేస్‌ నుంచి స్టేజ్‌ఆర్టిస్ట్‌గా  మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం, నటుడిగా తనని తాను నిరూపించుకునే అవకాశం కోసం వేచి చూస్తుంటాడు. 

తొమ్మిదేళ్లుగా ఎలాంటి ఉద్యోగం లేకుండా, అప్పులు చేస్తూ జీవనాన్ని గడుపుతున్న బ్రహ్మానందానికి థియేటర్ ఆర్టిస్ట్‌గా నిరూపించుకునే ఓ అవకాశం వస్తుంది. ఇందుకు ఆరు లక్షలు అవసరం పడతాయి. బ్రహ్మానందం ప్రేయసి తార (ప్రియ వడ్లమాని) సాయం చేయాలని అనుకుంటుంది. కానీ అతను తనను ప్రేమించట్లేదని తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. అయితే ఈ సమయంలోనే ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో ఉంటున్న తాన తాత బ్రహ్మానందమూర్తి ( బ్రహ్మానందం)ని కలుసుకుంటాడు. 

కొన్ని కండిషన్లు పాటిస్తే తన ఆరు ఏకరాల భూమిని అమ్మి డబ్బులు ఇస్తానని తాత మాటిస్తాడు. ఇందుకోసం కొన్ని షరతులు పెడతాడు.  బ్రహ్మానందం ఆ కండిషన్లు పాటిస్తాడా? ఆ షరతులు ఏమిటి? బ్రహ్మానందం తన సొంత ఊరుని అని చెప్పి అందరినీ ఇంకో ఊరుకు ఎందుకు తీసుకెళాతాడు? మూర్తి జ్యోతి (రామేశ్వరి)కి ఉన్న సంబంధం ఏమిటి?  అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. 

విశ్లేషణ: జీవితం చరమాంకంలో ఎవరికైనా ఓ తోడు కావాలి, ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అనే ఓ కాన్సెప్ట్‌ను ఎంచుకుని దర్శకుడు ఈ కథను మొదలుపెట్టాడు. అయితే సినిమా చూస్తున్న ఆడియన్స్‌కు మాత్రం దర్శకుడు ఏ చెప్పబోతున్నాడు అనే కన్‌ఫ్యూజన్‌ మాత్రం సినిమా ముగింపు వరకు ఉంటుంది. ఇతరత్రా అంశాలు  లేకుండా కొనసాగడం వల్ల సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఒక్కొసారి థియేటర్‌ ప్లేను తలపిస్తుంది.

తొలిభాగం ఎంత స్లోగా ఉంటుందో, ద్వితియార్థం కూడా అంతకుమించిన నత్తనడకతో సినిమా ఆసాంతం ఉంటుంది. దర్శకుడు ఈ సినిమాను అటు ఎంటర్‌టైన్‌మెంట్‌ బాటలో, ఇటు ఎమోషన్స్‌ను పండిస్తూ హృదయాన్ని హత్తుకునే సినిమాగా అలరించాలని చేసిన ప్రయత్నంలో పూర్తిగా సఫలీకృతుడు కాలేక పోయాడు. సినిమాలో ఎక్కడా కూడా పాత్రలతో ఆడియన్స్‌ కనెక్ట్ అయ్యే అవకాశం కానీ, ఆ పాత్రల ఎమోషన్స్‌ మనం ఫీల్‌ అయ్యే సన్నివేశాలు కానీ లేవు.సినిమా మొత్తం స్లోగా, మధ్య మధ్యలో కాస్త వినోదాన్ని పంచుతూ సో..సో..గా సాగుతుంది. అసలు ఈ సినిమా ద్వారా ఆడియన్స్‌కు ఏం చెప్పాలనుకున్నారో అనే క్లారిటీ మాత్రం లోపించింది.

నటీనటుల పనితీరు: బ్రహ్మానంద మూర్తి పాత్రలో బ్రహ్మానందం చాలా సహజంగా నటించాడు. ఆయన స్టయిల్‌ ఆఫ్‌ వినోదాన్ని కూడా పండించాడు. వెన్నెల కిషోర్‌ వినోదం ఆడియన్స్‌కకు కాస్త రిలీఫ్‌నిస్తుంది. ఆయన పాత్రకు కామెడిని స్కోప్‌ ఉండేలా దర్శకుడు డిజైన్‌ చేశాడు. దానికి తగిన విధంగానే వెన్నెల కిషోర్‌ తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాడు. రాజా గౌతమ్‌లో తన పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదనిపించాయి. 

మొత్తంగా బ్రహ్మా ఆనందం సినిమాలో అటు వినోదాన్ని, ఇటు ఎమోషన్స్‌ను ఆడియన్స్‌ను ఆకట్టుకునే స్థాయిలో అందించడంలో దర్శకుడు విఫలమయ్యాడు అని చెప్పాలి. ఇలాంటి ఓ కథను తెరకెక్కించేటప్పుడు ఎమోషన్స్‌, సన్నివేశాలు చాలా బలంగా రాసుకోవాలి. సినిమా మొత్తం సహజంగా గుండెలు బరువెక్కించే విధంగా, ఆడియన్స్‌ కొత్త అనుభూతినిచ్చే విధంగా ఉండాలి. ఈ విషయంలో బ్రహ్మా ఆనందం ఆకట్టుకోలేకపోయాడు.


Movie Details

Movie Name: Brahma Anandam

Release Date: 2025-02-14

Cast: Brahmanandam, Raja Goutham, Vennela Kishore, Priya Vadlamani,Aishwarya Holakkal

Director: RVS Nikhil

Producer: Rahul Yadav Nakka

Music: Sandilya Pisapati

Banner: Swadharm Entertainment

Review By: Madhu

Brahma Anandam Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews