'మట్కా' - మూవీ రివ్యూ!

  • పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌ తో నడిచే 'మట్కా'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించిన వరుణ్ తేజ్ 
  • ఆసక్తి కలిగించని కథ - కథనం
  • నీరసంగా సాగే సన్నివేశాలు 
  • నిరాశ పరిచిన కంటెంట్ 


కెరీర్‌ ప్రారంభంలో వైవిధ్యమైన కథలను ఎంచుకుని సినిమాలు చేసిన హీరో వరుణ్‌ తేజ్‌ ఇటీవల సినిమాల ఎంపికను మార్చుకున్నాడు. గత కొంతకాలంగా కమర్షియల్‌ సినిమాల వైపు టర్న్‌ తీసుకున్న ఆయన ఇటీవల చేసిన సినిమాలు సరైనా ఫలితాన్ని అందించలేదు. ఇక కమర్షియల్‌ విజయమే లక్ష్యంగా వరుణ్‌ తేజ్‌ ఈ సారి 'మట్కా'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పీరియాడిక్‌ కథతో ఈ చిత్రాన్ని కరుణ్‌కుమార్‌ తెరకెక్కించారు. ఇంతకుముందు 'పలాస' చిత్రంతో సక్సెస్‌ను అందుకున్న ఆయన రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అసలు ఈ చిత్రం కథేంటి? అనేది తెలుసుకుందాం. 

కథ: బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థులుగా వచ్చిన ఓ కుటుంబానికి చెందినవాడు వాసు (వరుణ్‌ తేజ్‌). ఆహారపొట్లం కోసం జరిగిన గొడవలో అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి బాలనేరస్థుడిగా జైలుకు వెళతాడు. అక్కడి జైలర్‌ నారాయణ మూర్తి (రవి శంకర్‌) జైలులో వాసుతో ఫైటింగ్‌లు చేయిస్తూ అతని మీద పందాలు కడుతూ డబ్బులు దండుకుంటూ ఉంటాడు. శిక్షా కాలం పూర్తిచేసుకుని జైలును నుంచి  విడుదలయ్యాక, పూర్ణా మార్కెట్‌లోని కొబ్బరికాయల షాపులో పనికి చేరతాడు.
 
కొబ్బరికాయల వ్యాపారి అప్పాల రెడ్డి (అజయ్‌ ఘోష్‌), కేబీ రెడ్డి ( జాన్‌ విజయ్‌) మనిషిని కొట్టడంతో, కేబీ రెడ్డి, అప్పాల రెడ్డిని చంపాలని చూస్తాడు. అయితే ఆ గొడవలో కేబీ రెడ్డిని కొట్టి అతని ప్రత్యర్థి నానిబాబు (కిషోర్‌)కు దగ్గరవుతాడు వాసు. అతనితో కలిసి పార్టనర్‌గా వ్యాపారం ప్రారంభిస్తాడు. అనతి కాలంలోనే నాని బాబు సపోర్ట్‌తో పూర్ణా మార్కెట్‌కు లీడర్‌గా ఎదుగుతాడు. ఓ సారి బట్టల వ్యాపారం పెడదామని, వాటి డీల్‌ కోసం ముంబయ్‌ వెళ్లిన వాసు అక్కడ వచ్చిన ఐడియాతో మనసు మార్చుకుని మట్కా వ్యాపారం స్టార్ట్‌ చేస్తాడు.

అతి తక్కువ సమయంలోనే మట్కా డాన్‌గా ఎదిగిన వాసుకు అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి? అక్రమాస్తులు కూడబెట్టడం, ప్రజలు మట్కా వల్ల ఆత్మహత్యలకు పాల్పడటం వంటి సంఘటనలను చూసి కేంద్ర ప్రభుత్వం వాసు మీద చర్యలు తీసుకోవడానికి సీబీఐ వాళ్లను పంపుతుంది? ఇక ఆ తరువాత జరిగిందేమిటి? వాసు మట్కా వ్యాపారం కొనసాగుతుందా? అసలు ఈ కథలోకి సుజాత (మీనాక్షి చౌదరి) ఎలా వస్తుంది? ఈ ఇద్దరి మధ్య జరిగిందేమిటి? సీబీఐ ఆఫీసర్‌గా సాహు (నవీన్‌ చంద్ర) ఏం చేశాడు? అనేది మిగతా కథ 

విశ్లేషణ: దర్శకుడు 1968, వైజాగ్‌ కథా నేపథ్యాన్ని ఈ చిత్రం కోసం ఎంచుకున్నాడు. ఆ సమయంలో జరిగే మట్కా, ఇతర వ్యాపారాలను చూపించే ప్రయత్నం చేశాడు. హీరో జీరో స్థాయి నుంచి ఓ డాన్‌గా ఎదగడం అనేది టూకీగా ఈ చిత్ర కథ. అయితే ఇలాంటి కథలు ఇప్పటికే వెండితెరపై చాలా వచ్చాయి. ఇది కూడా ఆ కోవలోకే చెందుతుంది. అయితే ఈ చిత్రం స్క్రీన్‌ప్లేను దర్శకుడు బలంగా రాసుకోక పోవడం వల్ల ఏ సన్నివేశం పెద్దగా ఆసక్తికరంగా కనిపించదు.

ఇలాంటి కథలో ఉండాల్సిన ఎమోషన్స్‌, కనెక్టివిటీ 'మట్కా'లో మిస్‌ అయ్యింది. అయితే మట్కా బిజినెస్‌తో ఓ అనామకుడైన హీరో దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోంభంలోకి నెట్టివేసినట్లు ఈ చిత్రంలో దర్శకుడు చూపించిన కొత్త పాయింట్, సన్నివేశాలు సాదాసీదాగా ఉండటంతో ఈ పాయింట్‌ తేలిపోయింది. ఫస్ట్‌ హాఫ్‌ కాస్త ఫర్వాలేదనిపించుకున్నా, సెకండాఫ్‌ మాత్రం మరీ బలహీనమైన సీన్స్‌తో, రొటిన్‌గా ఉండటంతో పెద్దగా థ్రిల్లింగ్‌గా అనిపించదు. 

హీరో పాత్రలో నెగెటివ్‌ టచ్‌ వున్నప్పుడు ఆడియన్స్‌ ఆ పాత్రతో ట్రావెల్ అవ్వాలంటే ఖచ్చితంగా పాత్రతో కనెక్ట్‌ అవ్వాలి. ఈ సినిమాలో వాసు పాత్రతో అలా వస్తూ, సన్నివేశాలు చేస్తూ వెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది తప్ప, ఆ పాత్రతో ప్రేక్షకులు ఏ మాత్రం కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉండదు. హీరో చిన్నప్పటి జీవితం .. జైలు కెళ్లడం .. ఆ వెంటనే కోట్లకు అధిపతిగా ఎదగటం అంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది తప్ప, హీరో క్యారెక్టరైజైషన్‌లో ఆ స్ట్రగుల్‌ కనిపించదు. 

ద్వితీయార్థంలో సన్నివేశాలు లాజిక్‌లకు దూరంగా వున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సరైన ప్రతి నాయకుడి పాత్ర లేకపోవడం పెద్ద మైనస్‌. అందుకే యాక్షన్‌ సన్నివేశాలు కూడా చప్పగానే అనిపించాయి. ఇలాంటి కథను ఎంచుకున్నప్పుడు క్యారక్టరైజేషన్స్‌ శక్తివంతంగా ఉండాలి. కానీ దర్శకుడు ఆ వైపుగా దృష్టి పెట్టినట్లు అనిపించలేదు. ఇక  ప్రీ క్లైమాక్స్‌లో వాసు తన కూతురు చెప్పే మేక కథ ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉంది. టోటల్‌గా మట్కా ఎలాంటి మెరుపులు, థ్రిల్లింగ్స్‌ ఎలిమెంట్స్‌ లేకుండా చప్పగా కొనసాగింది. 

నటీనటులు పనితీరు: వాసుగా వరుణ్‌ తేజ్‌ నటన బాగుంది. మూడు డిఫరెంట్‌ వెరియేషన్స్‌లో కనిపించిన వరుణ్‌ తేజ్‌ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. అయితే వయసు పైబడిన పాత్రలో మాత్రం వరుణ్‌ గెటప్‌ సహజంగా అనిపించలేదు. కథానాయిక మీనాక్షి పాత్రకు నటన పరంగా పెద్ద స్కోప్‌ లేదు. అలా అని గ్లామర్‌గా కూడా ఆమె కనిపించలేదు. సోఫియా నోరా ఫతేహి అందాల ప్రదర్శన కుర్రకారును మెప్పించే విధంగా ఉంది. అజయ్‌ ఘోష్‌, నవీన్‌ చంద్ర, సలోని, కిషోర్‌ పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు. పాత్రలను మలిచిన విధానంలోనే లోపాలు ఉన్నాయి. జీవీ ప్రకాష్ సంగీతం, నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించాయి. కెమెరా వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు వున్నాయి. 

చివరిగా .. పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌ కథకు మట్కా అనే జూదంను జత చేసి రాసుకున్న ఈ కథలో  పాయింట్‌ ఆసక్తికరంగా ఉన్నా, కథ .. కథనాలు నడిపించడంలో, పాత్రలను డిజైన్‌ చేయడంలో దర్శకుడు విఫలం కావడంతో ఎక్కడా ప్రేక్షకులకు థ్రిల్ల్‌ను పంచదు. బోరింగ్‌గా.. నీరసంగా సాగే కథలో ఎక్కడా కూడా ఉత్సుకత కనిపించలేదు.

Movie Details

Movie Name: Matka

Release Date: 2024-11-14

Cast: Varun Tej, Norah Fatehi, Meenakshi Chaudhry, Naveen Chandra, Ajay Ghosh, Kannada Kishore

Director: Karuna Kumar

Producer: Vijender Reddy - ajani Thalluri

Music: GV Prakash Kumar

Banner: Vyra Entertainments - SRT Entertainment

Review By: Madhu

Matka Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews