'బృంద' (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • త్రిష ప్రధాన పాత్రగా రూపొందిన 'బృంద'
  • బలమైన కథ - ఆసక్తికరమైన కథనం 
  • ఉత్కంఠను పెంచే సన్నివేశాలు 
  • ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన త్రిష 
  • హైలైట్ గా నిలిచే క్లైమాక్స్

సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష ఇంకా దూసుకుపోతూనే ఉంది. ప్రస్తుతం ఆమె భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయినప్పటికీ 'బృంద' అనే తెలుగు వెబ్ సిరీస్ చేసింది. తెలుగులో ఇది ఆమెకి ఫస్టు వెబ్ సిరీస్. ఈ రోజు నుంచే ఈ సిరీస్ 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

అది ఫారెస్టును ఆనుకుని ఉన్న 'గంగవరం' గ్రామం ..1992వ సంవత్సరం. గిరిజనులు ఎక్కువగా నివసించే ఆ గూడెంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ఆగ్రహం అందుకు కారణమని భావించిన కొంతమంది, మరుసటి రోజు 'బలి' ఇవ్వడానికి ఒక పాపను ఎంపిక చేస్తారు. అయితే అది ఇష్టం లేని ఆ పాప తల్లి ఆ ఊరు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. పాపను ఒక లారీలోకి ఎక్కిస్తుంది .. కానీ తాను ఎక్కలేకపోతుంది. గూడెం ప్రజల చేతిలో ఆమె చనిపోతుంది. 

ఆ సమయంలో దారితప్పిన ఆ పాప అన్నయ్య సత్య, తన తల్లితో బాటు తన చెల్లి కూడా చనిపోయిందని భావిస్తాడు .. ఆ రాత్రే ఆ గ్రామాన్ని తగులబెడతాడు. ఫలితంగా బాల నేరస్థుడిగా జువైనల్ హోమ్ కి వెళతాడు. ఇక కథ ఈ కాలంలోకి వస్తుంది. గంగవరంలో లారీ ఎక్కిన పాప, పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రఘురామకృష్ణ ( జయప్రకాశ్) దృష్టిలో పడుతుంది. హైదరాబాద్ కి చెందిన అతను, ఆ పాపను తన ఇంటికి తీసుకుని వెళతాడు. తన భార్య వసుంధర (ఆమని)ని ఒప్పిస్తాడు. 

అలా ఆయన దగ్గర పెరిగిన 'బృంద' .. పోలీస్ ఆఫీసర్ గా హైదరాబాద్ లోనే పోస్టింగ్ తీసుకుంటుంది. పై అధికారి సాల్మన్ .. తోటి ఆఫీసర్ సారథి (రవీంద్ర విజయ్) ఆమెను పెద్దగా పట్టించుకోరు. సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడు తాను చంపాలనుకున్నవారికి ముందుగా గుండు చేస్తూ ఉంటాడు. ఒకే చోట ఎక్కువసార్లు పొడుస్తూ ఉంటాడు. హత్య చేసిన ప్రదేశానికి దగ్గరలోని చెరువుల్లో శవాలను పడేస్తూ ఉంటాడు. 

రైల్వే ఉద్యోగి తిలక్ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగిన బృంద, పై విషయాలను పసిగడుతుంది. చనిపోయిన వారెవరూ అంతకుముందు హంతకుడికి ఎలాంటి ద్రోహం చేయలేదు. కులమతాలతో సంబంధం లేకుండా, ఎవరైతే దేవుడిని నమ్ముతూ ఉంటారో, వాళ్లను మాత్రమే హంతకుడు చంపుతున్నాడనే విషయాన్ని బృంద అర్థం చేసుకుంటుంది. దైవాన్ని అంతగా ద్వేషించే హంతకుడు ఎవరా అని ఆలోచనలో పడుతుంది.    
         
ఆ కేసును పట్టుదలతో ఆమె మరింత ముందుకు తీసుకుని వెళుతుంది. అప్పుడు ఆమె ముందుకు ఠాకూర్ .. ఆనంద్ అనే రెండు పేర్లు వస్తాయి. వాళ్లిద్దరూ ఎవరు? ఈ హత్యలతో నిజంగానే వాళ్లకి సంబంధం ఉంటుందా? తన పరిశోధనలో బృందకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె అన్నయ్య సత్య ఏమౌతాడు? అనేది మిగతా కథ.

బృంద అనే ఒక యువతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ఈ కథ. ఒక బలమైన సంఘటన మనుషులను ఎంత రాక్షసంగా మార్చేస్తుంది? ఒక తప్పుడు ఆలోచన ఎంతటి ప్రమాదకరమైన మనుషులను తయారు చేస్తుంది? అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఈ కథ నడుస్తుంది. కథ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ ఎక్కడా బోర్ అనిపించకుండా ఆసక్తికరంగా ముందుకు వెళుతుంది. 

ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి .. అవి బలంగా కనెక్టు అవుతాయి. దర్శకుడు ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. ఎక్కడా తడబడకుండా వాటిని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి వెన్నెముకగా నిలిచిందని చెప్పాలి.   ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడానికి అవసరమైన ఆధారాలు సేకరించే తీరు ..   ఒక సినిమా స్థాయిలో ప్లాన్ చేసిన క్లైమాక్స్ .. ఆడియన్స్ నుంచి మంచి మార్కులనే తెచ్చుకుంటాయి.     

త్రిష నటన ఈ సిరీస్ కి హైలైట్. పోలీస్ ఆఫీసర్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ తో పాటు, మిగతా ఆర్టిస్టులంతా చాలా సహజంగా తమ పాత్రలను పండించారు. శక్తికాంత్ కార్తీక్ అందించిన నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచింది. కథలో నుంచి ఆడియన్స్ బయటికి రాకుండా కాపాడుతూ వెళ్లింది. దినేశ్ కె బాబు కెమెరా పనితనం .. అన్వర్ అలీ ఎడిటింగ్ ఈ సిరీస్ కి హెల్ప్ అయ్యాయి.

భయంకరమైన స్థితిలో ఉన్న డెడ్ బాడీని పదే పదే క్లోజప్ షాట్ లో చూపించడం, అక్కడక్కడా రక్తాన్ని ఎక్కువగా చూపించడం ఇబ్బందిని కలిగిస్తుంది. అవి తప్పించి ఎలాంటి అభ్యంతరకరమైన డైలాగ్స్ గానీ సన్నివేశాలు గాని లేవు. మంచి నిర్మాణ విలువల కారణంగా .. త్రిష కనిపిస్తూ ఉండటం వలన మనకి ఒక సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. 

Movie Details

Movie Name: Brinda

Release Date: 2024-08-02

Cast: Trisha Krishnan, Indrajith Sukumaran, Jaya Prakash, Aamani, Ravindra Vijay, Anand Sami

Director: Surya Manoj Vangala

Producer: Kolla Ashish

Music: Shakti Kanth Karthik

Banner: Adding Advertising

Review By: Peddinti

Brinda Rating: 3.50 out of 5

Trailer

More Movie Reviews