'జై మహేంద్రన్' (సోనీలివ్) వెబ్ సీరీస్ రివ్యూ!

  • సైజు కురుప్ ప్రధాన పాత్రగా 'జై మహేంద్రన్'
  • కీలకమైన పాత్రలో సుహాసిని
  • తాశీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగే కథ
  • సహజత్వానికి దగ్గరగా కనిపించే సంఘటనలు
  • వినోదభరితమైన అంశాలకు దూరంగా వెళ్లిన కంటెంట్  

మలయాళంలో రూపొందిన వెబ్ సిరీస్ 'జై మహేంద్రన్'. రాజీవ్ రిజీ నాయర్ రాసిన ఈ కథకు దృశ్య రూపాన్ని ఇచ్చింది శ్రీకాంత్ మోహన్. సైజు కురుప్ .. సుహాసిని ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా అందించారు. నిన్నటి నుంచే 'సోనీ లివ్'లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

మహేంద్రన్ (సైజు కురుప్) త్రివేండ్రం పరిధిలోని 'పలాజిక్కుళం'లో డిప్యూటీ తాశిల్దారుగా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య ప్రియా (మియా జార్జ్) గర్భవతి. మహేంద్రన్ కి ఆఫీసులో బాలు (రాహుల్ రిజీ నాయర్) కుడిభుజంగా ఉంటాడు. ఎవరు ఏ పనిమీద వచ్చినా, తమకి ప్రయోజనం లేకుండా మాత్రం ఆ పని పూర్తిచేయని పరిస్థితిలో వాళ్లు ఉంటారు. ఈ విషయంలో భర్త వైఖరిని మహేంద్రన్ భార్య ప్రియా ఖండిస్తూ ఉంటుంది. 

ఇలాంటి పరిస్థితుల్లోనే అక్కడికి తాశీల్దారుగా శోభ (సుహాసిని) వస్తుంది. కూతురు చిన్నప్పుడే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె, అప్పటి నుంచి తల్లి - తండ్రి తానై కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది. ఆఫీసుకి తీరుబడిగా వచ్చే మహేంద్రన్ కి, శోభ చాలా సిన్సియర్ అనే విషయం అర్థమవుతుంది. ఆమె క్రమశిక్షణకి తగినట్టుగా నడుచుకోవడం వాళ్లకి కష్టంగా మారుతుంది. ముఖ్యంగా శోభ పట్ల మహేంద్రన్ తీవ్రమైన అసంతృప్తితో ఉంటాడు. 

ఇలాంటి పరిస్థితుల్లోనే తన స్థలం విషయంలో ఒక నిరుపేద తన పరిస్థితిని గురించి శోభకు చెప్పుకుంటాడు. అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతో శోభ తీసుకున్న నిర్ణయం ఆమె మెడకు చుట్టుకుంటుంది. ఫలితంగా శోభతో పాటు మహేంద్రన్ పై కూడా సస్పెన్షన్ వేటు పడుతుంది. తాను తీసుకున్న నిర్ణయం రాజకీయంగాను ముడిపడి ఉందనే విషయం శోభకు అర్థమవుతుంది. దాంతో ఆమె ఆలోచనలో పడుతుంది. 

మహేంద్రన్ మొదటి నుంచి కూడా కాస్త కన్నింగ్ గా ఆలోచన చేసే మనిషి. అందువలన అతను ఈ కేసు నుంచి బయటపడటానికి ఏం చేయాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి వస్తాడు. తనకి జాబ్ చాలా అవసరమనీ, డబ్బుతో కూడిన మరో మార్గంలోనైనా ఈ కేసు నుంచి బయటపడాలని అతనితో శోభ అంటుంది. పైసా ఖర్చు చేయకుండానే తమ సీట్లలో తాము కూర్చుంటామని చెబుతూ, మహేంద్రన్ ఒక ప్లాన్ చేస్తాడు. అదేమిటి? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.

మహేంద్రన్ .. ఈ కథలో ప్రధానమైన పాత్ర. అతను తాను అనుకున్న పనిలో సాధించిన సక్సెస్ ను ఈ టైటిల్ సూచిస్తుంది. తాశీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగే కథ ఇది. అక్కడికి ఎలాంటి పనులమీద ఎవరెవరు వస్తుంటారు? అక్కడి సిబ్బంది పనితీరు ఎలా ఉంటుంది?క్రిందిస్థాయి ఉద్యోగుల స్వభావం పరిస్థితులను బట్టి ఎలా మారిపోతూ ఉంటుంది? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. 

దర్శకుడు ఎంచుకున్న కథ ఏదైనా .. కథాంశం ఏదైనా ప్రధానమైన ఉద్దేశం వినోదాన్ని అందించడమే. కానీ ఆ విషయంలో దర్శకుడు నిరాశ పరిచాడనే చెప్పాలి. ఒక తాశీల్దారు ఆఫీసులో ఒక మూలన బెంచ్ వేసుకుని కూర్చుని, అక్కడ జరిగే తతంగం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతే తప్ప, ఏ వైపు నుంచి కూడా సరదాగా నవ్వుకునే వినోదాన్ని దర్శకుడు రాబట్టలేకపోయాడు. ఇటు మహేంద్రన్ .. అటు శోభ ఫ్యామిలీ నేపథ్యం కూడా చూపించారు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. 

ఇక సుహాసిని ఉందనగానే ఆమె పాత్రకి మంచి వెయిట్ ఉంటుందేమోనని అనుకోవడం సహజం. కానీ ఆ స్థాయిలో ఆమె పాత్రను డిజైన్ చేయలేదు. సమస్య ఎదురు కాగానే మహేంద్రన్ పై ఆధారపడటం వలన ఆమె పాత్ర తేలిపోతుంది. చివర్లో కాస్త హడావిడి చేశారు గానీ, ప్రేక్షకులు పట్టించుకునే స్థాయిలో అది లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా అలా సాదాసీదాగా ఈ కథ నడిచిపోతూ ఉంటుందంతే. 

ప్రశాంత్ రవీంద్రన్ ఫొటోగ్రఫీ .. సిద్ధార్థ్ ప్రదీప్ సంగీతం .. క్రిష్టి సెబాస్టియన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. సాధారణంగా తాశీల్దారు కార్యాలయం దగ్గర కనిపించే వాతావరణాన్ని సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అయితే అక్కడ జరిగే సంఘటనల నుంచి హాస్యాన్ని ఆవిష్కరించడంలో విఫలమయ్యారు. మంచి తారాగణం ఉన్నప్పటికీ మనసును పట్టుకోలేకపోయిన సిరీస్ ఇది. 

Movie Details

Movie Name: Jai Mahendran

Release Date: 2024-10-11

Cast: Saiju Kurup, Suhasini Maniratnam, Miya George, Suresh Krishna, Johny Antony

Director: Srikanth Mohan

Producer: Rahul Riji Nair

Music: Sidhartha Pradeep

Banner: First Print Studios

Review By: Peddinti

Jai Mahendran Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews