'చావెర్' (సోనీ లివ్) మూవీ రివ్యూ

  • మలయాళ మూవీగా వచ్చిన 'చావెర్'
  • సింపుల్ లైన్ గా అనిపించే కథ 
  • ఇంట్రెస్టింగ్ గా నడిచే కథనం 
  • క్లైమాక్స్ లో బలమైన ట్విస్టు
  • లొకేషన్స్ ... ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం హైలైట్
  • ఎమోషన్స్ ను కనెక్ట్ చేసే క్లైమాక్స్   

మలయాళంలో క్రితం నెలలో థియేటర్స్ కి వచ్చిన సినిమాలలో కొన్నిటికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అలాంటి సినిమాల జాబితాలో 'చావెర్' ఒకటిగా కనిపిస్తుంది. టినూ పప్పచ్చన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కుంచాకో బోబన్ ప్రధానమైన పాత్రగా తెరకెక్కింది. అక్టోబర్ 5వ తేదీన అక్కడ విడుదలైన ఈ సినిమా, ఈ నెల 24 నుంచి 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా, ఇక్కడి ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.

తెల్లవారు జామున ఓ గ్రామంలోకి ఒక జీపు ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వర్షం పడుతుంటుంది. ఆ జీపులో అశోక్ (కుంచాకో బోబన్) ముస్తఫా (మనోజ్) ఆసిఫ్ (సజిన్ గోపు) థామస్ (అనురూప్) ఉంటారు. వాళ్లు నలుగురూ పక్కా ప్లాన్ ప్రకారం దారికాసి ఒక యువకుడిని దారుణంగా హత్య చేస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోతారు. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ఒక ఇంటికి వెళ్లి, రక్తసిక్తమైపోయిన తమ బట్టలను మార్చుకుంటారు. తెల్లవారగానే హత్య గురించిన వార్తతో ఊరంతా ఆందోళన నెలకొంటుంది. 

హత్య చేయబడింది కిరణ్ కుమార్ అనే యువకుడు. అతనిని 14 చోట్ల పొడిచారని ఊళ్లో వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. హంతకులను వెంటనే పట్టుకోవాలని ఊళ్లో వాళ్లు వీధుల్లోకి వచ్చి ఆందోళనకి దిగుతారు. దాంతో పోలీస్ బలగాలు దిగిపోతాయి. అయితే హత్య చేసేటప్పుడు అశోక్ కాలుకి కత్తి గాయమవుతుంది. ఆ బాధను అతను తట్టుకోలేకపోతుంటాడు. హాస్పిటల్ కి వెళితే అనుమానం వస్తుందని భావించిన ముస్తఫా, తనకి బాగా తెలిసిన అరుణ్ (అర్జున్ అశోకన్) కి కాల్ చేస్తాడు. 

అరుణ్ ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడు. ముస్తఫా కాల్ చేయడంతో .. తన స్నేహితుడు సూరజ్ (దీపక్) మెడికల్ షాపులో మందులు తీసుకుని, అతని బైక్ పైనే ముస్తఫా చెప్పిన చోటుకు చేరుకుంటాడు. పెట్రోల్ బాంక్ దగ్గర బైక్ పార్క్ చేసి .. ముస్తఫా జీప్ ఎక్కుతాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఒక నిర్జన ప్రదేశానికి వెళతారు. అశోక్ కాలుకి అయిన గాయం చూడగానే అరుణ్ కి డౌట్ వస్తుంది. హాస్పిటల్ కి వెళ్లక తప్పదని చెప్పి కట్టుకడతాడు. అతణ్ణి మళ్లీ పెట్రోల్ బాంక్ దగ్గర దింపాలనుకుంటారు. కానీ అక్కడ పోలీసుల హడావిడి ఎక్కువగా ఉండటంతో, ఫారెస్టు వైపు వెళతారు. 

ముస్తఫా తప్ప మిగిలిన ముగ్గురూ అరుణ్ కి తెలియదు. ఆ జీపులో వేటకొడవళ్లు .. నాటు బాంబులు ఉండటం చూసి అరుణ్ భయపడిపోతాడు. అశోక్ దగ్గర మాత్రమే ఫోన్ ఉంటుంది. ఆయనకి 'జీకే' అనే వ్యక్తి నుంచి ఎప్పటికప్పుడు కాల్స్ వస్తుంటాయి. ఆయన చెప్పినట్టుగా జీప్ రూట్ మార్చుకుంటూ ఉంటుంది. అలా అడవిలోని ఓ పాడుబడిన ఇంట్లో కొంతసేపు ఆగుతారు. వాళ్ల మాటలను రహస్యంగా విన్న అరుణ్ కి, ఊళ్లో జరిగిన హత్యకి వాళ్లే కారణమని తెలుస్తుంది. 

ఇక వాళ్లతో ఉంటే ప్రమాదమని గ్రహించిన అరుణ్ తప్పించుకుని పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పటికే పోలీసులు అతనిని కూడా ఒక అనుమానితుడిగా భావిస్తుంటారు. అతనికి బైక్ ఇచ్చిన సూరజ్ ను ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో అరుణ్ ఏం చేస్తాడు? జీకే ఎవరు? కిరణ్ కుమార్ ఎందుకు హత్య చేయబడ్డాడు? అనే అంశాలతో ఆసక్తిని రేకెత్తిస్తూ కథ ముందుకు వెళుతుంటుంది. 

అరుణ్ నారాయణన్ నిర్మించిన ఈ సినిమాకి జోయ్ మాథ్యూ కథను అందించాడు. ఈ కథకి టినూ పప్పచ్చన్ దర్శకత్వం వహించాడు. ఒక విలేజ్ .. నలుగురు హంతకులు .. హాస్పిటల్లో పనిచేసే ఒక యువకుడు. ఈ ఐదుగురు పాత్రల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. వాళ్లు ప్రయాణించే జీప్ ఫారెస్టు ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ ప్రధానమైన పాత్రలు ..పెద్దగా బడ్జెట్ అవసరం లేని కథ ఇది. కానీ మొదటి నుంచి చివరివరకూ కూర్చోబెట్టేస్తుంది. 

దర్శకుడు ఈ ఐదు పాత్రలను డిజైన్ చేసిన తీరు .. వాటిని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఒక సాధారణ జీవితం గడిపే యువకుడికి హంతకులతో కలిసి ప్రయాణం చేయవలసి రావడం ఎంత నరకంగా ఉంటుందనేది దర్శకుడు గొప్పగా చూపించాడు. హంతకుల జీప్ ప్రయాణం చేసే ఫారెస్ట్ లొకేషన్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. జింటో జార్జ్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. జస్టిన్ వర్గీస్ నేపథ్య సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది. 

ఆర్టిస్టులంతా చాలా నేచురల్ గా చేశారు. ఎక్కడా నాటకీయత కనిపించదు. ఒక హత్య .. పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే హంతకులు. ఇందులో కొత్తదనం ఏముంది? అనుకుంటాం. కానీ అసలు వీళ్లతో ఆ హత్య ఎవరు చేయించారు? అతను వీళ్లకు చెప్పిన కారణం ఏమిటి? అసలు కారణం ఏమిటి? అనేదే కంటెంట్ మొత్తం కలిపి అందించే ట్విస్టు. ప్రేక్షకులను ఎమోషన్స్ కి గురిచేసే ట్విస్టు ఇది. కంటెంట్ మొత్తానికి కలిపి ఇక్కడే మార్కులు పడతాయి. ఈ మధ్య కాలంలో సింపుల్ బడ్జెట్ లో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ మూవీగా దీనిని గురించి చెప్పుకోవచ్చు.

Movie Details

Movie Name: Chaaver

Release Date: 2023-11-24

Cast: Kunchacko Boban,Arjun Ashokan, Sajin Gopu, Anuroop, Manoj, Deepak Parambol

Director: Tinu Pappachan

Producer: Arun Narayan

Music: Justin Varghese

Banner: Arun Narayan Productions

Review By: Peddinti

Chaaver Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews