'జోడి' మూవీ రివ్యూ

ఒక వైపున జూదానికి బానిసైన తండ్రి .. మరో వైపున తను ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు. తన ప్రేమకి తన తండ్రి వ్యసనమే అడ్డంకిగా మారినప్పుడు ఆ యువకుడు ఏం చేశాడనేదే కథ. ఎమోషన్ ను జోడీగా చేసుకుని నడిచిన ఈ ప్రేమకథ ఓ మాదిరిగా అనిపిస్తుంది.
ఇండస్ట్రీలోకి హిట్ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్, ఆ తరువాత ఒకటి రెండు సక్సెస్ లను మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగాడు. వరుస పరాజయాలు ఎదురవుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు తాను చేస్తూనే వున్నాడు. అలా ఆయన చేసిన మరో ప్రయత్నమే 'జోడి' చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్ తో ఆయన కట్టిన 'జోడి' .. ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కమలాకర్ (సీనియర్ నరేశ్) మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. ఆయన క్రికెట్ బెట్టింగుల పిచ్చిని భార్య ( మిర్చి మాధవి) భరించలేకపోతుంటుంది. ఆయన కొడుకు కపిల్ (ఆది సాయికుమార్) ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తుంటాడు. సింప్లిసిటీని ఎక్కువగా ఇష్టపడే కాంచనమాల (శ్రద్ధా శ్రీనాథ్)ను తొలిసారి చూడగానే ఆయన మనసు పారేసుకుంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కాంచనమాల, బాబాయ్ - పిన్ని(షిజు - సితార) దగ్గర పెరుగుతుంది. తాతయ్య (గొల్లపూడి) ఆమెకి కొండంత అండ. ఒక ఇనిస్టిట్యూట్ లో ఫ్రెంచ్ లాగ్వేజ్ ను బోధిస్తూ ఆ కుటుంబానికి కాంచనమాల తనవంతు తోడ్పాటును అందిస్తుంటుంది. కపిల్ ను ఇష్టపడిన ఆమె, ఇంట్లో తమ ప్రేమ విషయాన్ని చెబుతుంది. కపిల్ తో మాట్లాడటం కోసం ఆమె బాబాయ్ ఒక హోటల్లో మీటింగును ఏర్పాటు చేస్తాడు. అప్పుడు ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటన ఎలాంటి మలుపులకు కారణమవుతుంది? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది.

దర్శకుడు విశ్వనాథ్ అరిగెల లవ్ ను -- ఎమోషన్ ను కలుపుకుంటూ తయారు చేసిన కథగా 'జోడి' కనిపిస్తుంది. కథలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తను చెప్పదలచుకున్న విషయాన్ని ఆయన చాలా నీట్ గా చెప్పాడు. ఇంటర్వెల్ కి మంచి బ్యాంగ్ తో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిన ఆయన, క్లైమాక్స్ విషయాని కొచ్చేసరికి చాలా సిల్లీగా తేల్చేశాడు. కథలోగానీ .. కథనంలోగాని ఎక్కడా కొత్తదనమనేది కనిపించదు. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందనేది కొంతమంది ప్రేక్షకులు ప్రీ క్లైమాక్స్ లోనే గ్రహించేస్తారు. అయితే ఆయా శాఖల నుంచి మంచి అవుట్ పుట్ ను రాబట్టుకోవడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.

కథానాయకుడిగా ఆది సాయికుమార్ కపిల్ పాత్రలో బాగా చేశాడు. ఒక వైపున వ్యసనపరుడైన తండ్రిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించే కొడుకుగా .. మరో వైపున తన ప్రేమను గెలిపించుకునే ప్రియుడిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక కాంచనమాల పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ మెప్పించింది. ఈ సినిమాకి ఆమెనే ప్రధానమైన ఆకర్షణ. కథానాయిక పాత్రకే ప్రేక్షకులు కళ్లను తగిలించేశారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కలువ రేకుల్లాంటి తన కళ్లతో అవలీలగా ఆమె హావభావాలను పలికించింది. ఇక క్రికెట్ బెట్టింగ్ కి బానిసైపోయిన పాత్రలో సీనియర్ నరేశ్ నటన బాగుంది. ఆ బలహీనత నుంచి బయటపడే ఎమోషనల్ సీన్ లో ఆయన నటన హైలైట్ గా నిలుస్తుంది. ఇక హీరోయిన్ తాత పాత్రకు గొల్లపూడి నిండుదనాన్ని తీసుకొచ్చాడు. ఇక సితార .. షిజు .. వెన్నెల కిషోర్ .. సత్య .. మిర్చి మాధవి .. కొత్త నటుడు ప్రదీప్ పాత్ర పరిథిలో నటించారు.

సాదాసీదాగా సాగే ఈ కథకు బలాన్ని చేకూర్చిన ప్రధానమైన అంశాల్లో సంగీతం ఒకటిగా కనిపిస్తుంది. ఫణి కల్యాణ్ సమకూర్చిన బాణీలు బాగున్నాయి. ఇది నిజమే .. మెల్లమెల్లగా .. చెలియా మాటే .. సఖియా అనే పాటలు చక్కని ఫీల్ ను కలిగిస్తాయి. ముఖ్యంగా 'చెలియ మాటే' పాటకి ఎక్కువ మార్కులు దక్కుతాయి. ఈ సినిమాకి కలిసొచ్చిన మరొక అంశం విశ్వేశ్వర్ ఫొటోగ్రఫీ అనే చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని .. ప్రతి పాటను తెరపై ఆయన అందంగా ఆవిష్కరించాడు. నాయకా నాయికలను చాలా చక్కగా చూపించాడు. పాటలు ఆయన పనితనానికి అద్దం పడతాయి. ఇక ఎడిటింగ్ పరంగా చూసుకుంటే కత్తెర పడాల్సిన సీన్లు కొన్ని కనిపిస్తాయి. హీరో బాల్యానికి సంబంధించిన సీన్స్ .. ఆది సాయికుమార్ - సత్య కలిసి ప్లాట్లు అమ్మే సీన్స్ .. షేకింగ్ శేషు సీను సాగతీతగా అనిపిస్తాయి. మాటలు సందర్భానికి తగినట్టుగా వున్నాయి .. రీ రికార్డింగ్ ఫరవాలేదు.

కొత్తదనం లేని కథ .. ఆసక్తికరంగా అనిపించని మలుపులు .. సరిగ్గా అల్లని కామెడీ ట్రాక్ .. అక్కడక్కడ అనవసరమైన సన్నివేశాల హడావిడి .. ప్రీ క్లైమాక్స్ తరువాత స్క్రీన్ ప్లే జారిపోతూ వచ్చి, క్లైమాక్స్ తేలిపోవడం కారణంగా సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుంది. కథాకథనాల్లో కొత్తదనం గనుక వుంటే, సంగీతం - ఫొటోగ్రఫీ అందించిన సపోర్ట్ కి ఈ సినిమా మరోమెట్టుపైన కనిపించి వుండేదని చెప్పచ్చు!      


Movie Details

Movie Name: Jodi

Release Date: 2019-09-06

Cast: Aadi Sai Kumar, Shraddha srinath, Gollapudi, Naresh, Sitara, Vennela Kishore, Sathya

Director: Vishvanath Arigela

Producer: Sai venkatesh Gurram

Music: Phani kalyan

Banner: Bhavana Creations

Review By: Peddinti

Jodi Rating: 2.25 out of 5


More Movie Reviews