'సారంగదరియా' (ఆహా) మూవీ రివ్యూ !

  • ఫ్యామిలీ డ్రామాగా 'సారంగదరియా'
  • రొటీన్ గా అనిపించే కథాకథనాలు 
  • నిదానంగా .. నీరసంగా సాగే సన్నివేశాలు 
  • ఆలోచింపజేసే ఒక కొత్త కోణం
  • వినోదానికి దూరంగా నడిచే కంటెంట్ 

ఈ మధ్య కాలంలో కథలన్నీ కాంబినేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. కథ తానే హీరోగా మారిపోయి ప్రేక్షకుల ముందుకు వచ్చే సందర్భాలు తగ్గుతూ వస్తున్నాయి. అలా కథనే హీరోగా రూపొందిన సినిమాగా 'సారంగదరియా' కనిపిస్తుంది. జులై 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం . 

ఈ కథ వైజాగ్ లో నడుస్తూ ఉంటుంది. కృష్ణకుమార్ (రాజా రవీంద్ర) లక్ష్మి (నీలప్రియ) మధ్యతరగతి దంపతులు. వారి సంతానమే అర్జున్ (మోయిన్) సాయి (మోహిత్) అనుపమ (యశస్విని). కృష్ణకుమార్ ఒక ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని పెద్ద కొడుకు అర్జున్ ప్రేమించిన 'కావ్య' ఓ ప్రమాదంలో చనిపోతుంది. అప్పటి నుంచి అతను మద్యానికి బానిసై ఎక్కువగా బార్లోనే కాలం గడుపుతూ ఉంటాడు. 

కృష్ణకుమార్ రెండో అబ్బాయి సాయి .. ముస్లిమ్ కుటుంబానికి చెందిన ఫాతిమా (మధులత)ను లవ్ చేస్తూ ఉంటాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇద్దరు కొడుకులు ఇంటిని గురించి పట్టించుకోకపోవడంతో ఒంటి చేత్తో కృష్ణకుమార్ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. అదే సమయంలో రాజ్ అనే యువకుడు, అనుపమను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ ఉంటాడు. కానీ ఆమె అతణ్ణి దూరం పెడుతూ ఉంటుంది. 

అదే పనిగా తాగుతూ అర్జున్ అందరితో గొడవపడుతూ స్టేషన్ కి వెళతాడు. అలాగే ప్రేమ వ్యవహారంలో సాయి కూడా స్టేషన్ కి వెళతాడు. ఆ ఇద్దరినీ విడిపించుకురావడాన్ని కృష్ణకుమార్ అవమానంగా భావిస్తాడు. కాలేజ్ లో స్టూడెంట్స్ ను సరైన దార్లో పెడుతున్న తాను, తన పిల్లలను ఎందుకు క్రమశిక్షణగా పెంచలేకపోయాననే ఒక అంతర్మథనం అతనిలో జరుగుతూ ఉంటుంది. ఇక ఒక్కడి సంపాదన చాలాకపోవడం వలన అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. 

ఒక వైపున మగపిల్లల ధోరణి తలనొప్పిగా తయారు కావడం, మరో వైపున అప్పులవాళ్లు ఇంటిమీదకి వస్తుండటం కృష్ణకుమార్ ను ఆవేదనకు గురిచేస్తూ ఉంటుంది.  ఇలాంటి పరిస్థితుల్లోనే అనుపమను ప్రేమించిన రాజ్ వైపు నుంచి ఆ కుటుంబానికి మరో సమస్య వచ్చి పడుతుంది. దాంతో అప్పటివరకూ ఆ కుటుంబం దాచిన ఒక రహస్యం బయటపడుతుంది. కృష్ణకుమార్ ఫ్యామిలీ దాచిన ఆ రహస్యం ఏమిటి? అది ఆ కుటుంబాన్ని ఎలాంటి ప్రమాదంలోకి నెడుతుంది? అనేది కథ. 
    
పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారి ఆకలి - ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు. వాళ్లు ఎదుగుతూ ఉంటే పరువు ప్రతిష్ఠలను గురించి ఆలోచించవలసిన పరిస్థితి ఎదురవుతుంది. పిల్లల స్వేచ్ఛకి ఎక్కడ గీత గీయాలనే విషయంలో తల్లిదండ్రులకు ఒక అయోమయం ఉంటుంది. తమ పరిధి ఎంతవరకూ అనే విషయంలో తమకి తామే ఒక గీత ఎక్కడ గీసుకోవాలో తెలియని ఒక అయోమయ స్థితి పిల్లలకు ఉంటుంది. ఇక్కడే మానసిక సంఘర్షణ మొదలవుతుంది. 

అలాంటి ఒక నేపథ్యంలోనే ఈ కథ నడుస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి  కథలు ఇంటికొకటి వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి కథను సినిమాగా తీయాలంటే, వినోదపరమైన అంశాలను కూడా జోడించవలసిన ఉంటుంది. అలాంటి అంశాలను జోడించకుండా, కేవలం మెయిన్ లైన్ పై మాత్రమే నడిపించిన కథ ఇది. 

ఈ కథలో ప్రధానమైన పాత్రధారి కృష్ణకుమార్ మొదటి నుంచి చివరివరకూ సీరియస్ గానే కనిపిస్తాడు. వండి పెట్టడం వరకే తన పాత్ర అన్నట్టుగా అతని భార్య ఉంటుంది. కానీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే సీన్ ఒక్కటీ కనిపించదు. అలాగే ఫ్యామిలీ అంతా సరదాగా గడిపే సీన్స్ కూడా ఏమీ కనిపించవు. అలా అనిపించే పాటలు కూడా పడలేదు. అందువలన ఒక సినిమాకి కావలసిన లక్షణాలు ఈ కథకి కరువయ్యాయనే భావన కలుగుతుంది. 

సంగీతం .. కెమెరా పనితనం .. ఎడిటింగ్ విషయానికొస్తే ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఒకరికొకరు అండగా నిలబడేలా చేసేది ఫ్యామిలీ. ఒకరి అభిప్రాయాలను .. ఆలోచనలను మిగతావారు అర్థం చేసుకోవాలనే కోణాన్ని కూడా ఈ కథలో చూపించారు. ఆ అంశం వరకూ ఆలోచింపజేస్తుంది. అయితే కథలో అది ఒక సమస్య .. కానీ సమస్యనే కథగా చూపిస్తే అది ఆడియన్స్ కి ఇబ్బందిని కలిగిస్తుంది. వినోదాన్ని విడిచిపెట్టిన కథలకు ఆదరణ దక్కిన సందర్భాలు చాలా తక్కువ.

Movie Details

Movie Name: Sarangadhariya

Release Date: 2024-08-31

Cast: Raja Ravindra ,Mohi Shm ,Mohit Pedada,Yashaswini,Shivakumar,Neela Priya

Director: Padmarao Abbishety

Producer: Umadevi -Sharath Chandra

Music: Ebenezer Paul

Banner: SaijaCreations

Review By: Peddinti

Sarangadhariya Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews