'బచ్చల మల్లి' - మూవీ రివ్యూ!

  • 'బచ్చల మల్లి' పాత్రలో అల్లరి నరేష్‌
  • ఆకట్టుకోని కథా కథనాలు
  • పాత్రల్లో లోపించిన భావోద్వేగాలు
  • ఆకట్టుకోని మలుపులు
  • సాదాసీదాగా అనిపించిన సినిమా
కామెడీ చిత్రాల కథానాయకుడిగా అందరికి సుపరిచితుడైన 'అల్లరి' నరేష్‌ కొంతకాలం నుంచి సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఆయన కామెడీ జోనర్‌ను వదిలి మాస్‌, సీరియస్‌ కథాంశాలతో కూడిన సినిమాల బాట పట్టాడు. ఆ కోవలో ఆయన చేసిన మరో పీరియాడిక్‌ రూరల్‌ సీరియస్‌ డ్రామా 'బచ్చల మల్లి'.  నిజ జీవితంలో ఈ 'బచ్చల మల్లి' పేరుతో ఉన్న ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు ప్రచారంలో చెప్పారు. ఈ చిత్రం 'అల్లరి' నరేష్‌కు విజయాన్ని అందించిందా? లేదా? అనేది చూద్దాం. 

కథ: 'బచ్చల మల్లి' (అల్లరి నరేష్‌) టెన్త్‌క్లాస్‌లో జిల్లా ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకుని తన తండ్రి సత్యం ( బలగం జయరామ్‌)ని గర్వపడేలా చేసి, తండ్రి అంటే ఎంతో ప్రేమగా ఉండే 'బచ్చల మల్లి'కి తండ్రి చేసిన ఓ తప్పు కోపం వచ్చేలా చేస్తుంది. అంతేకాదు ఆ తప్పు కారణంగా తండ్రి తనను, తల్లిని వదిలేసి వెళ్లడంతో మల్లి మనసు గాయపడుతుంది. 

మల్లి తన తండ్రి మీద కోపంతో చెడు వ్యసనాలకు బానిసై, బస్తాలు కుట్టుకుంటూ.. అందరితో గొడవపడుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. ఈ తరుణంలోనే మల్లి జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్‌) ప్రవేశిస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక.. ఆయన జీవితంలో జరిగిన మార్పులేమిటి? కావేరి, మల్లిల ప్రేమ ఫలిస్తుందా? అసలు మల్లికి, తన తండ్రికి ఉన్న సమస్యలేమిటి? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడు? అనేది ప్రధానమైన కథాంశం. 

విశ్లేషణ: చదువుకు దూరమై .. చిన్నప్పుడే వ్యసనాలకు బానిసై .. వెనకా ముందు ఆలోచించకుండా అందరితో గొడవలు పెట్టుకునే మూర్ఖత్వపు ధోరణితో ప్రవర్తించే వ్యక్తి కథ ఇది. ఇలాంటి వ్యక్తులు మనకు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే మూర్ఖుడుగా ఉండడు. పరిస్థితులు అతణ్ణి అలా మార్చేస్తాయి. అయితే ఈ చిత్రంలో హీరో అంత మూర్ఖుడుగా మారడానికి చూపించే కారణం అంత బలంగా ఉండదు. అతని ఎమోషన్‌తో కూడా ప్రేక్షకులు కనెక్ట్‌ కాలేరు. 

ఈ సినిమాను 1980 నేపథ్యంలో నడిచే కథగా దర్శకుడు చూపించాడు. దర్శకుడు కేవలం పతాక సన్నివేశాల కోసమే ఈ కథను రాసుకున్నాడేమో అనిపించింది. గ్రామీణ నేపథ్యంలో కథను చెబుదామని దర్శకుడు అనుకోవడంలో తప్పులేదు కానీ, శక్తివంతమైన కథ లేకుండా.. పాత్రల్లో ఎమోషన్స్‌ లేకుండా .. ఎమోషన్స్‌ పండించే సన్నివేశాలు లేకుండా ఈ కథను చాలా సాదాసీదాగా చెప్పాలనే ప్రయత్నం చేయడంతో సినిమా అంతగా ఆకట్టుకోదు. కథ నేపథ్యం కోసం దర్శకుడు బాగానే పరిశోధన చేశాడు. బస్తాల వ్యాపారం ఎక్కువగా జరిగే 'తుని'కి దగ్గర్లోని ఈ కథను నడిపించడం, గన్నీ (బస్తాల) వ్యాపారం జరిగే 'మిర్యాలగూడ' వంటి వ్యాపార కేంద్రాలను ఇందులో ప్రస్తావించడం కథపై అతని రీసెర్చ్‌కు అద్దం పట్టింది.

అయితే కుటుంబంలో ఉండే ఎమోషన్స్‌, స్ట్రాంగ్‌ క్యారెక్టరైజేషన్స్‌ లేకపోవడం వల్ల చిత్రం పెద్దగా రక్తికట్టదు. హీరో మూర్ఖుడుగా ఉన్నా అతని పాత్రపై ప్రేక్షకులకు సానుభూతి కలగాలి.. కానీ ఆ పాత్ర ప్రవర్తించే విధానం ప్రేక్షకులకు చిరాకు పెట్టే విధంగా ఉంటుంది. పాత్ర తీరు తెన్నులు సరైన విధానంలో మలచకపోవడమే అందుకు కారణం. సినిమాలో కొన్ని మలుపులు ఆసక్తి కలిగించినా.. అవి  పూర్తి స్థాయిలో సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా లేవు. ఫస్టాఫ్ స్లోగా ఫర్వాలేదనిపించినా.. సెకండాఫ్‌ మాత్రం విసుగు పుట్టిస్తుంది. 

నటీనటుల పనితీరు
: బచ్చల మల్లిగా 'అల్లరి'నరేష్ వైవిధ్యమైన పాత్రలోనే కనిపించాడు. అయితే మేకప్‌ మాత్రం ఎందుకో పాత్రకు తగిన విధంగా లేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో అందరికి గుర్తుండిపోయే అభినయాన్ని కనబరిచాడు. నరేష్‌ కెరీర్‌లో ఇదో డిఫరెంట్‌ పాత్రగా మిగిలిపోతుంది. కావేరి పాత్రలో అమృత అయ్యర్‌ చక్కని నటన చూపెట్టింది. రావు రమేష్‌, బలగం జయరామ్‌, కన్నడ నటుడు అచ్యుత్ కుమార్‌ తమ పరిధుల మేరకు నటించారు.

కమెడియన్‌ ప్రవీణ్, హరితేజల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రవీణ్‌ కొత్త తరహా పాత్రలో తనదైన శైలిలో మెప్పించాడు. వైవా హర్ష వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. నేపథ్య సంగీతం చిత్రానికి చాలా ప్లస్‌ అయ్యే విధంగా ఉంది. కెమెరావర్క్‌, ఆర్ట్‌ వర్క్‌ కూడా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. దర్శకుడు సుబ్బు కథ, కథనాలపై మరింత శ్రద్ధపెట్టి ఉంటే సినిమా మరింత ఆస్తకికరంగా ఉండేది. 

కామెడీ చిత్రాల కథానాయకుడిగా పేరున్న నరేష్‌ సీరియస్‌ కథాంశాల జోనర్‌లోకి వెళ్లిపోయి రిస్క్‌ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఆయన సేఫ్‌ జోనర్ అయిన కామెడీని వదిలి, ఇలాంటి సీరియస్‌ నేపథ్యాల సినిమాలతో చేయడం వల్ల ఆయన నుంచి కామెడీ చిత్రాలను ఆశిస్తున్న ప్రేక్షకులు నిరాశ పడాల్సి వస్తుంది. సో.. బచ్చలమల్లికి  రక్తి కటించని కథ, కథనాలు.. బలంగా లేని భావోద్వేగాలు మైనస్‌గా మారాయి. ఫైనల్‌గా 'బచ్చల మల్లి' ఎటువంటి ప్రత్యేకతలు లేని సాదాసీదా చిత్రంగా అనిపిస్తుంది.

Movie Details

Movie Name: Bachchala Malli

Release Date: 2024-12-20

Cast: Allari Naresh, Amritha Aiyer, Rohini, Rao Ramesh, Achyuth Kumar

Director: Subbu Mangadevi

Producer: Razesh Danda - Balaji Gutta

Music: Vishal Chandrasekhar

Banner: Hasya Movies

Review By: Madhu

Bachchala Malli Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews