ఒక చిన్నపాటి లైన్ పట్టుకుని దానిని ఇంట్రెస్టింగ్ గా తెరపై ఆవిష్కరించడమనేది మలయాళ సినిమాలలోను ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓటీటీలు వచ్చిన తరువాత ఈ తరహా కాన్సెప్టులతో తెలుగులోను సినిమాలు వస్తున్నాయి. అలా రూపొందిన సినిమానే 'కాఫీ విత్ ఎ కిల్లర్'. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నేరుగా 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అది ఒక కాఫీ షాప్. కేవలం కాఫీ కోసం మాత్రమే కాదు .. తమ జీవితానికి సంబంధించిన చాలా విషయాలను మాట్లాడుకోవడానికి అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. వృత్తిపరమైన .. వ్యక్తిగతమైన చాలా విషయాలకు సంబంధించిన చర్చలు అక్కడ నడుస్తూ ఉంటాయి. ఎవరిగోల వారిది అన్నట్టుగా ఉండే ఆ వాతావరణంలో ఎవరి స్వేచ్ఛ వారికి ఉండటం అక్కడ అందరికీ నచ్చే విషయం.
అక్కడ కొత్తగా ఒక ప్రాజెక్టును గురించి మాట్లాడుకోవడం కోసం హీరోతో పాటు దర్శక నిర్మాతలు వస్తారు. అలాగే హవాలా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు అక్కడ నడుస్తూ ఉంటాయి. అలాగే పెద్దల తీరు పట్ల ప్రేమికుల అసంతృప్తి .. అక్రమ సంబంధాలకు సంబంధించిన ఆందోళనలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యలోనే జాతకాలు చెప్పించుకునే కార్యక్రమం .. ల్యాండ్ మాఫియా కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఆ పక్కనే జరిగిపోతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే ఒక కిల్లర్ ఆ కాఫీ షాప్ లోకి అడుగుపెడతాడు. తనని నియమించిన వ్యక్తి ఇచ్చే టార్గెట్ కోసం .. అతని ఆదేశం కోసం ఆ కిల్లర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ కాఫీ షాప్ లో ఏదో జరుగుతుందనే అనుమానం రావడంతో పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. ఆ కిల్లర్ ను నియమించింది ఎవరు? ఎవరిని చంపడానికి అతను రంగంలోకి దిగాడు? ఆ సంఘటన ఎవరెవరి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది కథ.
విశ్లేషణ: ఇది కాఫీ షాప్ లో నడిచే ఒక చిన్న కథ. కాఫీ షాప్ కి చాలామంది వస్తుంటారు .. కాఫీ తాగుతూ అనేక విషయాలను మాట్లాడుకుని వెళుతుంటారు. అలాంటి ఒక నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. అయితే వాళ్ల మధ్యలోకి కిల్లర్ వచ్చి, తాను ఎవరిని చంపాలనే ఆదేశం కోసం వెయిట్ చేస్తూ ఉండటమే చివరివరకూ అందరిలో కుతూహలాన్ని పెంచుతూ ఉంటుంది. అతని టార్గెట్ ఎవరనే విషయంపైనే ఆడియన్స్ దృష్టి ఉంటుంది.
కాఫీ షాప్ మేనేజర్ సురేశ్ అక్రమ సంబంధాలు .. శ్రీనివాసరెడ్డి సినిమాల గోల .. ల్యాండ్ సెటిల్ మెంట్లకి సంబంధించిన కామెడీ ట్రాక్ ఏ మాత్రం పేల లేదనే చెప్పాలి. ఇక ప్రేమజంట .. హవాలా లావాదేవీల సంభాషణలో ఎంతమాత్రం పస కనిపించదు. ఆటో రామ్ ప్రసాద్ .. తాగుబోతు రమేశ్ ల పాత్రలు కాస్త నవ్వుముఖం పెట్టుకునేలా చేస్తాయి. ఆల్రెడీ కాఫీ షాపులో ఉన్న పాత్రలలోనే పస కనిపించకపోగా .. కొత్త పాత్రలు ఎంట్రీ ఇస్తుండటం అసహనాన్ని కలిగిస్తుంది.
ఒకే ప్రదేశంలో పాత్రలన్నీ పోగేసినప్పుడు, అన్ని పాత్రలను కలుపుతూ ముందుకు వెళ్లాలి. ఒక బ్యాచ్ తరువాత మరో బ్యాచ్ ను చూపిస్తే, మిగతా బ్యాచ్ లు తెరపైకి రావడంలో గ్యాప్ వచ్చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. సినిమా చివరలో ఒక చిన్నపాటి ట్విస్ట్ ఉంటుంది. కానీ ఆ ట్విస్ట్ కోసం మిగతా సన్నివేశాలను భరించవలసి రావడమే బాధాకరం అనుకోవాలి.
పనితీరు: రవిబాబు .. సత్యం రాజేశ్ .. శ్రీనివాసరెడ్డి .. బెనర్జీ .. జెమినీ సురేశ్ ఇలా చాలా వరకూ తెలిసిన ముఖాలే కనిపిస్తాయి. అందరికీ నటనలో మంచి అనుభవం ఉంది. అందువలన నటన గురించి చెప్పుకోవలసిన పనిలేదు. కాకపోతే ఎవరి పాత్రలోను విషయం లేకపోవడం వలన తేలిపోతూ ఉంటాయి. ఎవరి ట్రాక్ చూసినా బలహీనంగానే అనిపిస్తుంది. తిరుమల నాగ్ డైలాగ్స్ లో కూడా గుర్తుపెట్టుకునేవి ఏమీ లేవు. అనుష్ గోరఖ్ ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్, భరత్ మధుసూదన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే.
తక్కువ బడ్జెట్ లో ఇలాంటి కాన్సెప్టులు వర్కౌట్ అవుతాయి. అయితే కంటెంట్ ప్రెజెంటేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. అలాంటి కంటెంట్ విషయంలో .. దాని అవుట్ పుట్ విషయంలో దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ ఇంకాస్త కసరత్తు చేయవలసింది.
'కాఫీ విత్ ఎ కిల్లర్' (ఆహా) మూవీ రివ్యూ!
| Reviews

Coffee With a Killer Review
- నేరుగా ఓటీటీకి వచ్చిన సినిమా
- దర్శకుడిగా వ్యవహరించిన ఆర్పీ పట్నాయక్
- కాఫీ షాప్ నేపథ్యంలో సాగే కథ
- బలహీనమైన కథనం
- అంతగా ఆకట్టుకోని కంటెంట్
Movie Name: Coffee With a Killer
Release Date: 2025-01-31
Cast: Temper Vamsi, Ravi Prakash, Ravi Babu, Srinivasa Reddy, Sathyam Rajesh
Director: RP Patnaik
Music: Bharath Madhusudan
Banner: Seven Hills
Review By: Peddinti
Coffee With a Killer Rating: 2.00 out of 5
Trailer