'కస్టడీ' - మూవీ రివ్యూ

  • చైతూ తాజా చిత్రంగా వచ్చిన 'కస్టడీ' 
  • ఆకట్టుకోని కథాకథనాలు
  • హడావిడి తప్ప జీవం లేని సన్నివేశాలు
  • సరిగ్గా డిజైన్ చేయని పాత్రలు  
  • నిరాశపరిచిన పాటలు 
  • మంచి మార్కులు దక్కించుకున్న ఫొటోగ్రఫీ

తమిళ హీరోలు టాలీవుడ్ దర్శకులను లైన్లో పెట్టి, వాళ్లతో ద్వి భాషా చిత్రాలు చేస్తుంటే, నాగచైతన్య మాత్రం అందుకు భిన్నంగా కోలీవుడ్ దర్శకుడితో ద్విభాషా చిత్రం చేశాడు. అలా ఆయన చేసిన సినిమానే 'కస్టడీ'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, చైతూ జోడీగా కృతి శెట్టి నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ లైన్ చాలా కొత్తగా అనిపిస్తుందంటూ చైతూ చెబుతూ వచ్చిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.
 
శివ (నాగచైతన్య) మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. 'సఖినేటి పల్లి' పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. రేవతి (కృతి శెట్టి) ఓ డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. ఆమెతో శివ ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అతనితో పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోడు. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య కొంత ఘర్షణ నడుస్తూ ఉంటుంది. శివతో వెళ్లిపోవడానికే రేవతి సిద్ధపడుతుంది. 

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి దాక్షాయణి (ప్రియమణి) తన పదవిని కాపాడుకోవడం కోసం అనేక నేరాలకు పాల్పడుతూ ఉంటుంది. రౌడీ షీటర్ రాజు (అరవింద్ స్వామి) ఆమె అప్పగించిన దుర్మార్గాలను పూర్తి చేస్తుంటాడు. ఇక ఐజీగా ఉన్న నటరాజన్ ( శరత్ కుమార్) కూడా ఆమెకి పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే సిబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజు)కి రాజు దొరికిపోతాడు.

బెంగుళూర్ లోని సీబీఐ కోర్టుకు రాజును జార్జ్ తీసుకుని వెళుతుండగా, సఖినేటి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం జరుగుతుంది. అవినీతి పరులైన కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ జార్జ్ ను అంతం చేసి, రాజును అక్కడి నుంచి తప్పించాలని చూస్తారు. రాజు ఎంతటి భయంకరమైన నేరస్థుడో చెప్పిన జార్జ్, అతణ్ణి ఫలానా సమయానికి బెంగుళూర్ సీబీఐ కోర్టులో అప్పగించమని శివను కోరతాడు. అప్పుడు శివ ఏం చేస్తాడు? అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేదే కథ. 

వెంకట్ ప్రభు తమిళంలో స్టార్ హీరోలతో సూపర్ హిట్లను తీసినవాడే. అందువలన సహజంగానే 'కస్టడీ' పై అంచనాలు ఉంటాయి. ఇక టైటిల్ తోనే ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది. టీజర్ .. ట్రైలర్ చూసినవారు సినిమాలో విషయం కాస్త గట్టిగానే ఉందని అనుకుంటారు. అలా అనుకుని థియేటర్స్ కి వెళ్లినవారిని నిరాశపరిచే సినిమా ఇది. తెరపై చాలా హడావిడి జరుగుతూ ఉంటుంది .. ప్రేక్షకుల ముఖంలో మాత్రం ఎక్స్ ప్రెషన్స్ మారవు. 

ఒక భయంకరమైన నేరస్థుడిని గడువులోగా సీబీఐ కోర్టులో హాజరుపరచాలి. ఆ బాధ్యతను మోసేది ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్. ఆ నేరస్థుడు సీబీఐ కోర్టుకు చేరుకునేలోగా ప్రాణాలతో ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి ఆదేశం. ఆమె ఆదేశాన్ని పాటిస్తూ ఆ కానిస్టేబుల్ ను అడుగడుగునా అడ్డుకునే అవినీతి అధికారులు. ఒక ముఖ్యమంత్రిని ఎదిరిస్తూ .. ఒక ప్రమాదకరమైన నేరస్థుడితో కానిస్టేబుల్ ప్రయాణించడం అన్నది చాలా టెన్షన్ తో కూడుకున్న కథ. 

కానీ తెరపై ఏ పాత్ర ఎంత టెన్షన్ పడుతున్నా ప్రేక్షకులు తమకేమీ పట్టనట్టుగా అలా చూస్తుంటారు. అందుకు కారణం వారు యాక్షన్ విషయంలోగానీ .. ఎమోషన్స్ పరంగా గాని  కనెక్ట్ కాకపోవడమే. సినిమా మొదలైన 40 నిమిషాల తరువాత నుంచి కథ ఒక రేంజ్ కి వెళుతుందని ప్రమోషన్స్ లో చైతూ చెప్పాడు. కానీ ఆ 40 నిమిషాల సేపు ఓపికతో కూర్చోవడం ప్రేక్షకులకు పెద్ద పరీక్షగా మారుతుంది. 

హీరో ... హీరోయిన్ లవ్ ట్రాక్ చప్పగా సాగుతుంది. చైతూకి ఇది తగిన పాత్ర కాదేమో అనిపిస్తుంది. కృతి శెట్టి పాత్రకి  లైట్ గా డీ గ్లామర్ టచ్ ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు. ఇక ప్రియమణిని ముఖ్యమంత్రి పాత్రలో చూపించారుగానీ .. ఆ హుందాతనాన్ని తీసుకురాలేకపోయారు. అరవింద్ స్వామి కూడా రాజు పాత్రకి సెట్ కాలేదు .. ఆయనకి అసలు విగ్గే సెట్ కాలేదు. 'నా వాళ్లంతా వచ్చి మిమ్మల్ని ఏసేసి నన్ను తీసుకునిపోతారు' ఈ ఒక్క డైలాగ్ ను ఆయనతో పదే పదే చెప్పించారు. 

ఇక శరత్ కుమార్ తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా  అంతంత మాత్రంగానే ఉంది. చాలా కాలం తరువాత మాజీ ఆర్మీ ఆఫీసర్ గా సీనియర్ హీరో  'రాంకీ' కనిపించాడు. ఆయన పాత్రతో కాస్త హడావిడి చేద్దామని ప్రయత్నించారు గానీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. సెట్ కాని  విగ్ పెట్టేసి వెన్నెల కిశోర్ పాత్ర ద్వారా కామెడీని కవర్ చేయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. 

నిర్మాణ విలువల పరంగా వంకబెట్టడానికి వీలులేని ఈ సినిమాకి సంగీతాన్ని అందించినది, ఇళయరాజా - యువన్ శంకర్ రాజా. పాటల పరంగా చెప్పుకోవాలంటే ఒక్క పాట కూడా మనసుకు పట్టుకోదు. బ్యాక్ గ్రౌండ్  స్కోర్ విషయానికి వస్తే, ఒక రేంజ్ లో ఉంది. కాకపోతే అందుకు తగిన సన్నివేశాలే తెరపై మనకి కనిపించవు. ఎస్.ఆర్. కథిర్ ఫొటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే మొదటి 40 నిమిషాల్లోను కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేయవచ్చు. కొన్ని బిట్స్ లేపేయవచ్చు కూడా. రియల్ గా కొట్టుకుంటున్నట్టుగానే ఫైట్స్ ను శివ - మహేశ్ డిజైన్ చేశారు. కొరియోగ్రఫీ కూడా ఫరవాలేదు.

ప్లస్ పాయింట్స్: నిర్మాణ విలువలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్: కథ .. కథనం .. పాటలు .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. వర్కౌట్ కానీ కామెడీ .. స్టార్స్ ను ఉపయోగించుకోలేకపోవడం. 

Movie Details

Movie Name: Custody

Release Date: 2023-05-12

Cast: Nagachaitanya, Krithi Shetty, Aravind Swami, Sarath Kumar, Vennela Kishore, Priyamani, Anandi

Director: Venkat Prabhu

Producer: Srinivasa Chitturi

Music: Ilaya Raja

Banner: Srinivasa Silver Screen

Review By: Peddinti

Custody Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews