'వళరి' - (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

  • హారర్ థ్రిల్లర్ గా రూపొందిన 'వళరి'
  •  హైలైట్ గా నిలిచిన రితికా సింగ్ నటన
  • అసలైన అంశాలకు ఇవ్వని ప్రాధాన్యత 
  • కొత్తగా అనిపించని కథాకథనాలు 
  • మెప్పించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ జోనర్ కి సంబంధించిన ఒక సినిమా 'ఈటీవీ విన్' ద్వారా ప్రేక్షకులను పలకరించింది .. ఆ సినిమా పేరే 'వళరి'. రితికా సింగ్ - శ్రీరామ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

నవీన్ (శ్రీరామ్) నేవీలో పనిచేస్తూ ఉంటాడు. భార్య దివ్య ( రితికా సింగ్)  పదేళ్ల కొడుకు మధు .. ఇదే అతని కుటుంబం. చెన్నైలో వాళ్ల జీవితం కొనసాగుతూ ఉంటుంది. దివ్యకి తరచూ ఒక కల వస్తూ ఉంటుంది. దాంతో ఆమె ఆ కల గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది. అలాంటి విషయాలను సీరియస్ గా తీసుకోవద్దని నవీన్ చెబుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్లకి 'కృష్ణపట్నం' బదిలీ అవుతుంది. అక్కడి నేవీ క్వార్టర్స్ లో ఆ ఫ్యామిలీ దిగుతుంది. అదే వరుసలో .. అక్కడికి దగ్గరలో మరో పాడుబడిన బంగ్లా ఉంటుంది. 

ఆ బంగ్లా చూసినప్పుడల్లా దివ్య మరింత ఆందోళనకి లోనవుతూ ఉంటుంది. తనకి .. ఆ ఇంటికి ఏదో సంబంధం ఉందని ఆమెకి అనిపిస్తూ ఉంటుంది. ఓ రోజున ఆ బంగళా దగ్గర దొరికిన ఒక 'రింగ్' ను మధు ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అనూహ్యమైన సంఘటనలు జరగడం మొదలవుతుంది. ఆ పాడుబడిన బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని అక్కడివాళ్లు ఆమెతో చెబుతారు. దాంతో ఆమె ఆ ఇంటిని గురించి పూర్తి సమాచారం కనుక్కునే పనిలో పడుతుంది.

దివ్య ఆ పనిలో ఉండగానే ఆమెకి ఓ ప్రమాదం జరుగుతుంది. దాంతో ఆమె కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండిపోతుంది. హాస్పిటల్లో మానసిక వైద్య నిపుణుడైన డాక్టర్ 'రుద్ర' ( సుబ్బరాజు) పర్యవేక్షణలో దివ్య ఉంటుంది. తనని ఆయన 'దర్శిని' అంటూ పిలవడం దివ్యకి చిత్రంగా అనిపిస్తుంది. పాడుబడిన బంగ్లా విశాలంగా అనిపించడంతో దానిని రెంట్ కి తీసుకోవాలని నవీన్ భావిస్తాడు. ఆ బంగ్లా యజమాని రామచంద్రయ్య (ఉత్తేజ్)ను కలిసి మాట్లాడతాడు ..  అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాడు. 

నవీన్ ఆ బంగ్లాను శుభ్రం చేయించి, హాస్పిటల్ నుంచి నేరుగా దివ్యను అక్కడికి తీసుకుని వస్తాడు. ఏ ఇంటిని గురించి అయితే ఇకపై తాను ఆలోచన చేయకూడదని దివ్య భావించిందో, అదే ఇంటికి తనని నవీన్ తీసుకు రావడం పట్ల ఆమె ఎలా స్పందిస్తుంది? తరచూ తనకి వచ్చే కలకూ .. ఆ ఇంటికి ఉన్న లింక్ ఏమిటి? ఆ ఇంటిని గురించి ఆమెకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి?   అప్పుడు ఆమె ఏం చేస్తుంది? 'వళరి' అనే ఆయుధానికీ .. దివ్యకి గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. 

మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఓ పాడుబడిన బంగ్లా .. అందులో దెయ్యాలు ఉన్నాయని తెలియక దిగే ఒక చిన్న ఫ్యామిలీ అనేది హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ఆసక్తిని రేకెత్తించే అంశం. ఇక 'వళరి' అంటే ప్రాచీన కాలంలో ఉపయోగించిన 'బూమరాంగ్'ను పోలిన ఒక ఆయుధం. అది తన లక్ష్యాన్ని ఛేదించి, ప్రయోగించినవారి దగ్గరికి తిరిగొస్తుంది. కాకపోతే ప్రయోగించడంలో చాలా నైపుణ్యం ఉండాలి. దెయ్యాల కథకీ .. ఈ ఆయుధానికి సంబంధం ఏమిటి? అనేది ఈ కథలోని ముఖ్యమైన పాయింట్. 

దర్శకురాలు అటు ప్రేతాత్మల వైపు నుంచి భయపెట్టగలిగిందా? ఇటు 'వళరి' అనే ఆయుధం వైపు నుంచి ఆసక్తిని పెంచిందా? అంటే, రెండు అంశాలను కూడా ఆశించిన స్థాయిలో ఆవిష్కరించలేదనే చెప్పాలి. దెయ్యాలు నేరుగా .. భయంకరంగా కాదుగదా .. అసలే కనిపించవు. అప్పుడప్పుడు మాత్రం కాస్త హడావిడి చేస్తూ ఉంటాయి. ఇక 'వళరి' అనే ఆయుధం నేపథ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. ఎక్కడా ఆ విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేయలేదు. 

 చివరికి వచ్చేసరికి కథను రివేంజ్ డ్రామా రూట్లోకి తీసుకొచ్చేశారు. దాంతో కాస్త భయపడుతూనే ఎంజాయ్ చేద్దామనుకున్న ప్రేక్షకుడు, ఆ భయంలో నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక చిన్న ఇల్లు తమకి సరిపోతుందని చెప్పిన హీరో, భార్య హాస్పిటల్ నుంచి వచ్చేలోగా దెయ్యాల బంగ్లాను అద్దెకి తీసుకోవడం, తన పరిస్థితికి ఆ బంగ్లానే కారణమనే భయంతో ఉన్న దివ్య, మౌనంగా ఆ ఇంట్లోకి వచ్చేయడం లాజిక్ కి కాస్త దూరంగానే అనిపిస్తాయి.  

అయితే దివ్య తల్లికి సంబంధించిన యాక్షన్ సీన్స్ ను .. ఎమోషనల్ సీన్స్ ను చిత్రీకరించిన తీరు బాగుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ లోని ట్విస్ట్ కూడా ఆడియన్స్ ఊహకి అందనిదిగానే ఉంటుంది. దర్శకురాలు తాను ఎంచుకున్న కథను బోర్ కొట్టకుండా నడిపించగలిగారు. కానీ కథలోని అసలైన ట్రాక్ కి సంబంధించిన దెయ్యాలు .. 'వళరి' అనే ఆయుధం గురించిన అంశాలను నెక్స్ట్ లెవెల్లో ఆవిష్కరించలేకపోయారు. ఫలితంగా ఈ సినిమా రొటీన్ కథల జాబితాలో చేరిపోయింది. 

ప్రధానంగా ఈ కథ ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. రితికా నటన హైలైట్ అనే చెప్పాలి. వర్తమానంలోను ... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోను ఆమె చాలా బాగా చేసింది. మిగతా వాళ్లంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. విష్ణు నేపథ్య సంగీతం .. సుజాత సిద్ధార్థ్ ఫొటోగ్రఫీ .. తమ్మిరాజు ఎడిటింగ్ కథకి తగినట్టుగానే నడిచాయి. ఈ సినిమాకి 'వళరి' అనే టైటిల్ ప్రధానమైన బలం. కానీ ఆ ఆయుధానికి సంబంధించిన అంశాన్ని పట్టించుకోకపోవడమే అసంతృప్తిని కలిగిస్తుంది.

Movie Details

Movie Name: Valari

Release Date: 2024-03-06

Cast: Rithika Singh, Sri Ram, Subbaraju, Utthej, Sahasra, Parinitha

Director: Mrithika Santhoshini

Producer: -

Music: Vishnu

Banner: Virtual Production

Review By: Peddinti

Valari Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews