'లబ్బర్ పందు' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • సెప్టెంబర్లో విడుదలైన సినిమా 
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • స్పోర్ట్స్ డ్రామాతో ముడిపడిన లవ్
  • గ్రామీణ నేపథ్యంతో కూడిన కథాకథనాలు  
  • ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిచ్చిన దర్శకుడు 

ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చిన సినిమాల జాబితాలో 'లబ్బర్ పందు' ఒకటిగా కనిపిస్తుంది. తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అట్టకత్తి దినేశ్ .. హరీశ్ కల్యాణ్ .. సంజనా కృష్ణమూర్తి ప్రధానమైన పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా, నిన్నటి నుంచి 'హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ : 2011లో ఈ కథ మొదలవుతుంది. శేషు (అట్టకత్తి దినేశ్)కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. లోకల్ గా అతనితో సమానంగా ఆడేవారు లేరు. అందువలన అతనిని అందరూ ఎంతో అభిమానిస్తూ ఉంటారు. ఇక ఆ పక్కనే ఉన్న ఊళ్లో కరుప్పన్ (కాళీ వెంకట్)కి కూడా క్రికెట్ అంటే ప్రాణం. అతని తమ్ముడు వెంకటేశ్, ఆ టీమ్ లో చక్రం తిప్పుతూ ఉంటాడు. ఆ కారణంగానే అభి ( హరీశ్ కల్యాణ్)కి ఆ టీమ్ లో చోటు దక్కకుండా పోతుంది. దాంతో ఎవరు పిలిచినా వెళ్లి ఆ టీమ్ తో కలిసి అభి ఆడుతూ ఉంటాడు. 

శేషు కుటుంబ బాధ్యత పట్టకుండా క్రికెట్ ఆడుతూ ఉండటం ఆయన భార్య యశోదకి నచ్చదు. కూతురు దుర్గ ( సంజన కృష్ణమూర్తి) పెళ్లి గురించి ఆలోచించకుండా అతను క్రికెట్ తో గడిపేయడం పట్ల ఆమె కోపంగా ఉంటుంది. దుర్గ - అభి ప్రేమించుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే శేషు కూతురే దుర్గ అనే విషయం అభికి తెలియదు. అందువలన అతను తరచూ శేషుతో గొడవపడుతూ ఉంటాడు.

దుర్గ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతుంది. ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెబుతుంది. అయితే ఆ కుర్రాడే అభి అనే విషయం శేషుకి తెలియదు. అందువలన విషయం జాతకాల వరకూ వెళుతుంది. దుర్గ జాతకం చూడాలని అభి తల్లి అడగడంతో, జాతకం కోసం అతను ఆమె ఇంటికి వెళతాడు. ఆ సమయంలోనే ఆ ఇంట్లో శేషును చూస్తాడు. అప్పుడు అతనికి అసలు సంగతి అర్థమవుతుంది. అప్పుడే శేషుకి కూడా నిజం తెలియడంతో కోపంతో రగిలిపోతాడు.

క్రికెట్ లో శేషు తరువాత అందరూ గొప్పగా చెప్పుకునే పేరు అభి. అందువలన అతనంటే శేషు కోపంగా ఉంటాడు. తన చెల్లెలు అతనిని ఇష్టపడిందని తెలిసిన దగ్గర నుంచి అభిపై కోపం మరింతగా పెరుగుతుంది. అభితో దుర్గ పెళ్లి జరగకూడదని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో శేషు - అభి కలిసి ఒకే టీమ్ లో ఆడవలసి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటన ఎఫెక్ట్ అభి - దుర్గ పెళ్లిపై ఎంతవరకూ పడుతుందనేది కథ. 

విశ్లేషణ : ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. గ్రామీణ నేపథ్యంలో జరిగే క్రికెట్ పోటీల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రికెట్ పోటీలతో ముడిపడి ఒక లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన దుర్గ, అభిని ఇష్టపడుతుంది. అయితే తండ్రి శేషు అంగీకారం లేనిదే అభిని పెళ్లి చేసుకోలేని స్థితిలో ఆమె ఉంటుంది. ఆమె అంటే ఉన్న ప్రేమ కారణంగా శేషుతో గొడవలు మానేయడానికి అభి సిద్ధమవుతాడు. క్రికెట్ ఆడటంలో మంచి పేరున్న అభిని అంగీకరించలేని స్థితిలో శేషు ఉంటాడు. 
ఈ ముగ్గురు మధ్య జరిగే కథ ఇది. 

'లబ్బర్ పందు' అంటే .. 'లబ్బర్ బంతి' అని అర్థం. గ్రామాల్లో 'లబ్బర్ బంతి'తోనే క్రికెట్ ఆడుతూ ఉంటారు. అలాంటి ఆట చుట్టూనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులు .. అక్కడి యువకుల ధోరణి .. మైదానంలో గొడవలు .. ఆటలో రాజకీయాలు .. గెలుపుతో ముడిపడిన జీవితాలు .. ఇలా అనేక కోణాల్లో దర్శకుడు అల్లుకున్న ఈ కథ, సహజత్వానికి దగ్గరగా ఉంటూ ఆకట్టుకుంటుంది. 

సాధారణంగా లోకల్ గా జరిగే క్రికెట్ పోటీలలో, గెలుపు .. ఓటములు రెండు టీమ్ లపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఇక్కడ గెలుపు ఓటములు ఒక ప్రేమజంటపై .. వారి జీవితాలపై కూడా ప్రభావం చూపించేవిగా మారతాయి. దాంతో ఈ రెండు వైపుల నుంచి ఆడియన్స్ కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రధానమైన పాత్రలు ఓ అరడజను వరకూ కనిపిస్తాయి. ఆ పాత్రలను దర్శకుడు మలిచిన తీరు మెప్పిస్తుంది. ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతుంది .. కనెక్టు అవుతుంది. 

మన విలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న క్రికెట్ ను చూస్తున్నట్టుగానే ఉంటుంది తప్ప, సినిమా చూస్తున్నట్టుగా అనిపించదు. అంత సహజంగా కథ కదులుతూ ఉంటుంది. లవ్ .. ఎమోషన్స్  మనసును టచ్ చేస్తూ ఉంటాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా, సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చారు. డ్యూయెట్లు .. రొమాన్స్ గట్రా లేకపోయినా ఆ లోటు తెలియదు. 

దినేశ్ పురుషోత్తమన్ ఫొటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యంలో లొకేషన్స్ ను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. సీన్ రోల్డన్ నేపథ్య సంగీతం, ఈ కంటెంట్ ను కాపాడుతూ వచ్చింది. మదన్ గణేశ్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. ఇగో పక్కన పడితే జీవితం మరింత అందంగా కనిపిస్తుంది. విజయానికి కారణం సామర్థ్యమే కావాలి అనే సందేశం ఈ కథలో కనిపిస్తుంది. చిన్న సినిమానే అయినా, ఎందుకు ఇంత పెద్ద హిట్ అయిందనేది ఈ కథను ఫాలో అయితే అర్థమవుతుంది.

Movie Details

Movie Name: Lubber Pandhu

Release Date: 2024-10-31

Cast: Harish Kalyan, Attakathi Dinesh, Swasika ,Sanjana Krishnamoorthy, Kaali Venkat

Director: Tamizharasan Pachamuthu

Producer: Lakshman Kumar

Music: Sean Roldan

Banner: Prince Pictures

Review By: Peddinti

Lubber Pandhu Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews