'కుయికో' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

  • యోగిబాబు ప్రధాన పాత్రధారిగా 'కుయికో'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • అందుబాటులోకి వచ్చిన తెలుగు వెర్షన్
  • సరదాగా కాసేపు నవ్వించే సినిమా  

తమిళంలో స్టార్ కమెడియన్ గా యోగిబాబుకి విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన ఆయనను ప్రధానమైన పాత్రగా చేసుకుని కూడా అక్కడ కథలను రెడీ చేస్తున్నారు. అలా ఆయన చేసిన సినిమాగా 'కుయికో' ప్రేక్షకులను పలకరించింది. నవంబర్ 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 22వ తేదీన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి అడుగుపెట్టింది. రీసెంటుగా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

మలయప్పన్ (యోగిబాబు) తన గ్రామంలో పశువులు మేపుతూ ఉంటాడు. అతనికి ఉన్న ఆస్తి పాస్తీ చిన్నపాటి ఇల్లు .. తల్లి మాత్రమే. బుద్ధిమంతుడిలా తన పని తాను చేసుకుపోయే అతను, ముత్తుమారి (దుర్గ) ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అందుకు ముత్తుమారి అన్నయ్య వడివేలు అడ్డుచెబుతాడు. ఏ మాత్రం ఆస్తిపాస్తులు లేని అతనికి తన చెల్లెలిని ఇవ్వనని తేల్చి చెబుతాడు. అయితే సంపాదించడం తనకి కూడా చేతనవుతుందని నిరూపించడానికి మలయప్పన్ సౌదీ వెళతాడు.

ఇదిలా ఉండగా ఆ పక్కనే ఉన్న ఊళ్లో తంగరాజ్ (విధార్త్) ఎలాంటి పనీపాటా లేకుండా తిరుగుతూ ఉంటాడు. మేనమామ (పండు) దగ్గర అవసరానికి డబ్బులు తీసుకుంటూ రోజులు గడుపుతూ ఉంటాడు.  అతని మేనమామ ఒక వైపున వడ్డీ వ్యాపారం చేస్తూనే, మరో వైపున టెంట్ సామాను .. ఫ్రీజర్ బాక్స్ రెంట్ కి ఇస్తుంటాడు. మేనమామ కారణంగా అతను ఒక కేసులో చిక్కుకుంటాడు. ఆ సమయంలోనే మలయప్పన్ తల్లి చనిపోతుంది. 

సౌదీ నుంచి తాను వచ్చేవరకూ తన తల్లిని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచమని, షణ్ముగం ( ఇళవరసు)కి బాధ్యతను అప్పగిస్తాడు మలయప్పన్. అలా ఆ ఇంటికి ఫ్రీజర్ బాక్స్ ఇవ్వడానికి తంగరాజ్ వెళతాడు. మలయప్పన్ అక్క కూతురైన 'మలయరసి'ని అక్కడ మొదటిసారిగా చూస్తాడు. ఆమె అందమైనదనే విషయం అతనికి అర్థమైపోతుంది. తెలివైనదని కూడా ఆ చుట్టుపక్కలవారు చెబుతారు. తన తల్లి ఆఖరి వీడ్కోలు పండగలా చేయాలని మలయప్పన్ భావిస్తాడు.

గతంలో అతనని తక్కువగా .. చులకనగా చూసిన వాళ్లంతా, ఇప్పుడు అతని దగ్గర డబ్బు ఉందనేసరికి గౌరవిస్తూ ఉంటారు. తన తల్లి అంత్యక్రియలు చేసిన తరువాత అతను ఆ ఫ్రీజర్ ను కూడా తిరిగి ఇవ్వకుండా తన తల్లి జ్ఞాపకంగా ఉంచేసుకుంటాడు.  ఇకపై అక్కడే ఉండిపోయి ఆ ఊరిని డెవలప్ చేయాలనీ .. తాను ప్రేమించిన ముత్తుమారిని పెళ్లి చేసుకోవాలని అతను అనుకుంటాడు. అతని కోరిక నెరవేరుతుందా .. లేదా? అనేది మిగతా కథ. 

అరుళ్ చేజియాన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే చిన్న సినిమా ఇది. గ్రామీణ ప్రజలు .. వాళ్ల స్వభావాలు .. డబ్బున్నవారి పట్ల కొంతమంది ధోరణి ఎలా ఉంటుంది? వేరే దేశానికి వెళ్లి డబ్బు సంపాదించుకుని సొంత ఊరుకు వెళ్లినప్పుడు వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? అనే అంశాలను కళ్లముందుంచే కథ ఇది. ఒకరి చావును ప్రధానంగా చేసుకుని .. చుట్టూ ఉండే అంశాలను ఆవిష్కరించారు. 

కథానాయకుడు యోగిబాబు అనగానే కథాకథనాలు ఎలా ఉంటాయనేది కొంతవరకూ అర్థం చేసుకోవచ్చు. చాలామంది అనుకున్నట్టుగానే ఈ సినిమా హాస్యప్రధానంగా సాగుతుంది. కథలో ఎక్కడా బరువైన విషయాలు .. అనూహ్యమైన మలుపులు ఉండవు. కథ ప్రధానమైన ఉద్దేశం .. లక్ష్యం సరదాగా నవ్వించడమే గనుక, ఆ దిశగానే కొనసాగుతుంది. తల్లి జ్ఞాపకంగా ఒక కొడుకు ఆమె ఫ్రీజర్ బాక్సును దాచుకోవడం హైలైట్ గా అనిపిస్తుంది.

యోగిబాబు తాను నవ్వకుండానే నవ్వించే తన మార్క్ కామెడీ చూపించాడు. సౌదీ నుంచి బాగా డబ్బు సంపాదించుకుని వచ్చినవాడిగా .. డబ్బంటే లెక్కలేనివాడిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. డబ్బున్న వాళ్లు చేతికి పెత్తనం అప్పగిస్తే, అవతల వ్యక్తులు చేసే హడావిడి ఎలా ఉంటుందనేది ఇళవరసు బాగా చేశాడు. ఈ కాలం పల్లెటూరి అమ్మాయిగా మలయరసి పాత్రలో సాయి ప్రియాంక నటన మెప్పిస్తుంది.    

రాజేశ్ యాదవ్ ఫొటోగ్రఫీ .. ఆంటోని దాసన్ నేపథ్య సంగీతం .. రామ్ పాండియన్ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. విలేజ్ నేపథ్యానికి సంబంధించిన లొకేషన్స్ బాగున్నాయి. కంటెంట్ కామెడీ కేంద్రంగా సాగేదే అయినా, సన్నివేశాలు పగలబడి నవ్వుకునేలా ఏమీ ఉండవు. తలచుకుని నవ్వుకునేలా కూడా ఉండవు. గ్రామీణ వాతావరణానికి కనెక్ట్ చేస్తూ, చూస్తున్న కాసేపు సరదాగా అనిపిస్తుందంతే.

Movie Details

Movie Name: Kuiko

Release Date: 2023-12-22

Cast: Yogi Babu, Vidharth,Sri Priyanka, Durga, Ilavarasu, Vinodhini Vaidyanathan

Director: Arul Chezhian

Producer: AST Films

Music: Anthony Daasan

Banner: AST Films

Review By: Peddinti

Kuiko Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews