'ట్రూ లవర్' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • ఎమోషన్స్ ప్రధానంగా నడిచే 'ట్రూ లవర్'
  • తమిళంలో హిట్ కొట్టిన సినిమా 
  • తెలుగులో లోపించిన ప్రమోషన్స్ 
  • సహజత్వానికి దగ్గరగా నడిచే కథాకథనాలు
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్  

ప్రేమకథా చిత్రాలకు యూత్ నుంచి ఎప్పుడూ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. కథలో కాస్త ఫీల్ ఉంటే చాలు, ఆ సినిమాకి విజయాన్ని అందించడానికి వాళ్లు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. అలాంటి ఒక ప్రేమకథా చిత్రంగా తమిళంలో 'లవర్' సినిమా రూపొందింది. మణికందన్ - గౌరీప్రియ జంటగా నటించిన ఈ సినిమా, తెలుగులో 'ట్రూ లవర్' పేరుతో థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచే ఈ సినిమా వివిధ భాషల్లో 'హాట్ స్టార్'లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అరుణ్ (మణికందన్) ఇంజనీరింగ్ పూర్తిచేస్తాడు. జాబ్ చేయడమంటే అతనికి పెద్దగా ఇష్టం ఉండదు. అందువలన ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉంటాడు. అందుకోసం తండ్రి దగ్గర నుంచి 15 లక్షలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోతుంది. తన తండ్రి మరో స్త్రీతో ఉండటం .. ఫ్యామిలీని పట్టించుకోకపోవడం అతనికి బాధను కలిగిస్తూ ఉంటుంది. అనారోగ్యంతోనే రోజులు నెట్టుకొస్తూ తల్లి తెచ్చే జీతం డబ్బుతోనే ఇల్లు నడుస్తూ ఉంటుంది. 

ఇక దివ్య ( గౌరీప్రియ) విషయానికొస్తే, జాబ్ కారణంగా తన పేరెంట్స్ కి దూరంగా ఉంటూ ఉంటుంది. కాలేజ్ రోజుల నుంచి ఆమె .. అరుణ్ ప్రేమించుకుంటూ ఉంటారు. ఆర్ధికంగా స్థిరపడిన తరువాత అరుణ్ ని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది. అయితే తనకి జాబ్ లేకపోవడం .. దివ్య చాలా పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటూ ఉండటం అరుణ్ కి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. సాఫ్ట్ వేర్ జాబ్స్ చేసేవారి లైఫ్ స్టైల్ తెలిసినవాడు కావడం వలన, దివ్య వేరే వారి ఆకర్షణలో పడిపోతుందేమో అనే ఒక అభద్రతా భావానికి అరుణ్ లోనవుతాడు. 

ఈ కారణంగా అతను దివ్యను కంట్రోల్ చేయడం మొదలుపెడతాడు. ఎవరితో మాట్లాడినా .. ఎక్కడికి వెళ్లినా అనుమానిస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా .. ఎంతమందిలో ఉన్నా అక్కడికి వచ్చేసి ఆమెతో గొడవపడుతూ ఉంటాడు. అతని ధోరణి దివ్యకి అసహనాన్ని కలిగిస్తుంది. అంత అనుమానం ఉన్న అతనితో జీవితాంతం వేగడం కష్టమని భావిస్తుంది. అతని టార్చర్ తట్టుకోలేక అబద్ధం చెప్పడం మొదలుపెడుతుంది. అలా ఆమె అతనికి అబద్ధం చెప్పి, తన కొలీగ్స్ తో కలిసి 'అరకు' వెళుతుంది. ఆ గుంపులో మదన్ కూడా ఉంటాడు. 

అరుణ్ జాబ్ చేయకపోవడం .. బాధ్యత లేకుండా వ్యవహరించడం .. అదే పనిగా తనని అనుమానిస్తూ ఉండటం దివ్యకి అసహనాన్ని కలిగిస్తాయి. అదే సమయంలో అరుణ్ తండ్రి గురించిన విషయం కూడా దివ్యకి తెలుస్తుంది. దాంతో ఆమె అరుణ్ కి బ్రేకప్ చెప్పాలని అనుకుంటుంది. అదే సమయంలో .. ఊరికి వెళుతున్నానని తనతో అబద్ధం చెప్పి, మదన్ తో దివ్య అరకు వెళ్లిన విషయం అరుణ్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? వాళ్లిద్దరి పెళ్లి జరుగుతుందా? అనేది మిగతా కథ.

దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ కథను రాసుకున్నాడు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా .. స్పష్టంగా చెప్పాడు. తన కుటుంబ నేపథ్యం .. తన ఆర్ధిక పరిస్థితి చూసి ఒక అమ్మాయి ప్రేమించడమే ఎక్కువ. పెళ్లి చేసుకోవాలనుకోవడం మరీ ఎక్కువ. అలాంటి అమ్మాయి చేజారిపోతుందేమో అనే ఒక ఆదుర్దాతో కూడిన హీరో పాత్రను, బాధ్యత లేని వ్యక్తితో బ్రతుకును కొనసాగించడం కష్టమవుతుందేమో అని ఆలోచించే ఒక హీరోయిన్ పాత్రను దర్శకుడు డిజైన్ చేసుకున్న తీరు ప్రేక్షకులను కూర్చోబెడుతుంది.

ఒకానొక సమయంలో హీరోయిన్ తన ఆఫీసులోని ఒక యువకుడి పట్ల ఆకర్షితురాలవుతుంది. అతనితో అరుణ్ ను పోల్చి చూసుకుంటుంది. అరుణ్ తాగుబోతు అయినా తల్లి పట్ల ఎంతో ప్రేమతో ఉంటాడు. తల్లిని ప్రేమించేవాడు .. భార్య మనసును కష్టపెట్టలేడు అనే ఒక సూత్రంపై ఆధారపడి ఆమె చాలావరకూ సహిస్తూ వెళుతుంటుంది. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఎక్కడా ఏ విషయంలోను సినిమా టిక్ గా అనిపించదు. కథ కొత్తదేం కాకపోయినా, సహజమైన సన్నివేశాలు మనసుకు పట్టేస్తాయి.

ఒక కథకి ఒకటే ముగింపు ఉంటుంది .. అది సరైన ముగింపై ఉండాలి. ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో ఏమో అనే ఉద్దేశంతో చాలా కథల ముగింపు ఆడియన్స్ కోరుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. కొన్ని ముగింపులు మాత్రం కథకి తగినట్టుగానే జరుగుతాయి. అలాంటి కథల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ఈ ముగింపు ఫీల్ కి దూరంగా వెళ్లదు .. అసంతృప్తిగా అనిపించదు. ఆమోదయోగ్యంగానే .. ఆస్వాద యోగ్యంగానే అనిపిస్తుంది.   

మణికందన్ నటన ఈ సినిమాకి హైలైట్ .. అలాగే గౌరీప్రియ నటనను కూడా అభినందించకుండా ఉండలేం. కళ్లతోనే ఆమె చక్కని హావభావాలను ఆవిష్కరించింది. సీన్ రోల్డన్ సంగీతం .. శ్రేయాస్ - కృష్ణ కెమెరా పనితనం .. భరత్ విక్రమన్ ఎడిటింగ్ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచాయని చెప్పచ్చు. ప్రతినాయకుడు లేకుండా .. ఆ లోటు తెలియకుండా నడిచే కథ ఇది. ప్రేమ ఎక్కువైనా ప్రమాదమే. అతి ప్రేమ అనుమానాలకు దారితీస్తుంది .. అది ఒప్పుకోలేని బలహీనతగా మారుతుంది అనే సందేశం కూడా ఈ కథలో అంతర్లీనంగా కనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడదగిన సినిమానే ఇది. 

Movie Details

Movie Name: True Lover

Release Date: 2024-03-27

Cast: Manikandan, Sri Gouri Priya, Kanna Ravi, Geetha Kailasam, Nikhila Shankar, Harini

Director: Prabhuram Vyas

Producer: Yuvaraj Ganesan - Magesh Raj

Music: Sean Roldan

Banner: Million Dollar Studios

Review By: Peddinti

True Lover Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews