'ఖో గయే హమ్ కహాన్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ

  • అనన్య పాండే నుంచి 'ఖో గయే హమ్ కహాన్'
  • ఈ నెల 26 నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • తెలుగులోను అందుబాటులో ఉన్న సినిమా 
  • యూత్ పై సోషల్ మీడియా ప్రభావమే ప్రధానమైన కథాంశం

సినిమాలను యూత్ ఎక్కువగా చూస్తుంటుంది. అందువలన యూత్ కి నచ్చే కంటెంట్ ను ఇవ్వడానికి మేకర్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక యూత్ ను ఆలోచింపజేసే కంటెంట్ కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. అలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమానే 'ఖో గయే హం కహాన్'. అర్జున్ వరైన్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 26వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

అహానా (అనన్య పాండే) ఇమాద్ (సిద్ధాంత్ చతుర్వేది) నీల్ (ఆదర్శ్ గౌరవ్) మంచి ఫ్రెండ్స్. ఈ ముగ్గురూ కూడా ఒకరి విషయాలను ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అహానా .. రోహన్ (రోహన్)ను లవ్ చేస్తుంది. ఆమెతో ఎంతో సాన్నిహిత్యంగా మెలిగిన రోహన్, కెరియర్ గురించి ఆలోచించుకోవడానికి తనకి కొంత సమయం కావాలని వెళ్లిపోతాడు. ఆ తరువాత అతను వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని తెలిసి అహానా బాధపడుతుంది. 

ఇమాద్ తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన కారణంగా మానసికంగా కుంగిపోతాడు. దానిని నుంచి బయటపడటానికి అతను 'స్టాండప్ కామెడీ'ని ఎంచుకుంటాడు. అతను సిమ్రాన్ ప్రేమలో పడతాడు. ఇక నీల్ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తూ ఉంటాడు.  తరచూ తన జిమ్ కి వచ్చే 'లాలా' లవ్ లో పడతాడతను. తానే కొత్తగా ఒక జిమ్ సెంటర్ ను ఓపెన్ చేయాలనే ఆలోచన అతనిని వెంటాడుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని నీల్ తన స్నేహితులకు చెబుతాడు. 

అతను జిమ్ సెంటర్ పెట్టడానికి అవసరమైన ఆర్ధిక సాయాన్ని తాను చేస్తానని ఇమాద్ అంటాడు. తాను తన జాబ్ మానేసి .. నీల్ జిమ్ సెంటర్ కోసం పని చేస్తానని అహానా అంటుంది. తన కోరిక నెరవేరనున్నందుకు నీల్ చాలా సంతోషపడతాడు. జిమ్ సెంటర్ కి అవసరమైన డబ్బును రెడీ చేసుకుంటారు. ఆ సెంటర్ కి ఏ పేరు పెట్టాలనేది కూడా ఖాయమైపోతుంది. వాళ్ల ఫ్యామిలీస్ కూడా అందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి.
  
ఈ నేపథ్యంలోనే ఒక చిన్న విషయం దగ్గర ఇమాద్ కీ, నీల్ కి మధ్య గొడవ జరుగుతుంది. రోహన్ ను ఇంప్రెస్ చేయడం కోసం సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ .. మరోసారి అతనికి అహానా చేరువవుతుంది. అతను మరోసారి మోసం చేసి అక్కడి నుంచి బయటపడతాడు. ఇక 'లాలా'కి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండటం .. వాళ్లకి సంబందించిన ఫొటోలను ఆమె పోస్టు చేస్తుండటం పట్ల నీల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఫలితంగా ఆ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. 

ఇక సిమ్రాన్ పరిచయమైన తరువాత కూడా పాత గాళ్ ఫ్రెండ్స్ తో ఇమాద్ టచ్ లోనే ఉంటాడు. అతని ఫోన్ కి వచ్చే మెసేజ్ ల వలన ఆ విషయం బయటపడుతుంది. అది నచ్చక అతనితో ఆమె గొడవ పెట్టుకుంటుంది. దాంతో వాళ్ల మధ్య అనుబంధం కూడా తెగిపోతుంది. ప్రేమ విషయంలో విఫలమైన ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అది వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది మిగతా కథ.

దర్శకుడు మూడు ప్రధానమైన పాత్రలను తీసుకుని, ఆ పాత్రల చుట్టూనే ఈ కథను నడిపించాడు. ఈ కాలంలో యువత సోషల్ మీడియాకి ఎంతగా దగ్గరయ్యారు .. అది వాళ్ల జీవితాలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది అనే విషయాన్ని చెప్పడమే దర్శకుడి ప్రధానమైన ఉద్దేశం. ప్రధానమైన మూడు పాత్రలను సోషల్ మీడియాకి కనెక్ట్ చేస్తూనే ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు. సోషల్ మీడియాలో వాళ్లు ఎంతగా మునిగిపోయారనేది చూపించాడు. 

ఈ కాలంలో యువత ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం .. దానికి ఎన్ని లైకులు వచ్చాయో ..  ఎంతమంది ఫాలోవర్స్ పెరిగారో చూసుకుని మురిసిపోవడం చేస్తోంది. అలాంటి లైకుల కోసం ఈ సినిమాలో అహానా తన వ్యక్తిత్వాన్ని తగ్గించే ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతుంది. తను ప్రేమించే అమ్మాయి వేరే అబ్బాయితో కనిపించిందనే కోపంతో, ఆమెపై నీల్ నెగెటివ్ పోస్టులు పెడతాడు. 

సోషల్ మీడియా ద్వారా అనవసరమైన పరిచయాలు .. తొందరపాటు నిర్ణయాలు .. ఆవేశాలు .. అపార్థాలు .. ఆశయాలు ఆలస్యం కావడం .. లక్ష్యాలు మరిచిపోవడమనేది ఈ కథలో కనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన పాయింట్ .. ఇచ్చిన సందేశం బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ చెప్పడమనేది ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం అసహనాన్ని కలిగిస్తుంది. కథ ఇటు ఫ్లాట్ .. అటు క్లబ్బులు .. పబ్బుల చుట్టూ మాత్రమే తిరుగుతూ విసుగు తెప్పిస్తుంది. 

అక్కడక్కడా కాస్త రొమాన్స్ ను టచ్ చేశారు తప్ప, కామెడీకి కూడా చోటు ఇవ్వలేదు. 'స్టాండప్ కామెడీ' షోలో కూడా కామెడీ కనిపించదు. అనన్య పాండే గ్లామర్ ... యాక్టింగ్ సహజంగా అనిపిస్తాయి. సిద్ధాంత్ చతుర్వేది - ఆదర్శ్ గౌరవ్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఓకే.  ప్రస్తుతం యూత్ ఎటువైపు వెళుతోంది? ట్రెండ్ ఎలా ఉంది? అనే విషయాన్ని ఈ కథ చెబుతుంది. కానీ ఒక సినిమా కథకి కావలసిన మిగతా అంశాలు .. విశేషాలు కనిపించకపోవడమే ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది.

Movie Details

Movie Name: Kho Gaye Hum Kahan

Release Date: 2023-12-26

Cast: Ananya Panday, Siddhant Chaturvedi, Adarsh Gourav, Kalki Koechlin, Anya Singh

Director: Arjun Varain Singh

Producer: Zoya Akhtar - Reema Kagti

Music: Ankur Tewari - Sachin–Jigar

Banner: Excel Entertainment

Review By: Peddinti

Kho Gaye Hum Kahan Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews