'కొండల్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • సెప్టెంబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా
  • సముద్రం నేపథ్యంలో సాగే కథాకథనాలు  
  • ఈ నెల 13 నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • తక్కువ బడ్జెట్లో అందించిన ఇంట్రెస్టింగ్ కంటెంట్
  • నేపథ్య సంగీతానికి ఎక్కువ మార్కులు 

మలయాళంలో ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చిన సినిమాలలో 'కొండల్' ఒకటి. రివేంజ్ డ్రామాతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. అజిత్ మాంపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆంటోని వర్గీస్ .. షబీర్ కొల్లరక్కల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో రాజ్ బి శెట్టి కీలకమైన పాత్రలో నటించాడు. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సినిమా, 'నెట్ ఫ్లిక్స్' లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.

అది సముద్ర తీరప్రాంతం .. ఎంతోమంది మత్స్య కారులు ఆ సముద్రంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అలాంటివారిలో ఇమ్మాన్యుయేల్ (ఆంటోని వర్గీస్) ఒకడు. కండబలంతో గానీ .. కరెన్సీ బలంతోగాని తమ జీవితాలను నిర్దేశించడానికి ఎవరు ప్రయత్నించినా ఎదురెళ్లే వ్యక్తి అతను. ఒకసారి అతను కొత్తగా ఓ బృందంలో చేరిపోయి, వాళ్లతో పాటు చేపలవేటకి సముద్రంలోకి వెళతాడు. ఆ బోటు యజమాని మేనల్లుడు జూడూ (షబీర్) కూడా ఆ బృందంలో ఉంటాడు. 

ఆ బోటుకు డ్రైవర్ గా స్ట్రాంగర్ (నందూ) వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక అదే బోటులో ఉన్న మైఖేల్ .. సాబూ .. కొండారి కూడా జూడూ మనుషులే. చేపల వేటకి బోటు ఎప్పుడు సముద్రంలోకి వెళ్లినా ఈ ఐదుగురు మాత్రం తప్పకుండా ఉంటారు. అందువలన ఈ ఐదుగురు ఒక టీమ్ గా ఉంటారు. అలాంటి వాళ్లతో కలిసి ఇమ్మాన్యుయేల్ వెళతాడు. అలా ఒక డజను మందితో కలిసి ఆ బోటు సముద్రంలోకి వెళుతుంది. 

తమ బోటులోకి ఫస్టు టైమ్ వచ్చిన ఇమ్మాన్యుయేల్ పై వాళ్లంతా కూడా ఒక కన్నేసి ఉంచుతారు. ఆ బోటులో 'అలోసి' అనే వ్యక్తి తీవ్రంగా గాయపడతాడు. బోటు వెనక్కి తిప్పమని ఇమ్మాన్యుయేల్ ఎంతగా చెప్పినా అందుకు జూడూ అంగీకరించడు. 'అలోసి' చనిపోవడంతో, జూడూతో .. అతని సన్నిహితులతో ఇమ్మాన్యుయేల్ కి శత్రుత్వం పెరుగుతుంది. అప్పటి నుంచి వాళ్లంతా ఇమ్మాన్యుయేల్ పై దాడి చేయడానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తుంటారు. 

జూడూ .. అతని స్నేహితులు సాధారణమైన వాళ్లు కాదనీ, వాళ్లకి ఎదురుతిరిగితే ఎంతటివారినైనా లేపేస్తారని ఇమ్మాన్యుయేల్ తో వంటపని చేసే కొండారి చెబుతాడు. కొంతకాలం క్రితం ఇలాగే  ఎదురు తిరిగిన ఒక వ్యక్తిని అడ్రెస్ లేకుండా చేశారని అంటాడు. అలా కనిపించకుండా పోయిన డేనియల్ ను వెతుక్కుంటూనే తాను వచ్చానని ఇమ్మాన్యుయేల్ చెబుతాడు. ఆ మాట వినగానే  కొండారి భయంతో ఒణికిపోతాడు. 

కొండారి వెళ్లి ఈ విషయాన్ని జూడూ వర్గానికి చేరవేస్తాడు. ఇమ్మాన్యుయేల్ వచ్చింది చేపల వేటకి కాదనీ, అతను డేనియల్ ఆచూకీ తెలుసుకోవడానికి వచ్చాడనే విషయం జూడూ వర్గానికి అర్థమవుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? డేనియల్ ఎవరు? అతను ఇమ్మాన్యుయేల్ కి ఏమవుతాడు? జూడూకి .. డేనియల్ కి ఉన్న గొడవేంటి? అనేది మిగతా కథ.          

చుట్టూ ఎటు చూసినా సముద్రం .. మధ్యలో ఓ బోటు .. ఆ బోటులో ఓ డజను మంది మనుషులు.
కథ అంతా ఆ బోటులోనే నడవాలి. కథా పరిధి తగ్గుతూ వెళ్లడం వలన బోర్ కొడుతుందేమోనని అనుకోవడం సహజం. కానీ దర్శకుడు ఆ పాత్రలను మలచిన తీరు .. సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం ఎంతమాత్రం బోర్ కొట్టనీయదు. టైట్ కంటెంట్ తో దర్శకుడు మెప్పించాడు. 

మత్స్య కారుల జీవితాలు ఎలా ఉంటాయి? సముద్రంలో వేటకి వెళ్లిన తరువాత వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఎలాంటి అవాంతరాలను వారు అధిగమించవలసి వస్తుంది? చేపలవేటకు వెళ్లిన వారి మధ్య గ్రూపులు ఏర్పడితే ఎలా ఉంటుంది? అనే విషయాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరిస్తూనే, రివేంజ్ డ్రామాను నడిపించిన తీరు ఆసకిని రేకెత్తిస్తుంది. బోటులో జరిగే యాక్షన్ సీన్స్ .. షార్క్ చేప నేపథ్యంలో వచ్చే సీన్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కి సంతృప్తికరంగా అనిపిస్తుంది. 

ప్రధానమైన పాత్రధారులంతా తమ పాత్రలకి జీవం పోశారు. దీపక్ మీనన్ కెమెరా పనితనం .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం .. శ్రీజిత్ ఎడిటింగ్ కథకు అదనపు బలంగా నిలిచాయి. చాలా తక్కువ బడ్జెట్ లో సముద్రం నేపథ్యంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. 


Movie Details

Movie Name: Kondal

Release Date: 2024-10-13

Cast: Antony Varghese, Shabeer Kallarakkal, Raj B Shetty, Nandu Madhav

Director: Ajith Mampally

Producer: Sophia Paul

Music: Sam CS

Banner: Weekend Blockbusters

Review By: Peddinti

Kondal Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews