'7/G ది డార్క్ స్టోరీ' (ఆహా) మూవీ రివ్యూ!

  • తమిళంలో రూపొందిన '7/G'
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • ఆసక్తిని రేకెత్తించలేకపోయిన సన్నివేశాల 
  • భయపెట్టలేకపోయిన కంటెంట్

సోనియా అగర్వాల్ చాలా కాలం క్రితం తెలుగులో చేసిన '7/G బృందావన కాలని' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత చాలానే ప్రేమకథలు వచ్చినప్పటికీ, ఆ సినిమాను ఆడియన్స్ ఇంతవరకూ మరిచిపోలేదు. ఆమె ప్రధాన పాత్రగా రూపొందిన మరో తమిళ సినిమానే '7G - ది డార్క్ స్టోరీ'. జులై 5వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా,  ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: రాజీవ్ ( రోషన్ బషీర్) వర్ష ( స్మృతి వెంకట్) ఇద్దరూ భార్యాభర్తలు. వారి సంతానమే రాహుల్. చాలా కాలంగా అద్దె ఇంట్లో ఉంటూ వచ్చిన ఆ భార్యాభర్తలు, ఒక అపార్టుమెంటులో ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. ఆ ఇంట్లోకి వెళ్లిన తరువాతనే రాజీవ్ కి ప్రమోషన్ రావడం వాళ్లకి మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసు పనిపై రాజీవ్ బెంగుళూర్ వెళతాడు. దాంతో రాహుల్ తో వర్ష ఒక్కతే ఇంట్లో ఉంటుంది. 

రాత్రి వేళలో ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉండటం .. ఏవో ఆకారాలు కనిపిస్తూ ఉండటం, వర్షకు భయాన్ని కలిగిస్తాయి. రాహుల్ కూడా తన ఎదురుగా ఎవరో ఉన్నట్టుగా అటు వైపు చూస్తూ మట్లాడుతూ ఉంటాడు. తన ఫ్లాట్ ముందు 'మంజుల హౌస్' పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ ను తీసేసి, తన నేమ్ ప్లేట్ ను పెట్టాలని వర్ష ఎన్ని సార్లు ప్రయత్నించినా ఏదో ఒక చిత్రమైన సంఘటన జరుగుతూ ఉంటుంది.

దాంతో తన స్నేహితురాలు 'రియా'ను పిలిచి, జరుగుతున్న విషయాలను గురించి చెబుతుంది వర్ష. అనుభవ పూర్వకంగా తెలుసుకున్న రియా, ఈ విషయంలో క్షుద్ర మాంత్రికులను ఆశ్రయించమని సలహా ఇస్తుంది. అలా చేయడానికి ప్రయత్నించిన వర్షకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ ఇంట్లో ఉన్న ప్రేతాత్మ ఎవరిది? ప్రేతాత్మగా మారడానికి కారకులు ఎవరు? ఎవరిపై పగ తీర్చుకోవాలనే పట్టుదలతో ఆ ప్రేతాత్మ ఉంది? అనేది కథ. 

విశ్లేషణ: సాధారణంగా హారర్ సినిమాలలో చాలావరకూ ఒక బంగ్లాలోగానీ .. ఒక ఫ్లాట్ లో గాని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ తరహా కాన్సెప్టులు రూపొందుతూ ఉంటాయి. అదే విధంగా ఈ సినిమా కూడా చాలా వరకూ అపార్టుమెంటులో ఒక ఫ్లాట్ లోనే నడుస్తూ ఉంటుంది. అపార్టుమెంటును దాటుకుని కథ బయటికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. 

కథలో బలం .. కథనంలో ఆసక్తి ఉండాలే గానీ, ఎక్కడ తీసినా ఆ కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తారు. దెయ్యంగా మారడానికి ముందు ఏం జరుగుతుంది? దెయ్యంగా మారిన తరువాత ఏం చేస్తుంది? అనే అంశాలే ఇలాంటి కథల్లో ఉత్కంఠను పెంచేవిగా కనిపిస్తాయి. అందుకు సంబంధించిన ఉత్కంఠ లోపిస్తే, ఆ సన్నివేశాలు తేలిపోతాయి. '7/G' సినిమా విషయానికి వస్తే అదే జరిగింది. ఏ రకంగానూ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 

ఒక ఫ్యామిలీ కొత్తగా ఒక ఇంట్లోకి దిగడం .. ఆ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండటం .. భార్య చెప్పినా భర్త నమ్మక పోవడం .. దెయ్యం కారణంగా పిల్లలు చిత్రంగా ప్రవర్తించడం .. కారణాల దిశగా వెళితే దెయ్యం ఫ్లాష్ బ్యాక్ తెలియడం .. ఇలాంటి దెయ్యం కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. అచ్చు అదే ఫార్మేట్ లో వచ్చిన మరో సినిమా ఇది. అటు భయపెట్టలేకపోయింది .. ఇటు ఎమోషనల్ గా బాధపెట్టనూ లేకపోయింది. 

పనితీరు: దర్శకుడు బలమైన కథాకథనాలను తయారు చేసుకోకపోవడం .. అనుకున్న సన్నివేశాలను ఇంట్రెస్టింగ్ గా ఆవిష్కరించలేకపోవడం అసహనాన్ని కలిగిస్తుంది. సోనియా అగర్వాల్ తప్ప .. మిగిలిన ఆర్టిస్టులు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనివారే. సోనియా అగర్వాల్ పాత్ర అయినా కాస్త ఆసక్తికరంగా మలిచారా అంటే అదీ లేదు. పై పైన అల్లిన సన్నివేశాలతో పలచగా జారిపోయే కథ ఇది. 

కన్నా ఫొటోగ్రఫీ .. సిద్ధార్థ్ విపిన్ నేపథ్య సంగీతం .. బిజూ ఎడిటింగ్ కథకి తగినట్టుగానే కొనసాగాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలలో కెమెరా పనితనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అయితే అసలంటూ కొంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నప్పడే అవి నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లగలుగుతాయి. కానీ కథ .. స్క్రీన్ ప్లే బలహీనంగా ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం మిగతా విభాగాలకు కష్టమవుతుంది. ఈ సినిమా విషయంలో జరిగింది అదే. 

Movie Details

Movie Name: 7G Movie

Release Date: 2024-12-12

Cast: Sonia Agarwal, Smruthi Venkat, Roshan Basheer, Siddharth Vipin

Director: Haroon

Producer: Haroon

Music: Siddharth Vipin

Banner: Dream House

Review By: Peddinti

7G Movie Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews