'డార్క్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన 'బ్లాక్'
  • 5 కోట్ల బడ్జెట్ . 50 కోట్ల వసూళ్లు 
  • 'డార్క్' టైటిల్ తో తెలుగులో అందుబాటులోకి
  • ఆసక్తికరమైన కథాకథనాలు
  • ఇంట్రెస్టింగ్ పాయింటుతో మెప్పించే కంటెంట్  
సాధారణంగా సైన్స్ ఫిక్షన్ జోనర్ సినిమాలు .. హారర్ సినిమాలు ప్రేక్షకులలో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. అయితే ఈ రెండు జోనర్లను కలుపుకుంటూ తెరకెక్కిన సినిమా పట్ల ఏ స్థాయిలో ఆడియన్స్ ఉత్సాహాన్ని చూపిస్తారనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అలాంటి ఒక తమిళ సినిమానే 'బ్లాక్'. క్రితం ఏడాది అక్టోబర్ 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఆ తరువాత ఓటీటీకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా 'డార్క్' పేరుతో, అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. 

కథ: ఈ కథ  చెన్నైలో 1964లో మొదలై ఆ తరువాత ప్రస్తుత కాలానికి వస్తుంది. 1964లో లలిత - గణేశ్ ఇద్దరూ ప్రేమించుకుంటారు. లలితపై మనసు పారేసుకున్న మనోహర్ ( వివేక్ ప్రసన్న) కోపంతో రగిలిపోతాడు. ఒక పథకం ప్రకారం ఆ ఇద్దరినీ 'బీచ్ హౌస్' కి తీసుకుని వెళతాడు. అక్కడ వాళ్లిద్దరినీ చంపేయాలని మనోహర్ నిర్ణయించుకుంటాడు. అయితే అతను చంపడానికి ముందే ఆ ఇద్దరూ దారుణంగా హత్య చేయబడతారు. దాంతో మనోహర్ నివ్వెరపోతాడు. 

అప్పట్లో ఆ 'బీచ్ హౌస్' ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఖరీదైన విల్లాలు కడతారు. వసంత్ (జీవా) అరణ్య ( ప్రియా భవాని శంకర్) ఇద్దరూ ఒక విల్లాను కొనుగోలు చేస్తారు. సిటీకి దూరంగా ఉన్న ఆ విల్లాలో  రెండు రోజుల పాటు సరదాగా గడపడం కోసం వెళతారు. ఇంకా ఏ విల్లాలోకి ఎవరూ దిగరు .. అందువలన తమ ఏకాంతానికి అదే మంచి ప్రదేశమని వాళ్లిద్దరూ అనుకుంటారు. అక్కడికి వెళ్లిన వాళ్లకి, తమని ఎవరో రహస్యంగా గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ విల్లాలో వారికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.

తమ విల్లాకి ఎదురు లైన్ లోని మరో విల్లాలో లైట్లు వెలుగుతూ ఉండటం చూసి, వసంత్ - అరణ్య ఆశ్చర్యపోతారు. వాచ్ మెన్ కి కాల్ చేస్తే ఆ విల్లాలోకి ఎవరూ దిగలేదనే చెబుతాడు. దాంతో ఆ ఇంట్లో ఎవరున్నారో చూడటం కోసం వసంత్ - అరణ్య వెళతారు. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడున్న 'డార్క్ ప్లేస్' గురించి వాళ్లకి ఏం తెలుస్తుంది? అక్కడి నుంచి వాళ్లు బయటపడతారా? అనేది కథ. 

విశ్లేషణ: ఒక ఆంగ్ల సినిమా ఆధారంగా 'డార్క్' సినిమాను రూపొందించారు. సరదాగా గడపడం కోసం, తమ కొత్త విల్లాకు వెళ్లిన భార్యాభర్తలకు ఎలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయనే కథతో ఈ సినిమా కొనసాగుతుంది. ఆ జంట తమ సమస్యను గుర్తించేవరకూ ఫస్టు పార్టుగా .. సమస్యను అర్థం చేసుకుని అక్కడి నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నం సెకండాఫ్ గా ప్రేక్షకులను పలకరిస్తుంది.

సినిమా మొత్తం మీద ఒక డజను పాత్రలు కనిపించినప్పటికీ, కథలో 90 శాతం కేవలం రెండు ప్రధానమైన పాత్రల చుట్టూనే తిరుగుతుంది. సాధారణంగా హారర్ థ్రిల్లర్ కి సంబంధించిన కథలు ఒక విల్లాలో జరుగుతూ ఉంటాయి. ఈ కథ కూడా విల్లా చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ కథ వేరు .. దీని తీరు వేరు. ఇక్కడ కథ సైన్స్ ఫిక్షన్ తో ముడిపడి కనిపిస్తుంది. కథలోని కొత్తదనమే చివరి వరకూ ప్రేక్షకులను కూర్చోబెడుతుంది.

ఈ కథలోని సైంటిఫిక్ అంశాన్ని అర్థమయ్యేలా చెప్పడం ఒక ఛాలెంజ్ అయితే, ఆసక్తికరంగా అనిపించేలా స్క్రీన్ ప్లే చేయడం మరో సవాల్. క్లిష్టమైన ఈ పనిని పూర్తిచేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 90 శాతం కథ ఒకే లొకేషన్లో .. రెండే పాత్రల మధ్య నడుస్తూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ బోర్ కొట్టకపోవడానికి కారణం ఈ కథలోని ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పాలి.

పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. క్లిష్టమైన పాయింట్ ను అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడి పనితీరు మెప్పిస్తుంది. ఆ పాత్రలను పోషించిన జీవా - ప్రియా భవాని శంకర్ నటన ప్రేక్షకులను రియాలిటీకి దగ్గరగా తీసుకుని వెళుతుంది. పౌర్ణమి రాత్రులతో ముడిపెట్టి దర్శకుడు కథను వెన్నెల్లో నడిపించిన విధానం హైలైట్. 

గోకుల్ బెనోయ్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలం అనే చెప్పాలి. నైట్ ఎఫెక్ట్ .. వెన్నెల రాత్రులకు సంబంధించిన చిత్రీకరణ మంచి ఫీల్ ను కలిగిస్తుంది. సామ్ సీఎస్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరో ప్రత్యేకమైన ఆకర్షణ అనే చెప్పాలి. కథతో పాటు ప్రేక్షకుడు ట్రావెల్ చేసేలా నేపథ్య సంగీతం సాగుతుంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాగుంది. 

ముగింపు: సాధారణంగా సైన్స్ ఫిక్షన్ అంశాన్ని టచ్ చేయడం అనగానే ఒక రేంజ్ గ్రాఫిక్స్ ను ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ అసలు గ్రాఫిక్స్ తో పనిలేకుండా .. మొదటి నుంచి చివరివరకూ ఆడియన్స్ ను కూర్చొబెట్టొచ్చని నిరూపించిన కథ ఇది. కేవలం 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 50 కోట్ల వసూళ్లను రాబట్టడానికి కారణం ఏమిటనేది సినిమా చూస్తే అర్థమైపోతుంది. 


Movie Details

Movie Name: Dark

Release Date: 2025-02-04

Cast: Jeeva, Priya Bhavani Shankar, Vivek Prasanna, Yog Japee

Director: KG Balasubramani

Producer: SR Prabhu - SR Prakash Babu

Music: Sam CS

Banner: Potential Studios

Review By: Peddinti

Dark Rating: 3.00 out of 5


More Movie Reviews