'ది రోడ్' (ఆహా) మూవీ రివ్యూ

  • త్రిష ప్రధానపాత్రగా రూపొందిన 'ది రోడ్'
  • హైవే నేపథ్యంలో నడిచే కథ 
  • ఆసక్తిని రేకెత్తించే ట్విస్టులు 
  • హైలైట్ గా నిలిచే ఫొటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్

త్రిష ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వెళుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో వరుస సినిమాలతో ఆమె తన జోరు చూపిస్తోంది. అలా తమిళంలో ఆమె చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమానే 'ది రోడ్'. ఈ ఏడాది అక్టోబర్ 6వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, అక్కడి థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 10వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కంటెంట్ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

మీరా (త్రిష)  ఆమె భర్త ఆనంద్ (సంతోష్ ప్రతాప్) వారి ఒక్కగానొక్క సంతానం కవిన్ (సాత్విక్) ఇది వారి కుటుంబం. కవిన్ కి పదేళ్లు ఉంటాయి ... మీరా మళ్లీ గర్భవతి అవుతుంది. దాంతో ఆమె జాబ్ మానేసి ఇంటి దగ్గరే రెస్టు తీసుకుంటూ ఉంటుంది. తన బర్త్ డేను కన్యాకుమారిలో జరపాలని కవిన్ పట్టుపడతాడు. కార్లో వెళితేనే ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుందని మొండికేస్తాడు. దాంతో తాను అంత దూరం ప్రయాణం చేయకూడదని మీరా డ్రాప్ అవుతుంది. 

ఆనంద్ - కెవిన్ ఇద్దరూ కూడా కార్లో బయల్దేరతారు. తన స్నేహితురాలు ఉమా (మియా జార్జ్) ఆమె భర్త ప్రసాద్ (వివేక్ ప్రసన్న) మార్గమధ్యంలో ఆనంద్ వాళ్లతో జాయిన్ అయ్యేలా మీరా ప్లాన్ చేస్తుంది. రాత్రివేళ కారు హైవేపై వేగంగా వెళుతూ ఉంటుంది. ఆనంద్ కారుకి ఎదురుగా గంగాధర్ అనే బిజినెస్ మెన్ కారు వస్తూ ఉంటుంది. ఆ కారు హఠాత్తుగా అదుపుతప్పి వచ్చి ఆనంద్ కారును ఢీ కొడుతుంది. ఆ ప్రమాదంలో ఆనంద్ .. అతని కొడుకు స్పాట్ లోనే చనిపోతారు.

ఉమ ద్వారా విషయం తెలుసుకున్న మీరా నిర్ఘాంతపోతుంది. ఆ షాక్ నుంచి ఆమె కొంత తేరుకునే వరకూ ఉమ తోడుగా ఉంటుంది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఉమతో కలిసి మీరా వెళుతుంది. ఆ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని మీరా వింటుంది. తన భర్త .. కొడుకు చనిపోవడానికి అనుకోని ప్రమాదం కారణం కాదనీ, పక్కాగా ప్లాన్ చేయడం వలన జరిగిందనే సందేహం మీరాకి కలుగుతుంది. 

ఒకే ప్రదేశంలో తరచుగా ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయాన్ని కనుక్కోవాలని భావిస్తుంది. ఈ విషయంలో నిజం తీసుకోవడానికి ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ఆ ప్రయత్నాల్లో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ప్రాణాలకు తెగించి ఆమె కనుక్కునే ఆ నిజాలు ఏమిటి? రహదారిపై పథకం ప్రకారం జరుగుతున్న ప్రమాదాల వెనుక ఎవరున్నారు? అనేవి ఈ కథలోని ఆసక్తికరమైన అంశాలు.

దర్శకుడు అరుణ్ వశీగరన్ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ ఇది. కంటెంట్ పరంగా చూసుకుంటే చాలా సింపుల్ కంటెంట్ అనిపిస్తుంది. తారాగణం పరంగా చూసుకుంటే అరడజనుకు మించి ప్రధానమైన పాత్రలు కనిపించవు. హైవే నేపథ్యంలో నడిచే కథ కావడం వలన పెద్ద బడ్జెట్ కూడా తెరపై కనిపించదు. కానీ ట్రీట్మెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ  ప్రేక్షకుడిని కూర్చోబెట్టేస్తుంది.

దర్శకుడు ప్రధానమైన కథతో పాటు ఒక ప్రొఫెసర్ కథను కూడా ఎంచుకుని, దానిని కూడా సమాంతరంగా నడిపిస్తూ వెళ్లాడు. అతని కాలేజ్ లో చదివే ఒక యువతి ఆ ప్రొఫెసర్ ను ప్రేమిస్తుంది. అతను ఆమె ప్రేమను తిరస్కరించడంతో, అతని పరువు తీస్తుంది. ఫలితంగా అతను తన జాబ్ తో పాటు, తండ్రిని కూడా కోల్పోతాడు. దర్శకుడు ఈ ట్రాక్ ను ఎందుకు చూపిస్తున్నాడనేది చాలా సేపటివరకూ అర్థం కాదు. ఆ ట్రాక్ ను ఆయన ప్రధానమైన కథతో కలిపిన తీరు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. 

దర్శకుడు ప్రీ క్లైమాక్స్ ను .. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాకి ప్రధానమైన బలంగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వెంటవెంటనే వచ్చే ట్విస్టులతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. చిన్న బడ్జెట్ లోనే బలమైన కంటెంట్ ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కేజీ వెంకటేశ్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. హైవే షాట్స్ ను ఆయన చిత్రీకరించిన తీరుకి ఎక్కువ మార్కులు పడిపోతాయి. 

సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. శివరాజ్ ఎడిటింగ్ వర్క్ చాలా నీట్ గా అనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన సీన్స్ కనిపించవు. త్రిష యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. భర్తను .. కొడుకును కోల్పోయి, వారి మరణానికి కారణాన్ని అన్వేషించే మీరా పాత్రకి ఆమె జీవం పోసింది. ఎమోషన్స్ ను గొప్పగా పలికించింది. రాత్రివేళలో హైవేపై ప్రయాణం చేసేవారిని ఆలోచింపజేసే సినిమాగా దీనిని గురించి చెప్పుకోవచ్చు. 

ప్లస్ పాయింట్స్: ఆసక్తికరమైన కథాకథనాలు .. ఉత్కంఠను పెంచే ట్విస్టులు .. ప్రధానమైన బలంగా నిలిచిన ఫొటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్. 


Movie Details

Movie Name: The Road

Release Date: 2023-11-10

Cast: Trisha, Shabeer Kallarakkal,Santhosh Prathap, Miya George, Vivek Prasanna, M. S. Bhaskar

Director: Arun Vaseegaran

Producer: AAA Cinemaa

Music: Sam C. S.

Banner: AAA Cinemaa

Review By: Peddinti

The Road Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews