'పారిజాత పర్వం' (ఆహా) మూవీ రివ్యూ!

  • చైతన్యరావు హీరోగా 'పారిజాత పర్వం' 
  • ఏప్రిల్ 19న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ 
  • పేలవమైన కథ - నీరసంగా సాగే కథనం 
  • ఏ మాత్రం ఆకట్టుకోని కంటెంట్

చైతన్యరావు కథానాయకుడిగా ఈ మధ్య కాలంలో థియేటర్లకు వచ్చిన సినిమాలలో, 'పారిజాత పర్వం' ఒకటి. ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. మాళవిక సతీషన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సునీల్ .. శ్రద్ధా దాస్ .. శ్రీకాంత్ అయ్యంగార్ .. సురేఖా వాణి .. వైవా హర్ష ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ రోజు నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందిన ఈ  సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

చందూ (చైతన్యరావు)కి  సినిమా దర్శకుడు కావాలనే ఒక కోరిక బలంగా ఉంటుంది. ఆ సినిమాలో తన స్నేహతుడైన హర్ష (వైవా హర్ష)ను హీరోగా పరిచయం చేయాలనే మంచి మనసు ఉంటుంది. అందుకోసం ఒక కథను రాసుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తనని హీరోగా పెడతానంటే ఏ నిర్మాతలూ ముందుకు రారనీ, అందువలన వేరే హీరోతో చేయమని హర్ష చెబుతున్నా అతను పట్టించుకోడు.

చందూ - హర్ష ఇద్దరూ ఒక రూములో అద్దెకి ఉంటూ ఉంటారు. ఆ ఇంటి ఓనరు కూతురు ( మాళవిక సతీషన్) చందూను ప్రేమిస్తూ ఉంటుంది. వాళ్ల పెళ్లికి ఆమె తండ్రి అంగీకరిస్తాడు కూడా. అయితే తాను సినిమా తీసిన తరువాతనే పెళ్లి చేసుకుంటానని చందూ తేల్చి చెబుతాడు. కాకపోతే ఆ రోజు నుంచి వాళ్లకి రెంట్ బాధలు ఉండవు. అతను సినిమా చేయడానికి తన వంతు సాయం చేయాలని ఆమె నిర్ణయించుకుంటుంది.    
 
ఇక మరో వైపున శ్రీను (సునీల్)కి సినిమాల్లో నటించాలనే కోరిక ఉంటుంది. అందువలన అతను సినిమా ఆఫీసుల చుట్టూ .. స్టూడియోల చుట్టూ అదే పనిగా తిరుగుతూ ఉంటాడు. 'ఓంకార్ బార్'కి సినిమా వాళ్లు చాలా మంది వస్తూ ఉంటారనీ .. వాళ్లతో పరిచయం పెంచుకుంటే అవకాశాలు వస్తాయనే ఒక సలహా అతని చెవిన పడుతుంది. దాంతో ఆ బార్ యజమాని శంకర్ ను బ్రతిమాలుకుని మరీ వెయిటర్ గా పనిలో చేరతాడు.      

శంకర్ బార్ నడుపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. కానీ దాని వెనుక పెద్ద దందా నిర్వహిస్తూ ఉంటాడు. ఆ బార్ లో పారిజాతం (శ్రద్ధా దాస్) అందాల ప్రదర్శనతో కూడిన డాన్స్ లు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అక్కడే శ్రీనుకి ఆమె పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమె విషయంలోనే శ్రీను తన యజమానితో గొడవపడి అతణ్ణి చంపేస్తాడు. అప్పటి నుంచి గ్యాంగ్ స్టర్ గా కొనసాగుతూ ఉంటాడు. 

తన స్నేహితుడైన హర్షను హీరోగా పెట్టి సినిమా తీయడానికి అవసరమైన డబ్బును పోగు చేయాలంటే ఏం చేయాలా అని చందూ భావిస్తాడు. తనకి సినిమా ఛాన్స్ ఇవ్వని నిర్మాత శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) భార్యను కిడ్నాప్ చేసి, అతని నుంచి భారీ మొత్తం వసూలు చేయాలని ప్లాన్ చేస్తాడు. శ్రీను గ్యాంగ్ కూడా డబ్బుకోసం ఆమెనే కిడ్నాప్ చేయాలని డిసైడ్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది మిగతా కథ. 

ఈ కథలో శ్రద్ధా దాస్ పేరు 'పారిజాతం' .. అందువలన ఈ సినిమాకి ఈ పేరు పెట్టారు. ఈ కథలో మొత్తం మూడు అంశాలు ఉన్నాయి. సినిమా తీయాలనే హీరో కోరిక .. అందుకు అవసరమైన డబ్బు కోసం ఓ నిర్మాత భార్యను కిడ్నాప్ చేయడం .. ఆ కిడ్నాప్ డ్రామా విషయంలో శ్రీను పోటీ రావడం. ఈ మూడు అంశాలు కూడా కామెడీతో ముడిపడినవే. అయితే ఏ అంశంలోను కొత్తదనం కనిపించదు. ఏం జరుగుతుందా? అనే ఆసక్తి ఎంతమాత్రం తలెత్తదు. 

ఈ సినిమాలో ఉన్న కథను అలా సాదాసీదాగా చెప్పుకుంటూ వెళ్లారు. ఎక్కడ ఎలాంటి మలుపులు .. ట్విస్టులు ఉండవు. స్క్రీన్ ప్లేతో మేజిక్ చేశారనే సందర్భం ఒక్కటి కూడా తగలదు. మనం సినిమా థియేటర్లో కూర్చున్నామా? లేదంటే డ్రామా నడుస్తున్న స్టేజ్ కి ఎదురుగా కూర్చున్నామా? అనే భావన కలుగుతుంది. అందుకు కారణం దర్శకుడి అనుభవలేమి అనే చెప్పుకోవాలి.

ఈ సినిమాకి పెద్ద మైనస్ 'రీ' అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. తెరపై సందర్భం .. సన్నివేశం ఏదైనా కావొచ్చు. తనకి తోచిన సంగీతాన్ని అందిస్తూ వెళ్లాడు. బాలసరస్వతి కెమెరా పనితనం .. శశాంక్ ఉప్పుటూరి ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.  ఆర్టిస్టులు ఎలా చేశారు అంటే, అక్కడ చేయడానికేమైనా ఉంటేగా? అనిపిస్తుంది. సినిమాలో ఏ అంశాన్ని తీసుకున్నా, ఏ సందర్భాన్ని చూసుకున్నా అది పేలవంగా .. సిల్లీ కామెడీగానే కనిపిస్తుంది. 

ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి ఒక సినిమాకి ఫలానా లక్షణాలు ఉండాలి అనుకుంటే, ఆ లక్షణాలు ఎక్కడా కనిపించని కంటెంట్ గా ఈ సినిమా నిలుస్తుంది. కసరత్తు చేయని కథగా ప్రేక్షకులను విసిగిస్తుంది. అసలు సునీల్ ఎలా ఒప్పుకున్నాడు? చైతన్యరావు ఎందుకు ఇలాంటి కంటెంట్ కి ఓకే చెబుతున్నాడు? అనే విషయాన్ని గురించి ఆలోచన చేయనివారు తక్కువగానే ఉంటారని చెప్పాలి. 

Movie Details

Movie Name: Parijatha Parvam

Release Date: 2024-06-12

Cast: Chaitanya Rao, MalavikaSateeshan, Sharddha Das, Viva Harsha, Srikanth Ayyamgar, Surekha Vani

Director: Santosh Kambhampati

Producer: Mahindar Reddy

Music: Ree

Banner: Vanamali Creations

Review By: Peddinti

Parijatha Parvam Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews