'మెకానిక్ రాకీ - మూవీ రివ్యూ!

  • విష్వక్సేన్  హీరోగా రూపొందిన 'మెకానిక్ రాకీ'
  • ఇది ఆయన మార్క్ సినిమానే
  • అక్కడక్కడా మాత్రమే ఆకట్టుకునే సన్నివేశాలు   
  • రొటీన్ కి భిన్నంగా వెళ్లలేకపోయిన కంటెంట్

కెరియర్ ఆరంభంలో మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథలను ఎక్కువగా ఎంచుకుంటూ వచ్చిన విష్వక్సేన్, ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్ కి రప్పించే కథలలో కనిపిస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. అలా ఆయన చేసిన మరో సినిమానే 'మెకానిక్ రాకీ'. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఆయన చేసిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ : హైదరాబాదులోని 'మలక్ పేట'లో రాకేశ్ ఒక గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు. అతణ్ణి అందరూ 'రాకీ' అని పిలుస్తుంటారు. తన కారులో ఒక మెకానిక్ గా కార్లను రిపేర్ చేయడమే కాకుండా, కారు డ్రైవింగ్ కూడా నేర్పుతూ ఉంటాడు. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన రాకేశ్ ను, అతని తండ్రి రామకృష్ణ (నరేశ్) ఏ లోటూ లేకుండా పెంచుతాడు. అయితే కాలేజ్ చదువుపై అతను పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో, గ్యారేజ్ చూసుకోమని చెప్పి తండ్రి అతని చేతిలో పెడతాడు.

 కాలేజ్ రోజుల్లో రాకీకి శేఖర్ మంచి స్నేహితుడు. అతని చెల్లెలైన ప్రియా (మీనాక్షి చౌదరి)ని చూడగానే రాకీ మనసు పారేసుకుంటాడు. అయితే అతను చదువు మానేయడం వలన, ఆ పరిచయం అక్కడితో ఆగిపోతుంది. మళ్లీ ఇంత కాలానికి అతనికి ప్రియా తారసపడుతుంది. ప్రియా తండ్రి చనిపోయాడనీ, శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని రాకీ షాక్ అవుతాడు. అప్పటి నుంచి కుటుంబ భారాన్ని ప్రియా మోస్తుందని తెలిసి బాధపడతాడు.

ఇలాంటి పరిస్థితుల్లోనే రంకిరెడ్డి (సునీల్) ఎంట్రీ ఇస్తాడు. ఆ గ్యారేజ్ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి అన్ని వైపుల నుంచి రాకీని ఒత్తిడి చేయడం మొదలుపెడతాడు. ఆ టెన్షన్ నుంచి కాస్త దూరంగా ఉంటాడనే ఉద్దేశంతో రాకీ తన తండ్రిని యాత్రలకు పంపిస్తాడు. అక్కడ రామకృష్ణ చనిపోయాడంటూ, దినపత్రికలో ప్రకటన వేయిస్తాడు. ఆ సమయంలోనే అతనికి మాయ (శ్రద్ధా శ్రీనాథ్) పరిచయమవుతుంది. కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఆమెతో, రాకీకి సాన్నిహిత్యం పెరుగుతుంది. 

రామకృష్ణ చనిపోయాడని తెలియగానే ఆ గ్యారేజ్ ను ఆక్రమించడానికి రంకి రెడ్డి రంగంలోకి దిగుతాడు. ఆ గ్యారేజ్ జోలికి రావొద్దని రాకీ అతనిని బ్రతిమాలతాడు. అందుకు 50 లక్షలు ఇస్తానని చెబుతాడు. 10 రోజులలో 50 లక్షలు ఇవ్వకపోతే ఆ గ్యారేజ్ ను ఆక్రమించుకుంటానని రంకి రెడ్డి గడువు పెడతాడు. గడువులోగా రాకీ ఆ డబ్బును సర్దుబాటు చేయగలుగుతాడా?  ప్రియా అన్నయ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? మాయ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: తన తాత సిటీ వచ్చి నిర్మించిన గ్యారేజ్ .. తన తండ్రి రామకృష్ణ ఎంతో కష్టపడి డెవలప్ చేసిన గ్యారేజ్ ను రాకీ ప్రాణంలా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి గ్యారేజ్ అతని చేజారిపోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో తన స్నేహితుడు చనిపోయి, తాను ప్రేమించిన అమ్మాయి ఇబ్బందుల్లో పడటం వరకూ ఫస్టాఫ్ గా నడుస్తుంది. ఆ సమస్యలను అతను ఎలా ఫేస్ చేశాడనేది సెకండ్ పార్టుగా ప్రేక్షకులను పలకరిస్తుంది. 

ఓ తండ్రి .. ఓ కొడుకు .. ఓ గ్యారేజ్, ఒక తల్లి .. కూతురు .. బాధ్యతలేని అన్నయ్య .. ఇలా ఈ కథ ఇంటర్వెల్ వరకూ చాలా సాదా సీదాగానే సాగుతుంది. ఆ తరువాత ఎలాగైనా తన గ్యారేజ్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాకీ పడే టెన్షన్ పతాకస్థాయికి చేరుకుంటుంది. అక్కడి నుంచి కథ మలుపులు తీసుకోవడం మొదలవుతుంది. ప్రీ క్లైమాక్స్ దగ్గర కొత్త పరుగు మొదలైనా, క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి రొటీన్ గానే ఈ సినిమాకి శుభం కార్డు పడుతుంది.
 
మోసగాళ్లు రకరకాల దారులు ఎంచుకుంటూ, మోసం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటూ ఉంటారు. వాళ్ల వలలో పడి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్లు ఎంతోమంది. అలాంటి వాళ్ల ఆటకట్టించాలంటే కాస్త తెలివిగా దెబ్బకొట్టవలసిందే అనే విషయాన్ని స్పష్టం చేసే కథ ఇది. ఈ కథ చివరిలో కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది గానీ, కథ మొదలైన తీరు .. ముగిసిన విధానం మాత్రం కొత్తదనానికి దూరంగానే అనిపిస్తుంది. 

పనితీరు:  విష్వక్సేన్ .. మీనాక్షి చౌదరి .. శ్రద్ధా శ్రీనాథ్ .. నరేశ్ .. సునీల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. విష్వక్సేన్  కాస్త బరువు పెరిగినట్టుగా కనిపించాడు. స్టెప్పులు వేయడానికి కూడా ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. మీనాక్షి -  శ్రద్ధా ఇద్దరి పాత్రలకి ప్రాముఖ్యత ఉండటం విశేషమే. కథాకథనాలతో ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. విష్వక్సేన్ తాత పాత్ర కోసం రాసిన కామెడీ ట్రాక్ మరీ సిల్లీగా అనిపిస్తుంది.  హైపర్ ఆది .. హర్ష పాత్రలు కూడా చప్పగానే సాగుతాయి.         
                
మనోజ్ రెడ్డి కెమెరా పనితనం ఫరవాలేదు .. జేక్స్ బిజోయ్ బాణీలు .. నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి. అన్వర్ అలీ ఎడిటింగ్ ఓకే. సంభాషణలలోను ఎలాంటి ఛమక్కులు వినిపించవు.  విష్వక్ సేన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ, ఈ కంటెంట్ ను చివరివరకూ నెట్టుకొచ్చాడు. కథాకథనాలు రొటీన్ కి కాస్త భిన్నంగా ఉండేలా చూసుకున్నట్టయితే ఇంకాస్త బెటర్ గా అనిపించేదేమో అనే భావన కలుగుతుంది.   

Movie Details

Movie Name: Mechanic Rocky

Release Date: 2024-11-22

Cast: Vishwak Sen, Meenakshi Choudary, Shraddha Srinath, Sunil, Naresh, Harshavardhan

Director: Raviteja Mullapudi

Producer: Rajani Talluri

Music: Jecks Bijoy

Banner: SRT

Review By: Peddinti

Mechanic Rocky Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews