'చిన్నా' (హాట్ స్టార్) మూవీ రివ్యూ

  • తమిళంలో మెప్పించిన 'చిత్త'
  • తెలుగు నుంచి ఆ స్థాయిలో రాని రెస్పాన్స్
  • ఈ రోజు నుంచి హాట్ స్టార్ లో మొదలైన స్ట్రీమింగ్ 
  • ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథ 
  • సహజత్వంతో నడిచే పాత్రలు
  • ఆలోచింపజేసే సందేశం

సిద్ధార్థ్ తాను హీరోగా రూపొందే కొన్ని సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలా ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమానే 'చిత్త'. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన తమిళంలో విడుదలైంది. ఆ తరువాత అక్టోబర్ 6వ  తేదీన ఈ సినిమా 'చిన్నా' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

తెలుగు వెర్షన్ ప్రకారం ఈ సినిమా 'యాదాద్రి' పరిసర ప్రాంతాల్లో నడుస్తుంది. ఈశ్వర్ (సిద్ధార్థ్) మున్సిపల్ ఆఫీసులో చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు. కుటుంబ సభ్యులు అతనిని 'చిన్నా' అని పిలుస్తుంటారు. అతని అన్నయ్య చనిపోవడంతో, వదిన .. పాప సుందరి (సహస్ర) బాధ్యత అతనిపై పడుతుంది. అతను ఒక వైపున ఆఫీసు పనులు .. మరో వైపున ఇంటి పనులను చేసుకుంటూ వెళుతుంటాడు.  అలాంటి పరిస్థితుల్లోనే ఆ ఊరికి శక్తి (నిమిషా సజయన్) తిరిగొస్తుంది.

గతంలో చిన్నా .. శక్తి ప్రేమించుకుంటారు. అయితే ఒక సంఘటన కారణంగా వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ ఊరు నుంచి వెళ్లిపోయిన ఆమె, మళ్లీ ఇప్పుడు తిరిగొస్తుంది. అంతేకాదు మున్సిపల్ ఆఫీసులోనే ఉద్యోగంలో చేరుతుంది. గతంలో జరిగిన సంఘటన గురించి చిన్నా తన వైపు నుంచి వివరణ ఇచ్చుకుంటాడు. దాంతో వాళ్లిద్దరి మధ్య చోటు చేసుకున్న అపార్థాలు తొలగిపోతాయి. అప్పటి నుంచి వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ ఉంటుంది. 

చిన్నా ప్రతి రోజు సుందరిని స్కూల్ దగ్గర విడిచిపెట్టి, సాయంత్రం తీసుకుని వస్తుంటాడు. స్కూల్లో 'మున్నీ' అనే పాపతో సుందరి ఎక్కువ స్నేహంగా ఉంటుంది. మున్నీ మేనమామ వెంకటేశ్ కీ .. చిన్నాకు మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఒక రోజున సుందరి స్కూల్ దగ్గర ఉండగానే, చిన్నా  ముందుగా మున్నీని ఇంటి దగ్గర దింపుతాడు. ఆ రోజునే ఆ చిన్నారిపై లైంగిక దాడి జరుగుతుంది. చిన్నానే అందుకు కారణమని ఆ కుటుంబ సభ్యులు భావించి అతనిపై దాడి చేస్తారు.

హాస్పిటల్లో ఉన్న మున్నీ కోలుకుని నోరు విప్పడంతో, జరిగినదానికి చిన్నా  కారణం కాదని తెలుస్తుంది. మున్నీపై లైంగిక దాడి చేసినవాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, సుందరి అదృశ్యమవుతుంది. మున్నీ పై లైంగిక దాడి చేసినవాడే సుందరిని కిడ్నాప్ చేసి ఉంటాడని భావించి, అతని కోసం వెతకడం మొదలుపెడతారు. ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? సుందరిని వాళ్లు రక్షించుకోగలుగుతారా? అసలు నేరస్థుడు ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ ముందుకు వెళుతుంది.

అరుణ్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఎక్కడా తొందరపడకుండా నిదానంగా కథలోకి తీసుకుని వెళ్లాడు. హీరోకి ఒక వైపున ఫ్యామిలీ ఎమోషన్స్ ను .. మరో వైపున లవ్ ట్రాక్ ను లింక్ చేసి కథను నడిపించిన తీరు బాగుంది. డిజైన్ చేయబడిన కొన్ని ప్రధానమైన పాత్రల పరిధిలోనే ఈ కథ సాగుతుంది. దాదాపు అనవసరమైన సన్నివేశాలు అడ్డుతగలకుండానే చాలా సహజంగా ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. 

ఎంత గౌరవంగా ఉన్నా .. జెంటిల్ మెన్ అనిపించుకున్నా, ఒక ఆరోపణ ఎదురైందంటే ఈ సమాజం ఎలా చూస్తుంది? స్నేహితులు .. కుటుంబ సభ్యులు సైతం ఎలా సందేహిస్తారు? అనేది దర్శకుడు ఆవిష్కరించిన విధానం చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల బలహీనతలు గుర్తించకపోతే .. కొన్ని అలవాట్లను మాన్పించకపోతే, ప్రమాదాలను వాళ్లు పసిగట్టలేకపోవడం జరుగుతుందనే విషయాన్ని ఒక మెసేజ్ గా దర్శకుడు అందించాడు.


అయితే ఈ కథలో కీలకమైన అంశం ఏమిటంటే .. హీరో తన అన్నయ్య కూతురును ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలిపెట్టడు. అలాంటిది ఆ రోజు ఆ పాపను స్కూల్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి, మున్నీని ముందుగా ఇంటి దగ్గర దిగబెడతాడు. కథ మలుపు తిరగడానికి కారణమైన సీన్ ఇదే. కానీ ఎలాంటి కారణం లేకుండా హీరో అలా చేయడం మాత్రం అతకలేదు. అక్కడ ఒక్కచోట మాత్రం, హీరో బయటికి చెప్పలేని ఒక బలమైన కారణాన్ని సెట్ చేసుకుని ఉంటే, కథ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేది. 

హీరోపై నింద పడటం .. అతనికి ఎదురయ్యే పరిస్థితులు .. అతని అన్నయ్య కూతురు అదృశ్యం కావడం .. ఆ పాప కోసం జరిగే అన్వేషణ వరకూ కథ ఇంట్రెస్టింగ్ గానే వెళుతుంది. ఆ తరువాత ఆ స్థాయి ఉత్కంఠ తగ్గుతుంది. కథ కాస్త పట్టు సడలినట్టుగా అనిపిస్తుంది. కథ నిదానంగా ... కాస్త రొటీన్ గా మొదలవడం .. చివర్లో పట్టుతగ్గడం కనిపిస్తుంది. సహజత్వం .. సందేశం మంచి మార్కులు కొట్టేస్తాయి.      

ఈ సినిమాలో హీరో .. అతని వదిన ... పాప .. హీరో లవర్ .. అతని స్నేహితుడు .. నేరస్థుడు ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తాయి. అందరూ కూడా సహజత్వానికి దగ్గరగా తమ పాత్రలను తీసుకుని వెళ్లారు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం .. బాలాజీ సుబ్రమణ్యం కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. సురేశ్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ కి దూరంగా, ఎమోషన్స్ కి దగ్గరగా నడిచే ఈ కథ, ఓటీటీ ఆడియన్స్ కి ఫరవాలేదనిపిస్తుంది. 

Movie Details

Movie Name: Chinna

Release Date: 2023-11-28

Cast: Siddharth, Nimisha Sajayan, Anjali Nair, Sahasra

Director: Arun Kumar

Producer: Siddharth

Music: Vishal Chandrashekhar

Banner: Etaki Entertainment

Review By: Peddinti

Chinna Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews