‘గర్ర్‌’ - (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • మలయాళంలో రూపొందిన ‘గర్ర్‌’ 
  • జూన్ 14న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • నిన్నటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
  • సింపుల్ కంటెంట్ తో రూపొందిన సర్వైవల్ కామెడీ డ్రామా 
  • వినోదం పాళ్లు పాలించిన కంటెంట్  

మలయాళం మేకర్స్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ ఉంటారు. సింపుల్ లైన్ తీసుకుని ప్రేక్షకులను అలరిస్తూ అంటారు. అలా వాళ్లు మరోసారి చేసిన ప్రయత్నంగా ‘గర్ర్‌’ సినిమా కనిపిస్తుంది. కుంచకో బోబన్ - సూరజ్ వెంజరమూడు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి జై దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది జూన్ 14వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీన నుంచి హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. 

రెజిమెన్ నాడర్ (కుంచకో బోబన్) రచన( అనఘ)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ అందుకు ఆమె తండ్రి నిరాకరిస్తాడు. ఆమె తండ్రి తిరువనంతపురంలో ఒక రాజకీయనాయకుడు. తన స్థాయికి తగిన సంబంధం చూడాలనే పట్టుదలతో ఆయన ఉంటాడు. అందువల్లనే రచనను ఒక గదికి పరిమితం చేసి, ఆమె దగ్గర మొబైల్ లేకుండా చేస్తాడు. ఆ బాధలో రెజిమెన్ మద్యానికి బానిస అవుతాడు. 

ఇక తిరువనంతపురం 'జూ'లో  హరిదాస్ నాయర్ (సూరజ్ వెంజరమూడు) సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన భార్య మృదుల నాయర్ (శృతి రామచంద్రన్). తాను కూడా ఏదైనా ఒక జాబ్ చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉంటుంది. అతణ్ణి వివాహం చేసుకోవడం వల్లనే తాను తన కలలను నిజం చేసుకోలేకపోయానని అతణ్ణి వేధిస్తూ ఉంటుంది. దాంతో అతను మానసికంగా కొంత దెబ్బతింటాడు. అందువలన అతను చేసే పొరపాట్ల వలన సస్పెన్షన్ కి గురయ్యే పరిస్థితి వస్తుంది. 

రెజిమెన్ తన స్నేహితుడైన అనస్ (రాజేశ్ మాధవన్)తో కలిసి కార్లో వెళుతూ, రచన గురించి అంతా చెబుతాడు. అప్పటికే అతను విపరీతంగా తాగేసి ఉంటాడు. పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో కారును 'జూ' వైపుకు తిప్పుతాడు అనస్. దాంతో రెజిమెన్ అతని కళ్లుగప్పి 'జూ'లో సింహం ఎన్ క్లోజర్ లోకి వెళతాడు. దాంతో అక్కడి వాళ్లంతా భయపడుతూ అరుస్తారు. 'జూ' సిబ్బంది అంతా అక్కడికి చేరుకుంటారు. 'రెజిమెన్' ను కాపాడటం కోసం సింహం జోన్ లోకి హరిదాస్ వస్తాడు.         

 రెజిమెన్ ను బయటికి తీసుకుని రావడానికి హరిదాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే విపరీతంగా తాగేసిన రెజిమెన్ మాత్రం అతనికి ఎంత మాత్రం సహకరించడు. ఇదిలా ఉండగా హరిదాస్ బావమరిది కోసం రచనను చూడటానికి వెళుతుంది మృదుల. ఆ పెళ్లి చూపుల కోసం రచనను గదిలో నుంచి బయటికి తీసుకువస్తారు. అప్పుడే ఆమె టీవీలో 'జూ'కి సంబంధించిన లైవ్ టెలీకాస్ట్ చూస్తుంది. వెంటనే మోపెడ్ పై అక్కడికి బయల్దేరుతుంది. అదే వార్తల్లో హరిదాస్ ప్రస్తావన ఉండటంతో మృదుల ఫ్యామిలీ కూడా అక్కడికి బయల్దేరుతుంది. 

జూ సిబ్బంది ఒక వైపున పోలీసులకు .. మరో వైపున అగ్నిమాపకదళానికి .. వెటర్నరీ డాక్టర్ కి సమాచారం అందిస్తారు. దాంతో వాళ్లంతా వెంటనే రంగంలోకి దిగుతారు. అప్పటికే తన గుహలో నుంచి బయటికి వచ్చిన సింహం, రెజిమెన్ - హరిదాస్ పై దాడి చేయడానికి రెడీ అవుతుంది. అప్పుడు హరిదాస్ ఏం చేస్తాడు? రెజిమెన్ ను అతను కాపాడగలుగుతాడా? రెజిమెన్ కోరుకున్నట్టుగా అతని వివాహం రచనతో జరుగుతుందా?  అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

'గర్ర్' అనేది సింహం యొక్క గర్జన అనుకోవాలి. గతంలో ఒక యువకుడు తాగిన మైకంలో సింహం ఎన్ క్లోజర్ లోకి దిగిన విషయం తెలిసిందే. ఆ సంఘటనను ప్రధానంగా తీసుకుని, ఆ అంశం చుట్టూ ఒక కామెడీ డ్రామాను అల్లుకుని తెరకెక్కించిన కథ ఇది. అలా సర్వైవల్ కామెడీ డ్రామా జోనర్లో ఈ కథ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ప్రధానమైన కథాంశంలోకి రెండు కుటుంబాలవారినీ .. రాజకీయనాయకులను .. పోలీసులను .. జూ సిబ్బందిని ఇన్వాల్వ్ చేసిన పద్ధతి బాగుంది. కథ అంతా కూడా మొదటి నుంచి చివరివరకూ కామెడీ టచ్ తోనే సాగుతూ ఉంటుంది. అలా అని చెప్పి పడి పడి నవ్వుకునేంత కంటెంట్ ఏమీ ఉండదు. ఏదో అలా సన్నివేశాలు నడిచిపోతూ ఉంటాయంతే. ఏ సీన్ కూడా మనసుకు పట్టుకోదు. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా మంచి క్రేజ్ ఉన్నవారే. వాళ్ల నటనకి కూడా వంకబెట్టలేం. కాకపోతే కథలోనే పెద్దగా బలం కనిపించదు. మిగతా మూడు వైపులా నుంచి కామెడీ నడిపిస్తూ .. సింహం ఎపిపోడ్ వరకూ కాస్త టెన్షన్ పెడితే బాగుండేది. కానీ ఆ ఎపిసోడ్ కి కూడా కామెడీ టచ్ ఇవ్వడం వలన, ఏమౌతుందో అనే ఒక ఆందోళన ఆడియన్స్ లో కనిపించదు. అందువలన కంటెంట్ తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. 

సాధారణంగా మలయాళ మేకర్స్ సింపుల్ కంటెంట్ తో ఆడియన్స్ ను కట్టిపడేస్తూ ఉంటారు. కామెడీ పరంగా .. ఎమోషన్స్ పరంగా మెప్పిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో ఆ మేజిక్ మిస్సయినట్టు కనిపిస్తోంది. చేయడానికి ఏమీ లేక కథను 'లైన్ ఎన్ క్లోజర్'లో తిప్పినట్టుగా అనిపిస్తుంది. జయేశ్ నాయర్ కెమెరా పనితనం .. డాన్ విన్సెంట్ నేపథ్య సంగీతం .. వివేక్ హర్షన్ ఎడిటింగ్ ఫరవాలేదు. సింపుల్ లైన్ ను లాగదీయడం వలన .. వినోదం పాళ్లు లోపించడం వలన బోరింగ్ గా అనిపించే కంటెంట్ ఇది. 

Movie Details

Movie Name: Grrr

Release Date: 2024-08-20

Cast: Kunchacko Boban, Suraj Venjaramoodu ,Shruti Ramachandran, Anagha, Rajesh Madhavan

Director: Jay K

Producer: Shaji Nadesan - Arya

Music: Dawn Vincent

Banner: August Cinema

Review By: Peddinti

Grrr Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews