'శీష్ మహల్' - (ఈటీవీ విన్) మూవీ రివ్యూ

  • రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రగా 'శీష్ మహల్'
  • నలుగురి జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం 
  • సహజత్వానికి దగ్గరగా ట్రై చేసిన దర్శకుడు 
  • ఆసక్తికరంగా అల్లుకోని కథాకథనాలు

రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'శీష్ మహల్'. ఈ సినిమా ఈటీవీ విన్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో .. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను రూపొందించారు. అలాంటి ఈ సినిమా, ఓటీటీ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.

రామకృష్ణ (రాహుల్ రామకృష్ణ) ఒక టీవీ ఛానల్ లో క్రైమ్ స్టోరీస్ కి సంబంధించిన ప్రోగ్రామ్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక ఫిల్మ్ మేకర్ గా మార్పుకు కారణమయ్యే ఒక మంచి సినిమా తీయాలనేది ఆయన ఆశయం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ .. తనకే నచ్చని కారణంగా మధ్యలోనే ఆ ప్రాజెక్టులను ఆపేస్తూ ఉంటాడు. అలాంటి రామకృష్ణ హైదరాబాద్ లో ఫిల్మ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఒక డాక్యుమెంటరీ చేయాలనుకుంటాడు. 

ఇక హైదరాబాద్ లోని స్లమ్ ఏరియాకి చెందిన కుర్రాడు ఫకీర్ (సాయి). అతను అనాథ .. చెత్త కాగితాలు ఏరుకుని, వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బుతో రోజులు గడుపుతూ ఉంటాడు. హైదరాబాద్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ సంబరాలు అతనిని బాగా ఆకర్షిస్తాయి. తెల్లవారు జామునే తన చిత్తు కాగితాలకి సంబంధించిన పనిని పూర్తి చేసుకుని, స్కూల్ పిల్లలతో పాటు సినిమాలను చూస్తుంటాడు. అతనికి ఆ ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది.

ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లోని సినిమాలను చూడటానికి జూనియర్ ఇంటర్ చదివే లావణ్య, తన ఫ్రెండ్స్ తో కలిసి ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుంది. అక్కడ ఆమెకి ఒక కుర్రాడితో పరిచయమవుతుంది. ఇద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు. ఆ విషయాన్ని ఆమె ఫ్రెండ్స్ తోపాటు, వాళ్లతో వచ్చిన టీచర్ కూడా గమనిస్తుంది. 

ఫిరోజ్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అతనికి భార్య .. ఇద్దరు పిల్లలు. హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో క్యాంటీన్ ను లీజ్ కి తీసుకుని నడిపిస్తూ ఉంటాడు. ఆ థియేటర్ లోను చిన్నపిల్లలకి సంబంధించిన సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు. తన పిల్లలకి కూడా ఆ సినిమాలు చూపించాలని అతను నిర్ణయించుకుంటాడు.

దర్శకుడు శశి ఈ కథను, రామకృష్ణ .. ఫిరోజ్ .. లావణ్య .. ఫకీర్ అనే నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూ అల్లుకుంటూ వెళ్లాడు. కథ అంతా కూడా హైదరాబాద్ లో .. తెలంగాణ యాసలో నడుస్తుంది. ఫిరోజ్ ఫ్యామిలీ మాత్రం హైదరాబాద్ హిందీ మాట్లాడుతుంది. రియల్ లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగింది. ఒక యువకుడి ఆశయం ... ఒక కుర్రాడి ఆసక్తి .. టీనేజ్ లో ఉండే ఆకర్షణ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. 

అయితే నాలుగు వైపులా నుంచి నడిచే ఈ కథ సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుందిగానీ, ఆసక్తికరంగా మాత్రం అనిపించదు. నాలుగు వైపులా నుంచి నడిచే ఈ కథలో ఏ వైపు నుంచి కూడా ఎమోషన్ కనెక్ట్ కాదు. ఈ తరహా కాన్సెప్టులలో కామెడీని వర్కౌట్ చేయవచ్చు .. కానీ అలాంటి ప్రయత్నం కూడా జరగలేదు. కొత్తవాళ్ల నుంచి సరైన అవుట్ పుట్ తీసుకోలేదు. అందువలన ప్రేక్షకుడు కథలోకి వెళ్లలేక ఇబ్బంది పడతాడు. 

ఇది 'అర్జున్ రెడ్డి' సినిమాకి ముందు రాహుల్ రామకృష్ణ చేసిన సినిమా. అందువలన ఈ సినిమా చాలా కాలం క్రితం తీసినదనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమాను 15 లక్షలలోనే పూర్తి చేశారట. వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఫిల్మ్ ఫెస్టివల్ కి సంబంధించిన కొన్ని రియల్ షాట్స్ వాడుకున్నారు. ఈ కథలో ఏ ట్రాక్ ను సరిగ్గా డిజైన్ చేసుకోకపోవడం. దేనికీ సరైన ముగింపు ఇవ్వకపోవడం అసంతృప్తికరంగా అనిపిస్తుంది.

ఏ కెమెరాతో తీసినా ... బడ్జెట్ ఎంత తక్కువైనా .. ఆర్టిస్టులు కొత్తవారే అయినా .. చాలా కాలం క్రితమే నిర్మితమైనా, కథలో విషయం ఉంటే ఆడియన్స్ మిగతా విషయాలు పట్టించుకోరు. కానీ ఈ కథలో ఏ పాత్రకు .. ఏ ట్రాక్ కి సరైన ముగింపు కనిపించదు. అసలు ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారనేది అర్థం కాదు. 

Movie Details

Movie Name: Sheesh Mahal

Release Date: 2024-02-22

Cast: Rahul Ramakrishna, Sai, Rohith, Premila, Arnold, Advaith

Director: Sasi

Producer: Snehal Jangala

Music: Vivek Sagar

Banner: Million Dream Creations

Review By: Peddinti

Sheesh Mahal Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews