'పారాచూట్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • తమిళంలో రూపొందిన 'పారాచూట్'
  • 5 ఎపిసోడ్స్ గా పలకరించిన సిరీస్
  • 7 భాషల్లో అందుబాటులోకి వచ్చిన కంటెంట్ 
  • బలమైన కథాకథనాలు 
  • మనసును కదిలించే సన్నివేశాలు 

తమిళంలో 'పారాచూట్' అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. రాసు రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, శక్తి - ఇయల్ అనే ఇద్దరు పిల్లలు ప్రధానమైన పాత్రను పోషించారు. 5 ఎపిసోడ్స్ గా తమిళంలో రూపొందిన ఈ సిరీస్ కి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ .. మరాఠీ .. బెంగాలీ భాషలలో ఈ సిరీస్ ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథేమిటనేది చూద్దాం. 

కథ: ఈ కథ తమిళనాడులోని ఒక టౌన్ లో మొదలవుతుంది. షణ్ముగం (కిశోర్) లక్ష్మి(కని తిరు) ఓ చిన్న ఇంట్లో అద్దెకి ఉంటారు. వారి సంతానమే వరుణ్ ( శక్తి రిత్విక్) రుద్ర (ఇయల్). 11 ఏళ్ల వరుణ్ .. 7 ఏళ్ల రుద్ర ఒక స్కూల్లో చదువుతూ ఉంటారు. ఇద్దరూ కూడా ఆరోగ్య సమస్యలున్న పిల్లలే.   షణ్ముగం ఇంటింటికి తిరిగి వంట గ్యాస్ సిలెండర్లు వేసే పని చేస్తూ ఉంటాడు. తన పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో పెద్ద స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. 

పిల్లలను భయపెట్టడం వల్లనే క్రమశిక్షణతో ఉంటారు .. దండించడం వల్లనే దార్లో పడతారు అనేది షణ్ముగం ఆలోచన. అందువలన అతను తరచూ వరుణ్ పై చేయిచేసుకుంటూ ఉంటాడు. తండ్రి మోపెడ్ ను నడపాలని వరుణ్ కి కోరికగా ఉంటుంది. ఆ మోపెడ్ కి ఆ పిల్లలు 'పారాచూట్' అనే పేరు పెడతారు. ఒక రోజున తండ్రి ఇంట్లో లేని సమయంలో, ఆయన మోపెడ్ పై రుద్రను తీసుకుని బయటికి వెళతాడు వరుణ్. రోడ్డు పక్కన వారు పార్క్ చేసిన బండి కనిపించకుండా పోతుంది. చీకటిపడుతుండటంతో పిల్లల కోసం షణ్ముగం దంపతులు వెదకడం మొదలుపెడతారు.   

ఇదే సమయంలో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ (కృష్ణ) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక శ్రీమంతుడి కొడుకుపై చేయి చేసుకుంటాడు. అతని ఖరీదైన బైక్ ను స్టేషన్ కి తీసుకొస్తాడు. తన గళ్ ఫ్రెండ్ ముందు అవమానం జరగడాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోతాడు. ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ రాత్రే ఓ దొంగ పక్కాగా ప్లాన్ చేసి, ఆ స్టేషన్ లో ఉన్న ఖరీదైన బైక్ ను కాజేస్తాడు. మోపెడ్ పోగొట్టుకున్న వరుణ్ - రుద్రకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాళ్ల పేరెంట్స్ ఏం చేస్తారు? ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ: తండ్రి అంటే ఉన్న భయం కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు పిల్లలు, వాళ్లను వెతికి పెట్టమంటూ పోలీసులను ఆశ్రయించిన పేరెంట్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో తాను పట్టుకున్న ఓ డబ్బున్న యువకుడి బైక్ ను దొంగలు ఎత్తుకుని వెళ్లడం .. ఆ పోలీస్ ఆఫీసరే పిల్లల కిడ్నాప్ కేసును చూడవలసి రావడం, ఆ బైక్ కీ .. ఈ పిల్లలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాలతో ఈ కథ నడుస్తుంది. 

ఈ కథ చాలా సాదాసీదాగా మొదలవుతుంది. కాలక్షేపం కోసం ఈ కంటెంట్ ను టచ్ చేసిన ఆడియన్స్, నిదానంగా టీవీల ముందు కుదురుకుంటారు. ఇక చివరి ఎపిసోడ్ వరకూ అక్కడి నుంచి కదలరు. అంతటి కథాకథన బలం కలిగిన కంటెంట్ ఇది. మొదటి నుంచి చివరివరకూ కథను నడిపించిన తీరుకు, పాత్రలను మలచిన విధానానికి దర్శకుడిని అభినందించకుండా ఉండలేం.

ఒక వైపున ఇంట్లో నుంచి వెళ్లిపోయిన చిన్న పిల్లలు .. వాళ్లను వెతుకుతూ బయల్దేరిన తల్లిదండ్రులు .. మరో వైపున పారిపోతున్న దొంగలు, వాళ్లను పట్టుకునే పనిలో పోలీసులు. ఇలా ఈ నాలుగు ట్రాకులను అల్లుకుంటూ వెళ్లిన తీరు, చివరివరకూ ప్రేక్షకులను అలా కూర్చొబెడుతుంది. తల్లిదండ్రులు .. అన్నాచెల్లెళ్ల ఎమోషన్స్ తో దర్శకుడు అక్కడక్కడా కన్నీళ్లు పెట్టిస్తాడు. 

పనితీరు: తల్లిదండ్రులుగా కిశోర్ .. కని తిరు, పిల్లలుగా శక్తి - ఇయల్ నటన ఆకట్టుకుంటుంది. చిన్నపిల్ల 'ఇయల్' నటన నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆ పాప ఎక్స్ ప్రెషన్స్ మనసును భారం చేస్తాయి. ఇక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గా కృష్ణ , పొరుగింటి వ్యక్తిగా కాళి వెంకట్ నటన మనసుకు పట్టుకుంటుంది.

ఓమ్ నారాయణ్ ఫొటోగ్రఫీ గొప్పగా అనిపిస్తుంది. నైట్ ఎఫెక్ట్ లోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు మంచి మార్కులు కొట్టేస్తుంది. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం, ఈ సిరీస్ కి మరో పిల్లర్ అని చెప్పచ్చు. రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా అనవసరమైన సీన్ అనేది కనిపించదు.

 కథ .. స్క్రీన్ ప్లే .. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. నటీనటుల నటన ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా చెప్పుకోవచ్చు. క్రమశిక్షణ పేరుతో పిల్లలను అతిగా భయపెట్టడం వలన, లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందనే సందేశాన్ని ఇచ్చిన సిరీస్ ఇది. ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ ను చూస్తే, సున్నితమైన భావోద్వేగాలు తప్పకుండా మనసు తలుపు తడతాయి. 


Movie Details

Movie Name: Parachute

Release Date: 2024-11-29

Cast: Shakthi Rithvik, Iyal, Krishna, Kani Thiru, Kishore, Kaali Venkat

Director: Rasu Ranjith

Producer: Krishna

Music: Yuvan Shankar Raja

Banner: Tribal Horse Entertainment

Review By: Peddinti

Parachute Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews