'అసురగురు' (ఆహా) మూవీ రివ్యూ!

  • విక్రమ్ ప్రభు హీరోగా 'అసురగురు'
  •  తెలుగులో అందుబాటులోకి వచ్చిన సినిమా
  • నిన్నటి నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • అంతగా ఆకట్టుకోని సినిమా  

మొదటి నుంచి కూడా విక్రమ్ ప్రభు తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా తమిళంలో ఆయన చేసిన సినిమానే 'అసురుగురు'. సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి రాజ్ దీప్ దర్శకత్వం వహించాడు. 2020 మార్చి 13వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. మహిమ నంబియార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 3వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ కథ, ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

 శక్తి (విక్రమ్ ప్రభు) భారీ మొత్తంలో డబ్బు కాజేస్తూ ఉంటాడు. ఒక పథకం ప్రకారం డబ్బు దొంగిలించి ఆ మొత్తాన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచేస్తూ ఉంటాడు. రిజర్వ్ బ్యాంకుకి చెందిన డబ్బును ట్రైన్ లో నుంచే మాయం చేస్తాడు. జమాలుద్దీన్ (నాగినీడు)అనే లోకల్ లీడర్ కి సంబంధించిన డబ్బు కూడా దొంగిలిస్తాడు. దాంతో శక్తిని పట్టుకోవడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా మాణిక్యం ( సుబ్బరాజు) నియమించబడతాడు. 

ఇక తన డబ్బును తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని జమాలుద్దీన్ ఆశ్రయిస్తాడు. ఆ ఏజెన్సీ నడుపుతున్న కార్తికేయ, ఆ కేసును దియా ( మహిమా నంబియార్) కి అప్పగిస్తాడు. దాంతో ఆమె తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. వాళ్లిద్దరూ చెరొక వైపు నుంచి శక్తిని గురించి గాలిస్తూ ఉండగానే, అతను ఒక బ్యాంకులోను .. నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి చేస్తున్న ప్రదేశం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేస్తాడు. దాంతో ఆ ఇద్దరూ కూడా మరింత పట్టుదలతో ముందుకు వెళ్లడం మొదలుపెడతారు. 

శక్తి కేవలం కరెన్సీ నోట్లను మాత్రమే కాజేయడం .. ఆ పక్కనే అంతకంటే విలువైన వస్తువులు ఉన్నప్పటికీ వాటిని తాకకపోవడం  దియాకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కేవలం నగదును మాత్రమే అతను దొంగిలించడానికి కారణం ఏమిటనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నాలు మొదలెడుతుంది. శక్తిని గురించి ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అతను దొంగతనాలు చేయడానికి కారణం ఏమిటి? అది తెలుసుకున్న ఆమె ఏం చేస్తుంది?  అనేది కథ.

దర్శకుడు రాజ్ దీప్ ఈ కథను తెరపై ఆవిష్కరించాడు. దొంగతనాలు చేసే ఒక హీరో .. అతణ్ణి పట్టుకోవడానికి రంగంలోకి దిగిన ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ .. ఒక లేడీ డిటెక్టివ్ .. ఈ ముగ్గురి చుట్టూనే కథ నడుస్తూ ఉంటుంది. హీరో దొంగతనాలు చేసే సన్నివేశాలు ఈ కథలో ప్రధానం కనుక, ఆ దృశ్యాలను ఆసక్తికరంగా ఆవిష్కరించారు. అయితే ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు .. యోగిబాబు వైపు నుంచి నడిపించే కామెడీ అంత ఆసక్తికరంగా అనిపించవు.

చివరలో చకచకా పరిస్థితులు మారిపోతాయి. కథ మొత్తానికి కలిపి ఒక ట్విస్ట్ ఉంటుంది. అయితే ఆ ట్విస్ట్ ఉంటుంది గదా అని చివరివరకూ ఫాలో కావడం కష్టమే. సన్నివేశాలు ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పోతూ ఉంటాయి. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ మాత్రం ఉండదు. ఆడియన్స్ ఊహించినదానికి భిన్నంగా ఏమీ జరగదు. సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం .. రామలింగం ఫొటోగ్రఫీ .. లారెన్స్ కిశోర్ ఫొటోగ్రఫీ కథకి తగినట్టుగానే ఉన్నాయి.  ఎలాంటి అనూహ్యమైన .. ఆసక్తికరమైన మలుపులు లేని ఒక సాదాసీదా కథ ఇది. 


Movie Details

Movie Name: Asuraguru

Release Date: 2024-05-03

Cast: Vikram Prabhu, Mahima Nambiar, Subbaraju, Jagan, Yogi Babu, Nagineedu

Director: Raajdheep

Producer: JSB Sathish

Music: Simon K King

Banner: JSB Film Studios

Review By: Peddinti

Asuraguru Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews