'లవ్ గురు' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన 'లవ్ గురు'
  • ఏప్రిల్ 11న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • రీసెంటుగా అందుబాటులోకి వచ్చిన కంటెంట్ 
  • విజయ్ ఆంటోని కామెడీ .. సినిమా నేపథ్యం మైనస్ 
  • చివర్లో మెప్పించే ట్విస్ట్

విజయ్ ఆంటోనికి తమిళంలో మాత్రమే కాదు, తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. ఆయన ప్రతి సినిమా, తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతూ ఉంటుంది. అలాగే తమిళంలో ఆయన చేసిన 'రోమియో' అక్కడ ఏప్రిల్ 11వ తేదీన విడుదలైంది. అదే రోజున ఈ సినిమాను 'లవగురు' పేరుతో మైత్రీ మూవీస్ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలాంటి సినిమా ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అరవింద్ (విజయ్ ఆంటోని) మలేసియాలో ఒక కేఫ్ నడుపుతూ ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది అతని ఆశ. కానీ కొన్ని బాధ్యతల కారణంగా అతను ప్రేమ .. పెళ్లి అనే వాటిని గురించి ఆలోచన చేయలేకపోతాడు. అప్పటికే అతనికి 35 ఏళ్లు వచ్చేస్తాయి. దాంతో అతను ఒంటరిగానే కాలం గడుపుతూ ఉంటాడు. అరవింద్ చెల్లెలు జనని చిన్నతనంలో అతనికి దూరమవుతుంది. అందుకు సంబంధించిన సంఘటన తరచూ అతని కళ్లలో కదులుతూ స్థిమితం లేకుండా చేస్తుంటుంది. 

అరవింద్ మలేసియా నుంచి బయల్దేరి తన సొంత ఊరుకి చేరుకుంటాడు. అదే సమయానికి .. అదే ఊరుకి లీల ( మృణాళిని రవి) చేరుకుంటుంది. హైదరాబాదులో ఆమె కొన్ని యాడ్స్ లో నటిస్తూ ఉంటుంది. హీరోయిన్ కావాలనేది ఆమె కల. ఆమెతో పాటు మరో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి, ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. అయితే లీల తండ్రికి ఆమె సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం ఉండదు. సాధ్యమైనంత త్వరగా ఆమె పెళ్లి జరిపించాలని చూస్తుంటాడు.  

అనుకోకుండా ఆమెను చూసిన అరవింద్ .. మనసు పారేసుకుంటాడు. అతను లీలను ఇష్టపడుతున్నాడని గ్రహించిన తల్లిదండ్రులు, ఆమె తండ్రిని సంప్రదిస్తారు. లీల అభిప్రాయంతో పనిలేకుండా ఆయన అరవింద్ తో ఆమె పెళ్లి జరిపిస్తాడు. తండ్రి మాట కాదనలేక అరవింద్ ను పెళ్లి చేసుకున్న లీల, హైదరాబాదులో వేరు కాపురం పెడుతుంది. తనకి హీరోయిన్ కావాలని ఉందనీ, తనతో ఉండటం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోమని అరవింద్ తో తేల్చి చెబుతుంది. 

ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అరవింద్, తన పట్ల ఆమెకి ఎంత మాత్రం ప్రేమలేదని తెలుసుకుని బాధపడిపోతాడు. తనకి దూరంగా ఉంటున్న లీల, డీలాపడిపోకూడదనే ఉద్దేశంతో, విక్రమ్ అనే అభిమాని పేరుతో వాయిస్ మార్చి ఆమెకి కాల్స్ చేస్తూ ఉంటాడు. అప్పటి నుంచి ఆమెలో ఉత్సాహం మొదలవుతుంది. హీరోయిన్ గా తెరపై చూసుకోవాలనే ఆమె కలను అరవింద్ నిజం చేయాలనుకుంటాడు. అందుకోసం నిర్మాతగా మారతాడు. 

అరవింద్ తీసుకున్న అతని నిర్ణయం పట్ల లీల టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. తన భార్య జోడిగా తానే నటిస్తానని అతను షరతు పెడతాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లీల టీమ్ ఒప్పుకుంటుంది. తన భార్యను విక్రమ్ పేరుతో ప్రోత్సహించాలనుకున్న అరవింద్, ఆమె మనసులో విక్రమ్ కి మాత్రమే స్థానం ఉందని గ్రహిస్తాడు. ఇక విక్రమ్ పాత్రను పక్కకి తప్పించాలని భావిస్తాడు. 

 అయితే విక్రమ్ అనే పాత్ర లేకపోతే లీల తట్టుకోలేదనే విషయం అతనికి అర్థమైపోతుంది. అదే సమయంలో విక్రమ్ ను నేరుగా చూడాలని లీల నిర్ణయించుకుంటుంది. తనని ఎక్కడ ఎప్పుడు కలుసుకోవాలనే విషయం చెబుతుంది. అప్పుడు అనిరుధ్ ఏం చేస్తాడు? అతనే విక్రమ్ అనే సంగతి ఆమె పసిగడుతుందా? చెల్లెలితో కూడిన అతని గతం ఎలాంటిది? లీల కోరిక నెరవేరుతుందా? అరవింద్ ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.   

ఈ సినిమాకి రచయితగా .. దర్శకుడిగా వినాయక్ వైద్యనాథన్ పనిచేశాడు. జీవితం పట్ల ఆశలు ..  ఊహలు ఎక్కువైన యువతి, భర్తను దూరం పెడుతుంది. విడాకులకు సైతం సిద్ధపడుతుంది. ఆమె మనసులో స్థానం సంపాదించుకుని, తనతో కలిసి ఉండేలా చేయడానికి ఆ భర్త చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ మధ్యలో జరిగే డ్రామా కామెడీ టచ్ తో ముందుకు వెళుతుంది.

ఫారుక్ భాష ఫొటోగ్రఫీ .. భరత్ ధన శేఖర్ సంగీతం .. విజయ్ ఆంటోని సంగీతం ఫరవాలేదు. విజయ్ ఆంటోని ఇంతవరకూ సీరియస్ పాత్రలనే చేస్తూ వచ్చాడు. ఆ తరహా పాత్రలే ఆయన బాడీ  లాంగ్వేజ్ కి సెట్ అవుతాయి కూడా. ఈ సినిమాలో ఆయన కాస్త కామెడీ చేయడానికి ట్రై చేశాడుగానీ అది ఆయనకి నప్పలేదు. మొదటి నుంచి చివరివరకూ హీరోపై హీరోయిన్ రుసరుసలే కావడంతో ఎక్కడా రొమాంటిక్ టచ్ కనిపించదు. చివర్లోని ట్విస్ట్ బాగానే ఉంది. కాకపోతే అక్కడివరకూ కథను నడిపించిన తీరు అంత ఆసక్తికరంగా అనిపించదు.

Movie Details

Movie Name: Love Guru

Release Date: 2024-05-17

Cast: Vijay Antony, Mrinalini Ravi, Yogibabu, Vtv Ganesh, Sudha, Ilavarasu, Thalaivasalan Vijay

Director: Vinayak Vaidyanathan

Producer: Vijay Antony

Music: Bharath Dhana Sekhar

Banner: Vijay Antony Flim Corporation

Review By: Peddinti

Love Guru Rating: 2.50 out of 5


More Movie Reviews