'మీకు మాత్రమే చెప్తా' మూవీ రివ్యూ

తనకి కాబోయే భర్త నిజాయితీ పరుడై, ఎలాంటి వ్యసనాలు లేనివాడై వుండాలని కోరుకునే యువతి ఒక వైపు, తన గురించిన ఒక విషయం ఆమెకి తెలిస్తే తమ పెళ్లి ఆగిపోతుందనే ఉద్దేశంతో ఒక యువకుడు పడే పాట్లు మరో వైపు. కథ అంతా కూడా ఈ అంశం చుట్టూనే తిరుగుతుంది. అక్కడక్కడా మాత్రమే నవ్వించే ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
'పెళ్లి చూపులు' సినిమాతో విజయ్ దేవరకొండను హీరోగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన దర్శకుడు తరుణ్ భాస్కర్. అలాంటి దర్శకుడిని హీరోగా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ తొలిసారిగా ఈ సినిమాను నిర్మించాడు. తనని హీరోగా నిలబెట్టిన దర్శకుడిని హీరోగా మార్చడం ఇక్కడ విశేషం. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.    

ఒక టీవీ ఛానల్లో యాంకర్ గా చేసే రాకేశ్ (తరుణ్ భాస్కర్), లేడీ డాక్టర్ స్టెఫీ (వాణి భోజన్) ప్రేమలో పడతాడు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. రాకేశ్ చీటికీమాటికి అబద్ధాలు ఆడతాడనీ, తాగుడు అలవాటు కూడా ఉందని తెలుసుకున్న స్టెఫీ, వాటిని మానేస్తేనే తమపెళ్లి జరుగుతుందని చెబుతుంది. అంతేకాదు తమ మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదనీ, అలాంటివేమైనా వుంటే పెళ్లికి ముందే చెప్పేయమని అంటుంది. ఏమీ లేవంటూ ఆమెను పెళ్లికి ఒప్పిస్తాడు రాకేశ్. అయితే అప్పటికే అతనికి సంబంధించిన సీక్రెట్ వీడియో ఒకటి బయటికి వస్తుంది. ఆ వీడియో స్టెఫీ  కంటపడకుండా ఉండటం కోసం రాకేశ్ తన స్నేహితుడైన కామేశ్ (అభినవ్) సాయం తీసుకుంటాడు. ఇక స్టెఫీని ప్రేమించిన ఆమె బంధువర్గానికి చెందిన జాన్సన్, ఆమె దృష్టిలో రాకేశ్ ను బ్యాడ్ చేసి వాళ్ల పెళ్లిని చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటాడు. అతని ప్రయత్నం ఫలిస్తుందా? స్టెఫీతో రాకేశ్ పెళ్లి జరుగుతుందా? అనే ఆసక్తికరమైన మలుపులతో మిగతా కథ నడుస్తుంది.

సాధారణంగా ఇతరులకి సంబంధించిన రహస్యాన్ని సన్నిహితులతో చెబుతూ, 'మీకు మాత్రమే చెబుతున్నాను .. మీరు మాత్రం ఎవరితో చెప్పకండేం' అంటూ ఉండటం జరుగుతుంటుంది. అలాంటి సంభాషణతోనే ఈ కథ మొదలవుతుంది గనుక, ఈ కథకి టైటిల్ కరెక్ట్ గా సరిపోయింది. దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఒక చిన్న పాయింట్ తీసుకుని, దాని చుట్టూ కథ అల్లుకున్నాడు. సింపుల్ స్టోరీని వినోదభరితంగా మలిచే ప్రయత్నం చేశాడు. కానీ ఆ విషయంలో ఆయన సక్సెస్ కాలేకపోయాడు.

కథలో వైవిధ్యం లేకపోవడం వలన .. కథనాన్ని పట్టుగా నడిపించకపోవడం వలన .. సంభాషణల్లో ఎలాంటి ఛమక్కులు లేకపోవడం వలన ప్రేక్షకులు ఆశించే వినోదం లభించదు. తరుణ్ భాస్కర్ .. అనసూయ మినహా మిగతా ముఖాలన్నీ కొత్తవే కావడం .. వాటికీ పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం మరికాస్త నిరాశకి గురిచేసే అంశాలు. చివర్లో పెట్టిన చిన్న మెలిక మాత్రం నవ్వు ముఖం పెట్టుకునేలా చేస్తుంది. శివకుమార్ అందించిన నేపథ్య సంగీతం .. గుణదేవ ఫొటోగ్రఫీ .. శ్రీజిత్ ఎడిటింగ్ ఫరవాలేదు. విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి, నిర్మాణ పరమైన విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉండటం అసంతృప్తిని కలిగించే విషయం.

నటీనటుల విషయానికొస్తే, తను ఇష్టపడిన అమ్మాయి తనని అపార్థం చేసుకుంటుందేమోనని టెన్షన్ పడే రాకేశ్ పాత్రలో తరుణ్ భాస్కర్ బాగానే నటించాడు. ఇక తరుణ్ భాస్కర్ స్నేహితుడి పాత్రలో అక్కడక్కడా పంచ్ లు వేస్తూ అభినవ్ తన పాత్రకి న్యాయం చేశాడు. తన పాత్ర నిడివి తక్కువే అయినా అనసూయ ఆకట్టుకుంది. కాకపోతే ఆమెను అంత అందంగా చూపించలేకపోయారు. వాణి భోజన్ .. పావని గంగిరెడ్డి అందంగా కనిపించడం తప్ప, పాత్ర పరంగా అక్కడ చేయడానికి ఏమీలేదు. రవివర్మ మాత్రం పాత్ర పరిథిలో మెప్పించాడు.

ఇది హీరో హీరోయిన్ల మధ్య .. మాటల్లో చెప్పుకోలేని భావాలను పాటల్లో పంచుకునే కథ కాదు. ఫైట్లతో ప్రతినాయకుడిని ఎదిరించే కథ కూడా కాదు. కథలో పాత్రలన్నీ ప్రధాన భాగమై కామెడీతో మాత్రమే నడిచే కథ. అలాంటి కామెడీకి అవకాశం కల్పించే సన్నివేశాలుగాని, అలాంటి సన్నివేశాలకు ఊతాన్నిచ్చే సంభాషణలుగాని .. ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే మలుపులుగానీ లేని కారణంగా ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుంది .. విజయ్ దేవరకొండ అండ్ టీమ్ సరదాగా చేసిన చిన్న ప్రయోగం అనిపిస్తుంది.        

Movie Details

Movie Name: Meeku Mathrame Chepta

Release Date:

Cast: Tharun Bhascker, Vani Bhojan, Anasuya, Abhinav, Pavani

Director: Shammer Sultan 

Producer: Vijay Devarakonda 

Music: Shiva Kumar 

Banner: King Of The Hill   

Meeku Mathrame Chepta Rating: 2.00 out of 5


More Movie Reviews