'చంద్రముఖి 2' - మూవీ రివ్యూ

  • కంగనా ప్రధానమైన పాత్రగా 'చంద్రముఖి 2'
  • ఆ పాత్రలో అంతగా నప్పని హీరోయిన్ 
  • పట్టుగా .. పకడ్బందీగా సాగని కథాకథనాలు 
  • 'రారా' పాట ట్యూన్ మార్చడం ఒక మైనస్

రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వం వహించిన 'చంద్రముఖి' 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాల పరంగా .. సంగీతం పరంగా ఆ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇంతకాలమైనా ఆ సినిమాను మరిచిపోలేదు. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ గా 'చంద్రముఖి 2' సినిమా రూపొందింది. లారెన్స్ - కంగనా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజునే విడుదలైంది. పి.వాసు దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమా, 'చంద్రముఖి'ని అధిగమించగలిగిందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం. 

రంగనాయకి (రాధిక) శ్రీమంతురాలు. ఆ ఫ్యామిలీ ఎన్నో వ్యాపార వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె పెద్ద కూతురు, ఆ కుటుంబానికి దూరమవుతుంది. ఆ తరువాత ఆ కూతురు - అల్లుడు కూడా ఒక ప్రమాదంలో చనిపోతారు. రెండో కూతురు దివ్య (లక్ష్మి మీనన్) ఒక ప్రమాదంలో గాయపడి, వీల్ చైర్ కి  పరిమితమవుతుంది. ఇక వ్యాపార పరంగా కూడా ఆ ఫ్యామిలీ నష్టాలను ఎదుర్కుంటూ ఉంటుంది. 

దాంతో మంచి పేరున్న సిద్ధాంతి (రావు రమేశ్)ని పిలిపించి విషయం చెబుతారు. కులదైవాన్ని మరిచిపోవడం వల్లనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయనీ, అందువలన సొంత ఊరుకు వెళ్లి మండలం రోజుల పాటు కులదైవాన్ని ఆరాధించమని సూచిస్తాడు. అయితే రంగనాయకి తన అన్నయ్య .. తమ్ముళ్లు .. వారి భార్య పిల్లలు చాలామంది కలిసి ఉమ్మడిగానే ఉంటూ ఉంటారు. అందువలన సొంత ఊరుకి దగ్గరలో ఒక బంగ్లాను అద్దెకి తీసుకుంటారు. 

 ఆ బంగ్లా యజమాని బసవయ్య (వడివేలు) తాను కూడా అదే ఇంట్లో ఉంటూ వాళ్లకి కావలసిన ఏర్పాట్లు చూస్తుంటాడు. అయితే ఆ బంగ్లాలో దక్షిణం వైపుకు మాత్రం వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. రంగనాయకి పెద్ద కూతురు పిల్లలకు మదన్ (లారెన్స్) గార్డియన్ గా ఉంటాడు. ఆమె కోరిక మేరకు అక్కడికి పిల్లలను తీసుకొచ్చిన ఆయన, అక్కడే ఉండిపోవలసి వస్తుంది. ఆ ఇంట్లో పాలేరు కూతురు లక్ష్మి (మహిమా నంబియార్) అందరితోనూ ఎంతో కలివిడిగా ఉంటుంది. 

రంగనాయకి కుటుంబ సభ్యులు కులదైవాన్నీ దర్శించుకోవడానికి వెళతారు. ఆ దేవాలయం పాడుబడిపోయి ఉంటుంది. చాలా కాలం క్రితం చనిపోయిన వేట్టై రాజుకి ఆ గుడితో సంబంధం ఉందనీ, ఆ గుడిలో దీపం వెలిగిస్తే అతని ప్రేతాత్మ చైతన్యాన్ని పొందుతుందని వారికి తెలుస్తుంది. అందువలన ఎవరూ దీపం పెట్టకుండా 'చంద్రముఖి' ప్రేతాత్మ అడ్డుపడుతూ ఉంటుందని తెలిసి షాక్ అవుతారు. తమ కులదైవాన్ని పూజించి తమ దోషాలను పోగొట్టుకోవడానికే వాళ్లు నిర్ణయించుకుంటారు. పర్యవసానంగా ఏం జరుగుతుందనేదే కథ.

దర్శకుడు పి. వాసు ఈ కథను ఎత్తుకున్న తీరు ఆసక్తికరంగానే అనిపిస్తుంది. గతంలో తాము తరచూ దర్శిస్తూ వచ్చిన కులదైవం ఆలయం తలుపులు తెరవడం ఒక అంశం. 17 ఏళ్ల క్రితం చంద్రముఖి - వేట్టై రాజు తలపడిన బంగ్లాలో రంగనాయకివాళ్లు ఉండవలసి రావడం .. ఇప్పుడు ఆ రెండు ప్రేతాత్మలతో ముడిపడిన ఇంటికీ .. గుడికి మధ్య  నలిగిపోవడం మరో అంశం. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. 


ఇది హారర్ థ్రిల్లర్ .. మొదటి నుంచే భయపెట్టేద్దామనే ఆలోచన దర్శకుడు చేయలేదు. కథ మొదలైన అరగంటకి 'చంద్రముఖి' చిత్రపటాన్ని చూపించాడు. గంట తరువాతనే 'చంద్రముఖి' పాత్రకు ఎంట్రీ ఇప్పించాడు. 'చంద్రముఖి' ఉద్దేశం ఏమిటి? ఆమె ఎవరిని ఆవహించింది? ఆ విషయం ఎలా బయటపడుతుంది? అనే అంశాలు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. గతంలో వచ్చిన 'చంద్రముఖి'ని గుర్తు చేస్తూ .. ఆ కథను కూడా అక్కడక్కడా లింక్ చేస్తూ వెళ్లారు.


అయితే గుణశేఖర్ తో చంద్రముఖి లవ్ .. అది వేట్టై రాజుకి తెలిసి శిక్షించడం .. ఆ ప్రతీకారంతో రగిలిపోయిన చంద్రముఖి  అది తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేయడం .. ఇదంతా చూస్తే, 'చంద్రముఖి' సినిమానే మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లారెన్స్ పాత్ర వైపు నుంచి కొంత కొత్తదనం కోసం ట్రై చేశారు. ఆ ఎపిసోడ్ ఫరవాలేదు .. కానీ చివరికి వచ్చేసరికి, 'చంద్రముఖి 2'ను కాకుండా 'చంద్రముఖి'నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. 

'చంద్రముఖి' సినిమాకి స్క్రీన్ ప్లే ఒక రేంజ్ లో ఉంటుంది. రజనీ .. ప్రభు ... జ్యోతిక .. నయనతార .. నాజర్ .. మాళవిక .. సోనూ సూద్ .. ఇలా ఒక బలమైన తారాగణం కనిపిస్తుంది. ఈ సినిమాలో అది లోపించిందనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. 'చంద్రముఖి' చూస్తుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ రేకెత్తుతుంది. కానీ 'చంద్రముఖి 2' విషయంలో అలా అనిపించదు. ముఖ్యంగా హారర్ ట్రాక్ మధ్యలో కామెడీ అసలే పేలలేదు. 

దర్శకుడు వాసు  ఇంటర్వెల్ బ్యాంగును గొప్పగా తీశాడు. కానీ ఆ తరువాత కథను ఆ స్థాయిలో నడిపించలేకపోయారు. ఇక కంగనా రనౌత్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావొచ్చు .. కానీ  'చంద్రముఖి' పాత్రకి ఆమె నప్పలేదు. అలాగే ఆమెకి హెయిర్ స్టైల్ కూడా సెట్ కాలేదు. తెరపై ఆమె  గ్లామరస్ గా కనిపించిందిగానీ, 'చంద్రముఖి'లో జ్యోతిక మాదిరి భయపెట్టలేకపోయింది. 


'వేట్టై రాజు' పాత్రలో రజనీ చేసిన మేజిక్ ను ఎవరూ మరిచిపోలేదు. అదే తరహా పాత్రలో లారెన్స్ తన మార్క్ చూపించాడు. చంద్రముఖి ఆవహించినట్టుగా లక్ష్మి మీనన్ బాగా చేసింది. మహిమ నంబియార్ తో సహా మిగతా పాత్రలకు పెద్దగా పనిలేదు. 'చంద్రముఖి' విజయంలో పాటలు ప్రధానమైన పాత్రను పోషించాయి. సంగీత దర్శకుడు 'విద్యాసాగర్' ఆ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. 

'చంద్రముఖి 2'లో 'స్వాగతాంజలి'  మినహా మిగతా పాటలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రాణంగా చెప్పుకునే 'రారా.. ' అనే పాట ట్యూన్ మార్చడంతో తేలిపోయింది. గతంలోని మేజిక్ ను మిస్సయినట్టు అయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రాజశేఖర్ ఫొటోగ్రఫీ బాగుంది. పాటల చిత్రకరణ మరింత అందంగా సాగింది .. ఎడిటింగ్ ఓకే. మొత్తంగా చూసినా ... ఏ రకంగా తీసుకున్నా, 'చంద్రముఖి'ని 'చంద్రముఖి 2' అధిగమించలేకపోయిందనే చెప్పాలి. 

Movie Details

Movie Name: Chandramukhi2

Release Date: 2023-09-28

Cast: Kangana Ranaut, Raghava Lawrence, Raadhika Sarathkumar, Vadivelu, Mahima Nambiar, Lakshmi Menon

Director: P. Vasu

Producer: Subaskaran

Music: Keeravani

Banner: Lyca Productoins

Review By: Peddinti

Chandramukhi2 Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews