'సుందరం మాస్టర్' (ఆహా) మూవీ రివ్యూ!

  • వైవా హర్ష హీరోగా రూపొందిన 'సుందరం మాస్టర్'
  • అడవి నేపథ్యంలో సాగే కథ 
  • ఆసక్తికరంగా అనిపించని స్క్రీన్ ప్లే 
  • పేలని కామెడీ - పేలవమైన సన్నివేశాలు 
  • సందేశం దిశగా పరిగెత్తలేకపోయిన వినోదం     
   

అమాయకులైన గిరిజనులు .. వాళ్లకంటూ కొన్ని బలమైన విశ్వాసాలు .. ఆధునిక నాగరికతతో సంబంధం లేని జీవితాలు .. వంకరగా ఆలోచించడం తెలియనివాళ్లు. ఇలాంటివారిని మోసం చేయడానికి ఏసీ గదుల్లో కూర్చుని తీరుబడిగా ప్లాన్ చేసేవారు చాలామంది ఉంటారు. మరికొంతమంది అమాయకులను ఇలాంటి పనులకు పావుగా వాడుకుంటూ ఉంటారు. అలాంటి ఒక కంటెంట్ తో రూపొందిన సినిమానే 'సుందరం మాస్టర్'. ఈ నెల 28 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 

సుందర్రావు (వైవా హర్ష) ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉంటాడు. కాస్త అమాయకత్వం .. ఇంకాస్త మంచితనం కలిసిన మనిషి. వయసు పెరిగిపోతోంది .. పెళ్లి చేసుకోరా అని పెద్దవాళ్లు పోరుతుంటే, కట్నం ఎక్కువిచ్చే సంబంధాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. డీఈఓ కావాలనే ఒక కల .. అదే జరిగితే కోటి రూపాయల వరకూ కట్నం రాకుండా పోతుందా అనే ఒక ఆశ అతన్ని బ్రతికిస్తూ ఉంటుంది.

మన బలహీనత ఎదుటివారికి ఎక్కువగా ఉపయోగపడుతుందన్నట్టుగా, అక్కడి ఎమ్మెల్యే (హర్షవర్ధన్)  సుందరం అమాయకత్వాన్ని గ్రహిస్తాడు. ఆ అడవిలోని గిరిజనులు పూజించే అమ్మవారి విగ్రహం సామాన్యమైనది కాదని తెలుసుకుని, వాళ్లను మాయచేసి అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తన దగ్గరికి చేర్చే బాధ్యతను సుందరానికి అప్పగిస్తాడు. అనధికారికంగా సుందరాన్ని అక్కడికి పంపిస్తాడు. ఈ పని పూర్తిచేస్తే సుందరాన్ని 'డీఈఓ' చేస్తానని మాట ఇవ్వడం వల్లనే అతను ఉత్సాహం చూపుతాడు. 

నిజానికి సుందరం చెప్పే సబ్జెక్ట్ సోషల్ .. అతనికి ఇంగ్లిష్ అంతగా రాదు. అక్కడ గిరిజనులకు అతను బోధించవలసింది ఇంగ్లిష్. అయినా డీఈఓ కావాలనే కలను నిజం చేసుకోవడానికి అతను 'మిరియాల మిట్ట' అనే గిరిజన గూడానికి చేరుకుంటాడు. అక్కడే అతనికి మైనా (దివ్య శ్రీపాద) పరిచయమవుతుంది. ఆమె మాట పట్ల ఆ గూడెంలోని వారికి బలమైన నమ్మకం ఉండటం అతను గమనిస్తాడు. తనకంటే వాళ్లకే ఎక్కువ ఇంగ్లిష్ వచ్చని గ్రహించిన సుందరం కొంత ఇబ్బంది పడతాడు. 

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం కూడా తెలియని గిరిజనులు వాళ్లు. బయట ప్రపంచంతో సంబంధాలు తెంపేసుకోవడమే అందుకు కారణం. అలాంటి వాళ్లలో తన పట్ల నమ్మకం కలిగిన తరువాత అమ్మవారి విగ్రహం గురించి సుందరం ఆరా తీయడం మొదలుపెడతాడు. తనకి ఎమ్మెల్యే ఇచ్చిన గడువు ఆరు మాసాలే. ఈలోగా ఆ పనిని పూర్తి చేయాలి. అందువలన అతను తొందరపడుతుంటాడు. 

 అమ్మవారి మూర్తి ఎక్కడ ఉందనేది పెద్దయ్యకి మాత్రమే తెలుసుననీ, ఆ విగ్రహం పై కొంతమంది కన్నుపడిందని తెలిసి అతను దాచేశాడని తెలుసుకుంటాడు. ప్రకృతి విపత్తులను ఎదుర్కునే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఆ విగ్రహాన్ని బయటికి తీసి పూజిస్తారనే సమాచారాన్ని సేకరిస్తాడు. ఆ విగ్రహాన్ని బయటికి తీయిస్తేనే తాను వచ్చిన పని పూర్తి చెయ్యొచ్చని సుందరం భావిస్తాడు. అందుకోసం సుందరం ఏం చేస్తాడు? అతను తీసుకున్న ఆ నిర్ణయం వలన ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? చివరికి తాను వచ్చిన పనిని అతను పూర్తి చేయగలుగుతాడా? అనే అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. 

కల్యాణ్ సంతోష్ రాసుకున్న కథ ఇది. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్షను హీరోగా పరిచయం చేస్తూ, ఆయనే ఈ కథను తెరకెక్కించాడు.  అడవిలోని ఓ గిరిజన గూడెం. వాళ్లు ఎంతో భక్తి విశ్వాసాలతో కొలిచే అమ్మవారి మూర్తిని అక్కడి నుంచి తరలించే ఆలోచనతో వెళ్లిన ఒక స్కూల్ మాస్టర్ కి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేదే కథ. ఈ కథను దర్శకుడు కంటెంట్ కి తగిన కామెడీతో  ఆసక్తికరంగా ఆవిష్కరించాడా అంటే .. లేదనే చెప్పాలి. 

దర్శకుడు ఎంచుకున్న లైన్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ ఆ లైన్ ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో చుట్టూ అల్లుకొచ్చిన అంశాలు బలహీనంగా అనిపిస్తాయి. గిరిజనులకు ఆంగ్లం నేర్పించడం .. వాళ్లకి నల్లగా ఉండేవారంటే ఇష్టమని చెప్పి హీరోను పంపించడం .. వాళ్లకి ఇంగ్లిష్ ఎలా వచ్చింది అనడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ .. ఇలాంటివన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. అడవిలోని గిరిజన గూడానికి సంబంధించిన సెట్ చాలా అసహజంగా కనిపిస్తుంది. 

అమ్మవారి విగ్రహంతో ఎమ్మెల్యేకి పనేంటి? అతని నేపథ్యం ఏమిటి? ఆ విగ్రహాన్ని ఎలా అక్కడ నుంచి తరలించాలని అనుకున్నారు. అమ్మవారి విషయంలో గూడెం ప్రజలు ఎలా ఉన్నారు? ఆ విషయం తెలుసుకోవడానికి హీరో ఎన్ని పాట్లు పడ్డాడు? వంటి అంశాల విషయంలో క్లారిటీ కనిపించదు. జీవం లేని సన్నివేశాలు నీరసంగా .. నిస్సత్తువగా నడుస్తూ ఉంటాయి. చుట్టూ ఉన్న  అందమైన లొకేషన్స్ ను కూడా కథకి కనెక్ట్ చేయలేకపోయారు.

కథ ఏదైనా అది కామెడీతో ముడిపడి ఉంది .. అక్కడి గిరిజనుల ఎమోషన్స్ తో ముడిపడి ఉంది. కానీ ఈ రెండూ కూడా ఆడియన్స్ ను పట్టుకోలేకపోయాయి. దీపక్ ఫొటోగ్రఫీ .. శ్రీచరణ్ పాకాల సంగీతం కూడా ఈ కథకి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి. కార్తీక్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుందంతే. గిరిజనుల దృష్టిలో కరెన్సీ కాగితాలకు విలువలేదు .. వాటిపై ఉన్న 'గాంధీ' గారికి విలువ ఉంది. ఆశ పడగొడుతుంది .. ఆదర్శం నిలబెడుతుంది అనే ఒక సందేశం ఈ కథలో ఉంది. ఆ సందేశానికి వినోదాన్ని యాడ్ చేయడంలోనే విఫలం కావడం కనిపిస్తుంది.


Movie Details

Movie Name: Sundaram Master

Release Date: 2024-03-28

Cast: Harsha Chemudu, Divya Sripada, Harsha Vardhan, Balakrishna,Bhadram

Director: Kalyan Santhosh

Producer: Raviteja- Sudheer Kumar

Music: Sricharan Pakala

Banner: RT Team Works - Goal den Media

Review By: Peddinti

Sundaram Master Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews